మీరూ మహిళే కదా.. నా బాధ అర్థం కాదా..?

Sep 12, Sat 2020 12:59 PM Politics

-- సోనియాగాంధీకి కంగనా సూటి ప్రశ్న
-- మీ మౌనంపై చరిత్ర తీర్పు చెబుతుదంటూ ఘాటుగా ట్వీట్లు
-- మహా సర్కార్, కంగనా మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

మహారాష్ట్ర ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర సర్కార్ తీరును ఎండగడుతూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న కంగనాపై.. అధికార శివసేన, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇలా విమర్శలు ప్రతి విమర్శలతో పరిస్థితి.. కంగనా వర్సెస్ మహారాష్ట్ర సర్కార్ గా మారింది. ఇక, మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల విమర్శలపై ప్రశ్నిస్తూ ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని టార్గెట్ చేశారు కంగనా రనౌత్.

సోనియాకు వరుసగా ఘాటు ట్వీట్లు చేసిన కంగనా.. చరిత్ర మీ మౌనంపై, వివక్షపై తీర్పు చెబుతుందన్నారు. తన కార్యాలయాన్ని కూల్చివేయడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఆమె అన్నారు. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వం నా పట్ల వ్యవహరిస్తున్న తీరు మహిళగా మీకు ఆగ్రహం కలిగించడం లేదా..? అంటూ ప్రశ్నించారు కంగనా.

డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ సూత్రాలను గౌరవించాలని మీరు మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయలేరా..? ఆని ఆమె సోనియాను అడిగారు. మీరు పశ్చిమ దేశంలో పుట్టిపెరిగి భారతదేశంలో నివసిస్తున్నారు. మహిళల సమస్యలు మీకు తెలిసే ఉంటాయి. మీ సొంత ప్రభుత్వం ఓ మహిళను వేధిస్తూ శాంతిభద్రతలను అపహాస్యం చేస్తున్న స్థితిలో.. మీ మౌనంపై చరిత్ర తీర్పు చెబుతుందంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు కంగనా రనౌత్.

అటు శివసేనపై మరోసారి విరుచుకుపడ్డారు కంగనా రనౌత్. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను ప్రస్తావిస్తూ.. ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. తను అభిమానించేవారిలో బాలా సాహెబ్ థాకరే ఒకరని, ఏదో ఒక రోజు శివసేన పొత్తు పెట్టుకుని కాంగ్రెసుగా మారిపోతుందేమోనని ఆయన భయపడ్డారని కంగనా అన్నారు. తన పార్టీ పరిస్థితిని చూసి బాల్ థాకరే ఏ విధమైన మానసిక స్థితికి గురై ఉండేవారో మీరు ఊహించగలరా..? అని అడిగారు.

#KanganaRanaut #SoniaGandhi #SushantRajput #MaharashtraGovernment