ఉభయ సభలకు కరోనా దెబ్బ..!

Sep 14, Mon 2020 08:35 PM Politics

-- 25 మంది ఎంపీలకు పాజిటివ్..!
-- లోక్ సభలో భారీగా గైర్హాజరీ
-- వాడి, వేడి లేని వర్షాకాల సమావేశాలు

కరోనా ప్రభావం పార్లమెంట్ పై గట్టిగానే పడినట్టుంది. 25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ రావడంతో.. వారంతా హోం ఐసోలేషన్ లో వున్నారు. సమావేశాలు అక్టోబర్ 1తో ముగియనున్న నేపథ్యంలో వీరు ఒక్కరోజు కూడా హాజరు కావడం అనుమానమే. కరోనా సోకి తొలిరోజు సమావేశాలకు హాజరుకాలేకపోయిన 25 మంది ఎంపీల్లో 17 మంది లోక్ సభ సభ్యులు కాగా, మిగతా తొమ్మిది మంది రాజ్యసభ మెంబర్లు. లోక్ సభ సెక్రటేరియట్ వెల్లడించిన వివరాల ప్రకారం పాజిటివ్ గా తేలిన ఎంపీల్లో బీజేపీకి చెందిన 12 మంది సభ్యులు, వైసీపీకి చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ నుంచి ఒక్కో ఎంపీ ఉన్నారు.

కరోనా పాజిటివ్ గా తేలిన బీజేపీ సభ్యుల్లో లద్దాక్ యువ ఎంపీ జామ్ యాంగ్ సెరింగ్ నాంగ్యాల్, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, జనార్దన్ సింగ్ సిగ్రివాల్, సుకాంత మజుందార్, సుఖ్బీర్ సింగ్, బిద్యుత్ బరాన్ మహతో, ప్రదాన్ బరౌచ్, పర్వేజ్ సాహిబ్ వర్మ, సత్యపాల్ సింగ్ తదితరులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ ఎంపీలు మాధవి, రెడ్డప్పలు కరోనా పాజిటివ్ గా తేలారు. రాబోయే రెండు వారాల్లో ఇంకా ఎంత మంది వైరస్ కారణంగా సభకు దూరమయ్యే పరిస్థితి వస్తుందో చూడాలి.

ఇదిలావుంటే, కరోనా భయమో, లేక మరేదైనా కారణమో తెలియదు గానీ.. గైర్హాజరీ కూడా భారీగా వుంది. ఆర్థిక వ్యవస్థ పతనం, కరోనా వ్యాప్తి, సరిహద్దు వివాదాల వంటి కీలక చర్చలు జరుగనున్న వర్షాకాల సమావేశాలకు కూడా ఎంపీలు గైర్హాజరవుతున్నారు. తొలిరోజు లోక్ సభకు హాజరైన ఎంపీల సంఖ్య 359గా ఉన్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ తెలిపింది.

కరోనా నేపథ్యంలో పార్లమెంట్ చరిత్రలో తొలిసారి ఎంపీల హాజరును అటెండెన్స్ రిజిస్టర్ యాప్ ద్వారా చేపట్టారు. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేయడంతో, గ్యాలరీల్లోనూ ఎంపీలు కూర్చోవాల్సి వచ్చింది. డిస్టెన్స్ నిబంధనల ప్రకారం ఎంపీలకు మూడు వైపులా అద్దాలను ఏర్పాటు చేశారు. సభలో అందరూ తమ తమ సీట్లలో కూర్చొని మాత్రమే మాట్లాడారు. ఇక కరోనా పుణ్యమా అని, స్పీకర్ లాబీల్లోకి దూసుకురావడాలు.. గుమిగూడి నినాదాలు చేయడం వంటి పరిణామాలు వుండకపోవచ్చు.

#Parliament #MansoonSession #Covid19 #CoronaVirus