యుద్ధ వేదికపై ఝంగౌ.. బరిమీద భారత్..!

Sep 12, Sat 2020 01:02 PM Right Angle

ప్రపంచ దేశాలు చైనాను అర్థం చేసుకోవడంలోనే ప్రాథమిక వైఫల్యాన్ని మూటగట్టుకున్నాయంటారు అమెరికన్ విదేశాంగ నిపుణుడు రాబర్ట్ డి, కాప్లాన్. ఆసియాలో చైనా, పాకిస్తాన్, భారత్ ల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని పాశ్చాత్య దేశాలు ‘‘ఆసియా వ్యూహా’’న్ని సిద్ధం చేసినా, చైనా స్ట్రాటజికల్ పర్ స్పెక్టివ్ ను అర్థం చేసుకోవడంలో అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాలు విఫలమయ్యాయనేది ఆయన ప్రాథమిక పరిశీలన.

నిజానికి భారత్ కు స్వాతంత్ర్యం వచ్చే నాటికి చైనా జపాన్ వలస దేశంగా ఉంది. అయితే భౌగోళిక రాజకీయాల కేంద్రంగా విదేశాంగ విధానాన్ని ఖరారు చేసుకోవాలన్న వాస్తవ పరిజ్ఞానం ఆసియా లోని ఒక్క జపాన్ మినహా అనేక దేశాలకు లేదు, ఒక్క జపాన్ మినహా. 48 ఆసియా దేశాలు, వాటిపై ఆధారపడిన తైవాన్, హాంకాంగ్, మకావూ కేంద్రంగా చైనా తన వ్యూహాన్ని రూపొందించుకుంది. అంతేకాదు, కాలమాన పరిస్థితులు మారుతున్న కొద్దీ వాటిని నిరంతరం మార్చుకుంటూ ఉంది.

నిర్దిష్టంగా చెప్పాలంటే భారత్ బలహీనతలు, మన దేశానికి పాక్ తో ఉన్న వైరం కేంద్రంగా ఒక రకమైన వ్యూహాన్ని, సముద్రాన్ని ఆధారం చేసుకుని మరోతరహా వ్యూహాన్ని రూపొందించింది డ్రాగన్. ఉపఖండ విభజన, 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటును చైనా చాలా నిశితంగా చూసింది. భారత్ కు ఉన్న వివాదాలు డ్రాగన్ కు కలిసొచ్చేలా విదేశాంగ విధానాన్ని రూపొందించింది. భారత్-రష్యాల మైత్రిని చైనా పెద్దగా ఖాతరు చేయలేదు. రష్యా-చైనాల మధ్య ఉన్న రహస్య బంధంలో భాగంగానే ఒకరు సఖ్యంగా ఉంటే, మరొకరు వైరి పాత్ర పోషించారనేది ఒకానొక పరిశీలన.

1950 లలో శాంతియుత సహజీవనానికి భారత్‌, చైనా, మయన్మార్‌ పంచశీల సూత్రాలను ప్రతిపాదించడంలోనే చైనా చాలా సుదీర్థ వ్యూహాన్ని రచించింది. సామాజిక నైతిక, ఆదర్శాలు, విలువల చట్రాన్ని విదేశాంగ విధానంపై రుద్దడం వల్ల మాత్రమే ఆచరణ సబంధం లేని ‘పంచశీల’ లాంటి ఆదర్శ ఒప్పందాలు రూపుదిద్దుకుంటాయంటారు అంతర్జాతీయ నిపుణులు. మారుతున్న కాలానికి అనుగుణంగా విదేశాంగ విధానం ఉండాలి మినహా, శిలాశాసనమైన విధానం ఉండదనీ, ఉండకూడదనీ అంటారు నిపుణులు.

ప్రస్తుతం చైనా హఠాత్తుగా ఎందుకింత దూకుడు ప్రదర్శిస్తోంది? డోక్లాం వివాదం తాత్కాలికంగా సద్దు మణగినా, లఢక్ సరిహద్దు ఉద్రిక్తత కొనసాగడానికి కారణాలేంటి? 370 అధికరణం రద్దు, జమ్మూ-కశ్మీర్ లను కేంద్ర పాలిత ప్రాంతాలు చేయడమే డ్రాగన్ ఆగ్రహానికి కారణమా? భారత్ –చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితి ఎలా ఉంది? యుద్ధమే వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? పీఎల్ఏ సామర్థ్యం ఎంత? ఇలాంటి కీలక ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ద్వైపాక్షిక ఒప్పందాలను కాలరాస్తూ ఇప్పటికే సరిహద్దుల్లో కాల్పుల మోత మోగించిన డ్రాగన్‌.. కేవలం కొన్ని గంటల క్రితం పాంగాంగ్‌ సరస్సు వద్ద భారీగా బలగాలను దించింది. చైనా కు దీటుగా బదులివ్వాలని ఇప్పటికే తీర్మానించుకున్న భారత సైన్యం అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. పాంగాంగ్‌ ప్రాంతానికి అదనపు బలగాలను ఇప్పటికే తరలించింది. సుఖోయ్‌, మిగ్‌ యుద్ధ విమానాలు సరిహద్దు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి.

పాంగాంగ్‌కు ఉత్తరాన ప్రధానంగా ఫింగర్‌-4 నుండి ఫింగర్ -8 మధ్య పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కదలికలు సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి మరింత తీవ్రమయ్యాయి. భారీ సంఖ్యలో బలగాలను రప్పించి తాత్కాలిక స్థావరాలను ఏర్పాటుచేసింది. పాంగాంగ్‌కు దక్షిణాన ఎల్‌ఏసీకి కిలోమీటర్ పరిధిలో ట్రక్కులు, టెంట్లు ఏర్పాటు చేసింది. తూర్పు లద్దాఖ్‌లో చైనా ప్రస్తుతం సుమారు 50 వేల మంది సైనికులు, 150 యుద్ధ విమానాలు, బాలిస్టిక్‌ క్షిపణులు, రాకెట్లను మోహరించింది.

వ్యూహాత్మకమైన, ఎత్తయిన ప్రాంతాలపై పాగా వేసిన భారత సైన్యం.. పీఎల్‌ఏ కదలికలను క్షణక్షణం పసిగడుతోంది. పాంగాంగ్‌కు ఉత్తరాన నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తూనే.. దక్షిణ తీరంలో బలగాల సంఖ్యను చైనా గణనీయంగా పెంచుకుంటోంది. దక్షిణాన కనీసం నాలుగు ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం ఎదురయ్యాయి. రెజాంగ్‌ లా పర్వత మార్గంలో ఇరు దేశాల బలగాల మధ్య దూరం కేవలం 200 మీటర్లు మాత్రమే!

వెస్టర్న్ థియేటర్‌ కమాండ్‌ తో పాటు చైనా సైనిక వ్యూహకర్తలు నేరుగా నియంత్రిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. రాత్రివేళల్లో బలగాల కదలికలు ఉండకూడదన్న ఒప్పందం చేసుకున్నా డ్రాగన్ దాన్ని పాటించలేదు. రాత్రిళ్లు భారత స్థావరాలవైపు డ్రాగన్‌ బలగాలు దూసుకొస్తున్నాయి.

భారత్ సైతం చైనాకు దీటుగా బలగాలను మోహరిస్తోంది. సరిహద్దు బలగాలన్నింటికీ అత్యధిక స్థాయి అప్రమత్తత ప్రకటించింది LAC కి సమీపంలో సుఖోయ్ మిగ్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. రిచిన్ లా, స్పాంగూర్ సహా వాస్తవాధీన రేఖకు సమీపంలోని ఎత్తైన భూభాగాల్లో భారత ఆర్మీ గస్తీ ముమ్మరం చేసింది.

చైనా వ్యూహాత్మక వైఖరిని ఎలా చూడాలి?
చైనా దక్షిణాసియా వ్యూహంలో పాకిస్థాన్ ను పావుగా మార్చుకుంది. వన్ బెల్ట్-వన్ రోడ్, 1986లో అణ్వస్త్ర సహాకార ఒప్పందం, 2003లో చైనా-పాక్ ల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, 2005లో మైత్రి ఒప్పందం, అన్నింటికీ మించి 2015లో జరిగిన సముద్ర వాణిజ్య ఒప్పందం అత్యంత కీలకమైంది. ఇరు దేశాల మైత్రికి ఇది మాతృక స్థాయి ఒప్పందం అనొచ్చు.

ఈ రెండు దేశాల మధ్య దాదాపు 51 ఒప్పందాలున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచీ భారత్ తన వ్యూహాత్మక వైఖరిలో భాగం చేసుకోని మరో అంశం-పాకిస్థాన్ విషయంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ లు మొదటి నుంచీ అవకాశవాద వైఖరని అవలంబించడం. ఒకవైపు భారత్ తో స్నేహ హస్తం చాస్తూనే మరోవైపు పాకిస్థాన్ ను ప్రోత్సహించడం. ఈ అంశమే భారత విదేశాంగ విధానంలో అత్యంత లోపభూయిష్టమైన అంశం.

2014 లో ఏర్పడిన మోదీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా S. జయశంకర్ లాంటి విదేశాంగ నిపుణుడు, భారత రక్షణ వ్యూహకర్త అజిత్ దోవల్ లు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. పాకిస్థాన్ ను ఒంటరి చేయడం అంతిమంగా, చైనాను ఏకాకి చేయడమనేది వారి ఎత్తుగడ. గడచిన ఆరేళ్ల కాలంలో ఆర్థిక, దౌత్య, సైనిక రంగాల్లో పాకిస్థాన్ ను దిక్కుతోచని స్థితికి నెట్టారు. అంటే భారత చైనా వ్యూహం పాకిస్థాన్ కేంద్రంగానే సాగాలనే కీలక అంశాన్ని గుర్తించారు.

గతంలో గుర్తించినా అంతర్జాతీయ ఒత్తిడులు అమెరికాతో గంభీరమైన సంబంధం కాకుండా, లొంగిఉండే వైఖరి మూలంగా ఇది సాధ్యపడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టాక దక్షిణాసియాలో భారత్ వ్యూహం ముఖ చిత్రాన్నే మార్చేసారు. పాకిస్థాన్ కు చైనా అత్యంత సంపద్వంతమైన భాగస్వామి- భారత్ ను కట్టడి చేసేందుకు చైనాకు అత్యంత చవగ్గా దొరికే భాగస్వామి పాకిస్థాన్. ఇది అత్యంత కీలక అంశం. దీని చుట్టే డ్రాగన్ వ్యూహాన్ని రూపొందించింది. అంతిమ అర్థంలో చైనాను కట్టడి చేయడమంటే పాకిస్థాన్ ను కార్డన్ చేయడం అన్నమాట. అదే పని మోదీ ప్రభుత్వం గత ఆరేళ్లుగా చేస్తోంది.

ఇందులో భాగంగానే 370 అధికరణం రద్దు, సీఏఏ లాంటి చట్టాలను కఠినంగా అమలు చేసింది. విదేశాంగ విధానం మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే దేశీయంగా విధానపరమైన అనేక నిర్ణయాలు ఆవశ్యకమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2014 లో మొదటి సారి ఏర్పడిందంటారు నిపుణులు. ఆయువుపట్టుపై దాడి చేయడంతో డ్రాగన్ కు సహజంగానే ఆగ్రహం వచ్చింది.

భారత్ పై చైనా ఆగ్రహానికి మరో కారణాన్ని గుర్తించాలి. అదేంటంటే...దేశ విభజన తర్వాత తొలిసారి భారత ప్రభుత్వం సరిహద్దులను కొలిచింది. తన వ్యూహానికి కేంద్ర బిందువైన పాక్ విషయంలో భారత్ దూకుడు పెంచడం చైనాకు నచ్చలేదు. ఇక అంతిమ యుద్ధం తప్పదని గుర్తించి, లఢక్ కేంద్రంగా యుద్ధవ్యూహాన్ని రచించింది. తన సరికొత్త వ్యూహానికి సైతం భారత్ లొంగకపోవడం డ్రాగన్ కు మరింత కోపం తెప్పించింది.

అంతేకాదు, గిల్గిత్, బాల్టిస్థాన్ భారత్ లో భాగమే అని మోదీ ప్రభుత్వం కరాఖండిగా ప్రకటించడం కూడా చైనాకు రుచించలేదు. భారత్-పాక్ ల మధ్య వివాదంలో చైనా తనను తాను థర్డ్ పార్టీగా భావిస్తోంది. మోదీ అధికారంలోకి రాగానే మారుతున్న పరిస్థితులను చైనా సరిగ్గానే అంచనా వేసింది. ఈ క్రమంలోనే భారత్ సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది. 2014 లో జరగబోయే ఎన్నికల విషయంలో 2013 ఆరంభంలోనే చైనా ఒక అంచనాకు వచ్చింది. ఈ అంచనా మూలంగానే చైనా-పాక్ ఆర్థిక కారిడార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ( BRI) ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది.

గ్వాదర్ పోర్ట్ ను తన చెప్పుచేతల్లో ఉంచుకుంది. భారత్ లక్ష్యంగా చైనా రచించిన సముద్ర వ్యూహానికి ఇది అత్యంత కీలకమైంది. గ్వాదర్ ను ‘స్ట్రాటజిక్ అవుట్ పోస్ట్’ గా పేర్కొంటారు నిపుణులు. సైనికపరమైన అవసరాలు, ఆయుధాల తరలింపులో గ్వాదర్ అత్యంత కీలకమైంది. సముద్ర జల సాంద్రతను గ్వాదర్ కేంద్రంగా క్రమంగా పెంచుకుంటున్న చైనా రాబోయే రోజుల్లో భారత ప్రాదేశిక జలాలకు కేవలం మీటర్ల దూరంలో తన జలాంతర్గాములను మోహరించే ప్రమాదమూ పొంచిఉంది.

యుద్ధం అనివార్యమైతే పరిస్థితి ఎలా ఉంటుంది?
చైనాతో యుద్ధం అనివార్యమైతే...పాకిస్థాన్ తో కూడా తలపడేందుకు సిద్ధం కావాలి. చైనాతో యుద్ధం ఉభయ సరిహద్దు యుద్ధంగా పరిణమిస్తుంది. భారత్ శక్తిని గుర్తించిన చైనా పాకిస్థాన్ ను పక్కనపెట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శతృవు, శతృవు మిత్రుడు అనే నానుడి ఆధారంగా పాక్ ను ప్రోత్సహిస్తుంది. ఎఫ్ఏటీఎఫ్-పినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో అన్ని దేశాలు పాక్ వైఖరిని ఖండిస్తే చైనా, టర్కీలు సమర్థించాయి. భారత్ తో యుద్ధం వస్తే పాక్ ను బలిపెట్టడమన్నది చైనా వ్యూహం. అన్నిరంగాల్లో విఫలమై...బేలచూపులు చూస్తున్న పాకిస్థాన్ చైనాపై ఆధారపడటం అనివార్యంగా మారిందంటారు నిపుణులు.

ఉభయ సరిహద్దు యుద్ధంలో శతృ ద్వయాన్ని నిలువరించేందుకు పటిష్ఠమైన వ్యూహాన్ని రచించింది భారత రక్షణ శాఖ. యుద్ధానికి కారణమైన వైరిని తిప్పికొడుతూనే, యుద్ధానికి సహకరించే శతృవును అదుపు చేయాలి అన్నది ఈ వ్యూహానికి సంబంధించిన ప్రాథమిక సూత్రం. భారత్-చైనాలు యుద్ధంలో తలమునకలై ఉన్నపుడు తూర్పు లఢాక్ లోనో, కశ్మీర్ లోనో పాక్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని తీవ్రం చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో సియాచిన్ హిమానీనదాన్ని సందర్శించిన ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవాణే ఉభయ సరిహద్దు యుద్ధం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దు వెంబడి సమానమైన మోహరింపు, నిఘా ఉంచడం వ్యూహాత్మకంగా అవసరమన్నారు ఆర్మీ చీఫ్.

పీఎల్ఏ గురించి చెప్పేవన్నీ డాంబికాలేనా?
పీఎల్‌ఏకి యుద్ధ అనుభవం లేదు. జిన్‌పింగ్‌ మాటల్లో చెప్పాలంటే- అది ‘ యుద్ధలేమి జాడ్యం’తో బాధపడుతోంది. అలాంటప్పుడు అది 21వ శతాబ్ది యుద్ధాల్లో నెగ్గుకురాగలుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని అధిగమించడానికి పీఎల్‌ఏ గట్టిగానే సన్నాహాలు చేస్తోంది.

శిక్షణ పద్ధతులు, ప్రమాణాలను ఆధునీకరిస్తోంది. రేపు యుద్ధమే వస్తే ఎలా ఎదుర్కోవాలో, సంయుక్తంగా ఎలా పోరాడాలో వివరిస్తూ పీఎల్‌ఏ 2018లో ‘ఔట్‌ లైన్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ క్యాంపెయిన్ చేపట్టింది. ప్రపంచంలో అత్యంత అధునాతన సేనలతో పోలిస్తే తమకున్న లోటుపాట్లేవో గుర్తించి, సరిదిద్దుకొనేందుకు ఈ క్యాంపెయిన్ చేపట్టింది బీజింగ్.

సైనికులను రేపటి యుద్ధాలకు సన్నద్ధుల్ని చేయడంతోపాటు వారికి అత్యాధునిక సాధన సంపత్తిని అందజేయాలని చైనా గుర్తించింది. వాటిని స్వదేశంలోనే తయారుచేసుకోవడానికి అద్భుతమైన రక్షణ పరిశ్రమలను అభివృద్ధిపరచింది. ఈ పోటీలో మెరుపు వేగంతో దూసుకుపోతోంది. డిఫెన్స్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఏటా ప్రపంచంలో 100 అగ్రశ్రేణి రక్షణ సంస్థల జాబితాను ప్రచురిస్తుంది. 2018 జాబితాలో ఒక్కటంటే ఒక్క చైనా సంస్థ లేదు.

భారత్‌, జర్మనీ, స్పెయిన్‌, తైవాన్‌, బ్రిటన్‌ వద్ద ఉన్న మొత్తం నౌకలు, జలాంతర్గాములకు మించిన సంఖ్యలో యుద్ధనౌకలు, భూతల-సముద్రతల ఉభయచర నౌకలు, జలాంతర్గాములను చైనా 2014-18 మధ్యకాలంలో సముద్రంలో దింపింది. అంతర్జాతీయ వ్యూహ అధ్యయన సంస్థ -ఐఐఎస్‌ఎస్‌ నివేదిక ఈ దిగ్భ్రాంతికర వాస్తవాన్ని బయటపెట్టింది.

‘ది ట్రాజెడీ ఆఫ్‌ గ్రేట్‌ పవర్‌ పాలిటిక్స్‌’పుస్తకంలో రక్షణ నిపుణుడు జాన్‌ జె.మియర్‌ షీమర్‌ వ్యాఖ్యలు గమనించ దగ్గవి... ‘‘చైనా ఆర్థికంగా విజృంభిస్తున్నకొద్దీ ఆసియాపై ఆధిక్యం సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఇవాళ పశ్చిమార్ధ గోళంలో అమెరికా చేస్తున్నది ఇదే. రేపు ఆసియాలో చైనా అలాంటి పంథాయే అనుసరించవచ్చు. అయితే ఆసియాపై చైనా ఆధిపత్యం సాధించకుండా అడ్డుకోవడానికి అమెరికా చేయవలసిందంతా చేస్తుంది.

భారత్‌, జపాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, రష్యా, వియత్నామ్‌లు అమెరికాతో చేతులు కలిపి చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయి. దీంతో భద్రతాపరంగా తీవ్రమైన పోటీ ఏర్పడి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే చైనా విజృంభణ ప్రశాంతంగా జరగబోదు’అన్నారు మియర్ షీమర్. సో యుద్ధం అనివార్యమనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో చైనా – పాక్ లను ఏక కాలంలో ఎదుర్కునే విధంగా భారత సైన్యానికి మనమూ మద్ధతు పలుకుదాం. జై జవాన్ – జై కిసాన్ భారత్ మాతా కీ జై.

#RightAngle #SaiKrishna #China #India #War