బ్యాటిల్ ఆఫ్ డిసెంబర్..! భీతిల్లిన డ్రాగన్..!!

Sep 14, Mon 2020 08:53 PM Right Angle

మౌనం యుద్ధ రచన చేస్తుంది. ఆగ్రహం శాంతిని ఆశ్రయిస్తుంది. తపస్సు వ్యూహానికి పదును పెడుతుంది. తమస్సు ఉషస్సుకోసం పరితపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సవ్యసాచిగా పేరుగాంచిన రక్షణరంగ నిపుణుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ల మౌనం శతృవు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సెప్టెంబర్ 10న గ్లోబల్ టైమ్స్ పత్రిక చిత్రమైన సంపాదకీయం రాసింది. భారత్ తో చర్చలకు సిద్ధమే కానీ, యుద్ధ సన్నద్ధతతో చర్చలకు రావాలంటూ జిత్తులమారి హెచ్చరికలు చేసింది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే డ్రాగన్ యుద్ధానికి రోజులు దగ్గరపడ్డాక పునరాలోచనలో పడింది. రణరంగంలోకి దిగిన తర్వాత భారత్ తన సత్తా చాటితే....చైనా పరిస్థితి ఏంటి? గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం ఏమంటోంది? ‘‘Indian nationalist forces yield to coercion, but not to persuasion.’’ భారత జాతీయవాద శక్తులు శాంతిని అనునయిస్తూ....యుద్ధాన్ని అనివార్యం చేస్తున్నారంటూ కువ్యాఖ్య వెనుక చైనా ఎత్తులు ఏంటి? చైనా ఆసియా వ్యూహానికి దీటైన ప్రతి వ్యూహాన్ని భారత్ రచించిందా? మోదీ మౌనానికి కారణమేంటి? అజిత్ దోవల్ ఆంతర్యమేంటి? రాఫెల్ రాకతో యుద్ధ స్వభావంలోనే మార్పు వస్తుందా? భారత ఎయిర్ బేస్ లపై చైనా నిఘా పెట్టిందా? భారత్ యుద్ధ సన్నద్ధత చూసి చైనా ఖంగుతినిందా?

వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలను చర్చలతో పరిష్కరించుకుందామంటూ.. ఆ చర్చలను సాగదీస్తూ.. మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా పక్కా వ్యూహాన్ని రచించుకుంది. అందులో భాగంగానే. తానూ ఎప్పటిలాగే రెండడుగులు ముందుకు వేసి.. ఒక అడుగు వెనక్కి వెళ్లే నాటకం ఆడాలనుకుంది. పాంగాంగ్‌ ఉత్తర తీరంలోని ఫింగర్‌-2 వరకూ ఆక్రమించేద్దామని సిద్ధమైంది. దానికి ఆగస్టు 29 అర్ధరాత్రి ముహూర్తం ఖరారు చేసింది. కరోనా కల్లోలం.. ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్‌ తనను ఎదిరించే సాహసం చేయదని అంచనాకు వచ్చింది. బుర్రనిండా ఇన్ని ఆలోచనలు పెట్టుకున్న డ్రాగన్‌కు.. యుద్ధ ట్యాంకులు, రాకెట్‌ లాంఛర్లతో భారత్‌ సన్నద్ధతను చూసి దిమ్మదిరిగిపోయింది. కీలకమైన శిఖరాలపై మన సైన్యం ముందుగానే పాగా వేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. డ్రాగన్‌ కుయుక్తలను పసిగట్టిన భారత సైన్యం రెండే రెండు గంటల్లో కీలకమైన బ్లాక్‌టాప్‌, హెల్మెట్‌, మగర్‌, గురుంగ్‌ శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. మూడు వైపులా సముద్రం, ఓ వైపు ఎడారి, ఇంకో వైపు పర్వత ప్రాంతాలు, సరిహద్దు వివాదాలు, గోతికాడ గుంటనక్క లాంటి శత్రువులు. బోర్డర్‌లో ప్రకృతితో పాటు ప్రమాదకరమైన శత్రువులతో పోరాడుతోంది భారత సైన్యం. గాల్వన్ లోయలో చైనాతో గొడవల వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సైన్యాన్ని బలోపేతం చేసే పనిలో పడింది కేంద్రం. అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తోంది.

యుద్ధం గెలవడానికి వ్యూహం అవసరం. యుద్ధం చెయ్యడానికి ఆయుధం అవసరం. సరిహద్దుల్లో బరి తెగించి రెచ్చిపోతున్న చైనా తోక కత్తిరించాలని జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ భావిస్తున్నారు. ఇటీవల గాల్వన్ లోయలో రెచ్చిపోయినా చైనా మూకలు.. మరోసారి తోక జాడిస్తే.. బుద్ది చెప్పేందుకు.. వాయుసేనకు కొత్త అస్త్రాలను అందిస్తోంది భారత ప్రభుత్వం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరుతున్న రాఫెల్ యుద్ద విమానాలు పాశుపతాస్త్రాలు.

ఇది 1962 నాటి ఇండియా కాదు. తమ వైపు కన్నెత్తి చూస్తే.. గుడ్లు పీకేస్తామని చైనాకు హెచ్చరికలు పంపుతోంది భారత ప్రభుత్వం. కొన్ని రోజుల క్రితం గాల్వన్ లోయలో చెలరేగిన ఘర్షణ తర్వాత.. చర్చల అనంతరం వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన చైనా.. మళ్లీ సరిహద్దుల వెంబడి సైనికుల్ని మోహరిస్తోంది. మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ సామెత చందంగా చైనాతో మాటల వల్ల లాభం లేదని భావిస్తున్న భారత ప్రభుత్వం... ఈసారి సరిహద్దుల్లో రెచ్చిపోతే.. గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందనంత ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లోనూ... శత్రు భీకరంగా పోరాడటంతో పాటు.. ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే చరిత్ర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ముల పొదిలో చేరాయి. ప్రపంచంలో అతి పెద్ద వైమానిక దళాల్లో భారత్‌ది నాలుగో స్థానం.ఎయిర్‌ఫోర్స్‌లో జెట్‌ ఫైటర్లు కీలకం. వేగంగా స్పందించడంతో పాటు కచ్చితంగా దాడి చేయడం వీటికున్న ప్రత్యేక లక్షణం. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన రాఫెల్ యుద్ధ విమానాల్ని ఇండియిన్ ఎయిర్‌ ఫ్లీట్‌లోకి తీసుకుంది.

చైనా సైన్యం వెనక్కి వెళ్లినట్లే వెళ్లి.. లడఖ్ నుంచి.. అరుణాచల్ ప్రదేశ్ లోని తవంగ్ వరకూ .. భారత్‌తో సరిహద్దు పొడవునా మళ్లీ సైనిక బలగాలను తరలిస్తోంది. చైనా సైన్యం గణాంకాల రూపంలో భారీగా కనిపిస్తున్నా.. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేసిన అనుభవం చైనా సైన్యానికి లేదు. రాఫెల్ తరహా జెట్ ఫైటర్లు కూడా చైనా దగ్గర లేవు. రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్న ఇంజిన్లు 11000 పౌండ్ల ఫోర్స్‌తో పనిచేస్తాయి. గంటకు 1912 కిలోమీటర్లు వేగంతో ఎగిరే సత్తా వీటి సొంతం. 3 డ్రాప్ ట్యాంకులతో 3700 కిలోమీటర్ల రేంజ్ వెళ్లగలవు. ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లతోపాటు ఎయిర్-టు-గ్రౌండ్, ఎయిర్-టు-సర్ఫేస్ మిస్సైళ్లని గురి తప్పకుండా ప్రయోగించే సత్తా వీటికుంది. AESA రాడార్‌తో ఇవి దూసుకెళ్తాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్‌లోకి రాఫెల్ జెట్‌ల రాక గేమ్‌ చేంజర్‌ లాంటిదే. రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు. గంటకి 2, 222కిలోమీటర్ల వేగంతో 50 వేల అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3700 కిలోమీటర్లు..ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15.27మీటర్లు. వింగ్ స్పాన్ ..దాదాపు 11మీటర్లు..ఒకేసారి 9500కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్ధ్యం రాఫేల్ సొంతం ఇది సుఖోయ్ యుద్ద విమానాల కంటే 1500కిలోలు ఎక్కువ. నిమిషానికి 2500 రౌండ్లు ఆయుధాలను పేల్చగలదు..అన్నింటికంటే పెద్ద విషయం..అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫేల్ అతి పెద్ద ప్రత్యేకత.

రాఫెల్ యుద్ధ విమానాల్లో ఉండే 16F జీరో జీరో ఎజెక్షన్ సీటు కారణంగా... జీరో స్పీడ్, జీరో ఆల్టిట్యూడ్‌లోనూ సమర్థవంతంగా పని చేస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో సమర్థవంతంగా పోరాడాలన్నా, శత్రువుల్ని తన్ని తరిమేయాలన్నా రాఫెల్ ఫైటర్లు కీలకం. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత వేగంగా స్పందిస్తాయి. చాలా వేగంగా దూసుకెళ్తాయి. ఆయుధాల్ని బలంగా పట్టుకుంటాయి. దాడి చేయడంలో వాటి ట్రాక్ రికార్డు తిరుగులేనిది. మన దేశానికి వచ్చే విమానాల్లో 28 విమానాలకు సింగిల్ సీటు, 8 విమానాలకు డబుల్ సీటు ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు చెబుతున్నాయి. 15.27 మీటర్ల పొడవు ఉండే రాఫెల్‌కి రెక్క పొడవు 10.80 మీటర్లు ఉంటుంది. ఆయుధాలు లేని రాఫెల్ బరువు 9900 కేజీల నుంచి 10600 కేజీలు దాకా ఉంటుంది. రాఫేల్ ఫస్ట్ బ్యాచ్ మొహరింపు కూడా వ్యూహాత్మకంగానే చేయబోతోంది కేంద్రం.పగలూ రాత్రనే తేడా లేకుండా.. ఎప్పుడైనా ఎక్కడైనా లక్ష్యాన్ని ఈజీగా చేధించడం రాఫెల్ స్పెషాల్టీ. సరిహద్దు దాటకుండానే..పాక్‌లోని ఓ మూల టార్గెట్‌నైనా పక్కాగా కొట్టేస్తుంది. రాఫేల్ జెట్ ఫైటర్ ఉన్న దేశాలు ప్రపంచంలో నాలుగే. ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతర్, తర్వాత మన దగ్గరే ఈ విమానాలు ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలను నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 12 మంది పైలట్లు వీటిని నడపడంలో శిక్షణ తీసుకున్నారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారత్ యుద్ధ సన్నద్ధత చూసి ఖంగుతిన్న డ్రాగన్..
ఆగస్టు 29, ఆగస్టు 31 తేదీల్లో చైనా ఏకపక్షంగా చొరబాటుకు పాల్పడి.. నియంత్రణ రేఖ హద్దులను మార్చాలని వ్యూహం పన్నింది. దీంతో భారత సైన్యం స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ ను రంగంలోకి దింపింది. వీలైనంత తొందరలో ఆపరేషన్‌ను ముగించాలనే ఉద్దేశంతో ఎస్‌ఎఫ్ఎఫ్ 120 నిమిషాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంతే.. ఆ రెండు గంటల్లో బ్లాక్‌టాప్‌, హెల్మెట్‌, మగర్‌, గురుంగ్‌ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ చైనా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ధ్వంసం చేసింది. ఆ వెంటనే 2 వేలకు పైగా భారత బలగాలు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంస క్షిపణులు, రాకెట్‌ లాంఛర్లతో ఆయా శిఖరాలపై పాగా వేశాయి. ఇంకేముంది?? ఆగస్టు 29 రాత్రి డ్రాగన్‌ సైన్యం తన వ్యూహాన్ని అమలు పరిచేందుకు వచ్చి, ఇక్కడ భారత సన్నద్ధతను చూసి తెల్లబోయింది. తేరుకుని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. మన సైన్యం హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరపడంతో.. తోక ముడిచింది. ఆ వెంటనే భారత సైన్యం రెజాంగ్‌-లా పాస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఆగస్టు 31న కూడా ఇదే కుతంత్రంతో డ్రాగన్‌ రాగా.. మన యుద్ధ ట్యాంకుల శ్రేణిని చూసి, వెనక్కి తగ్గక తప్పలేదు. కీలక శిఖరాలపై భారత్‌కు చెందిన టీ-90 యుద్ధ ట్యాంకులను చూసి.. 30 కి.మీ దూరంలో ఉన్న తమ టీ-75 ట్యాంకులు వాటి పరిధిలో ఉంటాయని అంచనా వేసింది.

తాము ఎంత ప్రయత్నించినా 22 కి.మీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యమున్న తమ ట్యాంకులతో భారత ట్యాంకులను ఏమీ చేయలేమని నిర్ధారించుకుని, వెనకడుగు వేసింది. ఎన్నడూ లేని విధంగా చైనా నోట రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, యోగా, దంగల్‌ సినిమా పేర్లు వినబడ్డాయి. చైనా రక్షణ మంత్రి స్వయంగా తాను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో చర్చలకు సిద్ధం అని పదేపదే చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి సారి చైనా నోట ‘‘ఇతర దేశాలకు చెందిన ఒక అంగుళం భూమిని కూడా మేము ఆశించడం లేదు’’ అని ప్రకటించాల్సి వచ్చింది. చైనాతో చర్చలు ఫలించకపోతే.. సైనిక చర్యకు వెనుకాడబోమని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. సాధారణంగా చైనా విషయంలో గతంలో ఎప్పుడూ భారత్ నుంచి ఇంత తీవ్రస్థాయి ప్రతిస్పందన లేదు. అయితే, రావత్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశానికి దగ్గరగా ఉండటంతో.. కేంద్రం ఆయన్ను వివరణ కోరినట్టు తెలుస్తోంది. మిలటరీ ఆప్షన్స్ పై కసరత్తు చేయాని కూడా ఆదేశాలిచ్చింది.

మిలటరీ చర్య విషయాన్ని తుదివరకూ గోప్యంగా ఉంచాలని కూడా ప్రభుత్వం రావత్ కు సూచించినట్టు సమాచారం. ఇక, సరిహద్దుల్లో చైనా ఎత్తులకు పైఎత్తు వేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు రాగానే.. సైన్యం పని మొదలుపెట్టింది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తరాన చైనా ఆక్రమణలకు ప్రయత్నించడంతో.. వెంటనే తిప్పికొట్టింది. దీనికి ప్రతిగా ప్యాంగాంగ్ సరస్సుకు దక్షిణాన చైనా తమవిగా చెప్పుకుంటున్న శిఖరాలను ఆక్రమించింది. ఈ శిఖరాల పై నుంచి చూస్తే.. డ్రాగన్ సైనికుల కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. ఊహించని ఈ పరిణామానికి చైనా కంగుతింది. అటు దక్షిణ చైనా సముద్రంలో కూడా చైనా యుద్ధ నౌకకు దగ్గరగా ఇండియా నౌక రావడం కూడా అనూహ్య పరిణామమే. మొన్నటి వరకూ చైనా తమ భూభాగం నుంచి వైదొలగాలని చర్చల్లో భారత్ కోరుతూ వచ్చింది. కానీ, చైనా మొండికేసింది. ఇప్పుడు భారత్ దూకుడు తగ్గించుకోవాలని డ్రాగన్ ప్రస్తావించాల్సిన పరిస్థితి కల్పించడమే కేంద్రం వ్యూహం. ఇప్పటికే చర్చల్లో చైనా బేరాలు మొదలుపెట్టిందని.. డ్రాగన్ ను ఉపేక్షించడం కంటే.. దూకుడుగా వెళ్లాలని కేంద్రం నుంచి సైన్యానికి వచ్చిన ఆదేశాల ఫలితంగానే.. వాస్తవాధీన రేఖ వెంట యుద్ధ సన్నద్ధత పెరుగుతోంది.

భారత ఎయిర్ బేస్ ల పై చైనా నిఘా పెట్టిందా?
అసోంలోని తేజ్ పూర్ ఎయిర్ బేస్ , క్షిపణి ప్రయోగాలు చేపట్టే ఒడిసాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ పై డ్రాగన్ నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. భారత సైనిక సామర్థ్యానికి ఈ రెండూ ఆయువుపట్టు అని, ఇండియన్ మిలటరీకి ఇవి ఎంతో కీలకమని భావిస్తున్న చైనా తేజ్ పూర్ ఎయిర్ బేస్ పై నిఘా కోసం ఒక రాడార్ ను ఏర్పాటు చేసింది. మయన్మార్ సరిహద్దుకు అత్యంత చేరువలో యున్నాన్ ప్రావిన్స్ లో ఉన్న రుయిలీ కౌంటీ నుంచి చైనా భారత్ పై నిఘా పెట్టినట్లుగా సమాచారం. తేజ్ పూర్ వైమానిక దళ కేంద్రం చైనా సరిహద్దు నుండి 172 కిలోమీటర్లు, మయన్మార్ సరిహద్దు నుండి 146 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాడార్ మయన్మార్ సరిహద్దు నుండి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే మోహరించబడింది. ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా 13 మీటర్ల వెడల్పును ప్రదర్శిస్తాయి, రాడార్ ఎక్కువగా రాడార్ సైట్ నుండి 1,150 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం వైపుకు , అలాగే తేజ్ పూర్ ఎయిర్ బేస్ మీదకు ఫోకస్ చేస్తుంది. ఇది విమానాలను గుర్తించడంలో మరియు పర్యవేక్షించడంలోకావాల్సిన సమాచారాన్ని డ్రాగన్ కంట్రీకి అందిస్తుంది.

అబ్దుల్ కలాం ఐస్లాండ్ నుండి, తేజ్ పూర్ ఎయిర్ బేస్ నుండి రెండున్నర కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఏవైనా ఎగిరితే ఈ రాడార్ పసిగడుతుంది. చైనా చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ గమనిస్తున్న ఇండియన్ ఆర్మీ చైనా కు ధీటుగా సమాధానం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది. ఒరిస్సాలోని బాలాసోర్ లో నిత్యం భారతీయ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంటారు .అటు అసోంలోని తేజ్ పూర్ నుండి సరిహద్దును పహారా కాస్తూ ఉంటారు. ఈ రెండు కీలక ప్రాంతాలపై నిఘా పెట్టిన డ్రాగన్ మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మొత్తంగా యుద్ధం వైపే అడుగులు పడుతున్నాయి. 1962 యుద్ధం డిసెంబర్ లోనే జరిగింది. వర్షరుతువులో యుద్ధాలు కూడదంటుంది ప్రాచీన భారత యుద్ధకళ. శీతాకాలం యుద్ధానికి అనువైన కాలం. అందుకే ఇటు భారత్, అటు చైనా డిసెంబర్ రణరంగంకోసం వేచిచూస్తున్నాయా?

#RightAngle #SaiKrishna #China #December