ఆంధ్రుల ధర్మాగ్రహం.. అంతర్వేది గర్జన..!

Sep 12, Sat 2020 12:41 PM Right Angle

దేహవనంలో నెత్తుటిని దౌడు తీయించి.. తీరుబాటుగా శాంతి వచనాలు చెబుతావా అంటూ ఆగ్రహంతో శాతవాహన రాజుని ప్రశ్నిస్తుంది.. గుణాఢ్యుని ‘బృహత్కథ’లో రాణి పాత్ర. నెత్తుటిని దౌడు తీయించే సందర్భాలు అనాదిగా మనిషికి తారసపడుతూనే ఉన్నాయి. కాకపోతే, వర్తమానం అందుకు కాస్త భిన్నం. వర్తమానం విశ్వాసాన్ని గాయపరచడం నేర్చుకుంది. అందులో నైపుణ్యాన్ని అలవర్చుకుంది. సాంకేతికతను మీరి తప్పించుకునే తర్ఫీదు పొందింది.

అంతర్వేది ఆలయ రథం దగ్ధం తర్వాత అంతరాంతరాల్లో ఒక గగుర్పాటు, కురవని మేఘం వలె తచ్చాడుతోంది. ఆలయమంటే ఏమిటి? ఒక ఆశ్వాసన, ఒక ధైర్యం, ఒక వాగ్దానం, ఒక నమ్మకం, మంత్రోచ్చాటనగా మన చెవుల్లో గింగురుమనే నివేదన. అది కూడా సహించలేని మనలోకి చొరబడిందా? అధికార దాహమో.. అంధ విశ్వాసమో.. ఇలాంటి దారుణాలకు పురికొల్పుతోందా? అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన కేవలం ఒకానొక ‘Isolated incident’ కాదు. ఆకతాయిలో.. మతిభ్రమించినవారో చెసింది అంతకన్నా కాదు. ప్రమాదాలు, వైయక్తిక దాడులు హత్యలు, హత్యాయత్నాలూ మినహా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అనేక ఘటనలూ వాటికవిగా జరుగుతున్న ఘటనలు కావు. విశ్వాసాలను ఒక్క కుదుపు కుదిపి తర్వాత చెలరేగే ఆందోళనకర స్థితిని రాజకీయాలకు వాడుకోవాలనే కుట్ర దాగి ఉంది.

‘కుట్ర’ ఎందుకంటున్నానో.. చెప్పే ముందు ఘటనల క్రమం చూద్దాం..
ఈ ఏడాది జనవరి 21 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పిఠాపురంలోని ఆరు ఆలయాల్లో హిందూ దేవతల 23 విగ్రహాలను ద్వంసం చేశారు . ఆంజనేయస్వామి, సీతారామాంజనేయస్వామి, ముత్యాలమ్మ, సోమేశ్వరస్వామి, కనకదుర్గ ఆలయాల్లోని విగ్రహాలను స్వల్పంగా ధ్వంసం చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 13 వతేది పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని దుండగులు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వైపు అమ్మవారి జాతర కోసం ఉత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే ఈ ఘటన జరిగింది. ఈ కేసులో పోలీసులు ఏం తేల్చారో నేటికీ తెలియలేదు.

సరిగ్గా ఫిబ్రవరిలోనే నెల్లూరు జిల్లా.. బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు దుండగులు. పెద్ద మంట వచ్చేలా నిప్పు పెట్టి పారిపోయారు. వెంటనే పెద్ద మంటలు వచ్చి రథం మొత్తం కాలిపోయింది. మంటల్ని ఆర్పేందుకు స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.

తాజాగా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన. ఈ దుర్ఘటనలకు పాల్పడుతున్నది ‘గుర్తు తెలియని వ్యక్తులు’, ‘మతిస్థిమిత లేనివారు’. వరుస సంఘటనలూ, నెలలు గడచినా నిందితులు దొరక్కపోవడం అనుమానాలను మరింతగా రూఢీ చేస్తున్నాయి. పోలీసుల సమర్థత మీద ఎవరికీ అనుమానాలు లేవు. సాంకేతిక సాయంతో ఆరితేరిన దోపిడీ దొంగలనూ, అంతర్రాష్ట్ర నేరస్థులనూ, సాక్ష్యాలను తారుమారు చేసిన హంతకులను గంటల వ్యవధిలో పట్టుకోగల సమర్థత ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసుశాఖల సొంతం.

లాక్ డౌన్ మొదలయ్యే వరకూ కొనసాగిన ఆలయాల విధ్వంసం లాక్ డౌన్ తర్వాత ఆగింది. లాక్ డౌన్ ఎత్తేయగానే తిరిగి మొదలైంది. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయ రథం ఆహుతి వెనుక అసలు ఏం జరిగింది..? ప్రమాదవశాత్తు జరిగిందా..? ఎవరైనా దుండగుల హస్తం ఉందా..? ఆలయంలోని సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలేంటి..? ఆలయ కమిటీ ఎందుకు పట్టించుకోలేరు..? ఏళ్లుగా లేని ప్రమాదం ఇప్పుడే ఎందుకు జరిగినట్టూ..? ఈ కుట్ర వెనుక దాగి ఉన్న ముసుగు వీరులెవరు..? పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్లు చెబుతున్న తేనెతుట్టె కట్టుకథేనా..? అసలు అర్ధరాత్రి తేనెతుట్టల నుంచి తేనె తీయడం ఎలా సాధ్యమేనా..? రథశాలకు ఉన్న విద్యుత్ సౌకర్యం కేవలం రెండు బల్బుల మాత్రమే..! అంత తక్కువ ఓల్టేజీ విద్యుత్తు ‘షార్ట్ సర్క్యూట్’ కు కారణమవుతుందా?

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా భాసిల్లుతున్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం సెప్టెంబర్ 6 వ తేదీ తెల్లవారు జామున మంటల బారిన పడి పూర్తిగా దగ్ధమైంది. సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ఉంది ఈ ఆలయం. అంతర్వేది తిరునాళ్లుగా రాష్ట్రం మొత్తం గుర్తింపు పొందింది. అంతర్వేది ఆలయం వెలుపల నిర్మించిన షెడ్‌లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ఏటా స్వామివారి ఉత్సవాల సందర్భంగా.. ఈ రథాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఆదివారం 3 గంటల సమయంలో హఠాత్తుగా షెడ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల బారిన పడి రథం పూర్తిగా కాలిపోయింది.

6 దశాబ్దాల కిందట టేకు కలపతో చేసిన ఈ రథం ఇప్పుడు ఆకస్మాత్తుగా ఇలా అగ్నికి ఆహుతి కావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అప్పట్లోనే రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో కనులు మిరుమిట్లు గొలిపే రీతిలో తయారైన ఈ రథాన్ని 57 ఏళ్ల నుంచి ఉత్సవాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో దీనిని భద్రపరిచారు. ఇంత చరిత్ర కలిగిన రథం ఒక్కసారిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదానికి ముందుగా చెప్పినట్లుగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణమనుకుంటే.. అక్కడి పరిస్థితులు దానిని నమ్మేలా లేవు. రథాన్ని పెట్టే షెడ్డులో విద్యుత్‌ సరఫరా కోసం రెండు బల్బుల మాత్రమే ఉన్నాయి. రథాన్ని దహనం చేసే స్థాయిలో ఓల్టేజీ ఉండదనే అభిప్రాయాలూ ఉన్నాయి.

ఘటన జరిగిన రోజున పిచ్చివాడి చర్యగాను.. నిప్పుల కుంపటి అని.. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని ప్రచారం చేసిన పోలీసు యంత్రాంగం.. చివరకు శోధించి శోధించి ‘తేనెతుట్ట’ కారణంగానే జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రిపూట తేనెతీయడానికి వచ్చినవారు తుట్టె కదిపేందుకు కాగడా వాడి ఉంటారనీ, అది కాస్త వికటించి దాన్ని విసిరేసిన క్రమంలో అది రథశాలపై పడి ఉండవచ్చనే తెలుగు సినిమాలో మెలో డ్రామాను తలపించే సన్నివేశాన్ని వివరించి మెప్పించేందుకు విఫల యత్నం చేశారు. తేనె సేకరణకు ప్రయత్నించే ముఠా కారణం’ అని నిర్ధారించడం ఇప్పుడు వివిధ రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశమైంది. రథం షెడ్డుకు ముందు భాగంలో 40 అడుగుల ఎత్తులో ఉండే భవనంపైన ఉన్న ఆ తేనెతుట్టను అర్ధరాత్రి వేళ తొలగించడం సాధ్యమా..? దానివల్ల తేనె సేకరించే వ్యక్తులకు వచ్చే ఆదాయం ఎంత..? ప్రాణాలను పణంగా పెట్టి తేనెపట్టుకోడానికి నాలుగంతస్తుల ఎత్తులో ఉన్న షెడ్డును ఎలా ఎక్కగలరు..? అలా ఎక్కి సురక్షితంగా తేనెపట్టు పట్టుకోగలరా..? వత్తిళ్ల కారణంగా అలా చేసి ఉండవచ్చు. లేదా శాంతి, భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న కారణంగా కూడా ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన వాస్తవాలను బయటపెట్టి ఉండకపోవచ్చు. తేనెతుట్టె కథ చెప్పే ముందు ‘తేనెతుట్టె’ను రాత్రిపూట కదపరనే వాస్తవాన్ని విస్మరించడం ఎపిసోడ్ వికటించడానికి కారణమైంది.

నవ్యాంధ్ర ఏర్పడిన నాటి నుంచీ ఆలయ భూముల వివాదాలు కొనసాగుతన్నాయి. 2019 తర్వాత ఆలయ విధ్వంసం మొదలైంది. ఆలయ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొనసాగడం విషాదం. సదావర్తి సత్రం భూమలు మొదలు అప్పన్న భూముల వరకూ, పిఠాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ విధ్వంసం నుంచి అంతర్వేది రథం దగ్ధం చుట్టూ.. కుట్ర పూరితమైన రాజకీయం సాగుతోంది.

అంతర్వేది నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆలయంలో మొత్తం 32 సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది పనిచేయడం లేదు. రథానికి సమీపంలోని సీసీ కెమెరా నెల రోజులుగా పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల వర్షాల కారణంగా రెండు వారాలుగా సాంకేతిక సమస్య ఎదురైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కెమెరా పనిచేసిఉంటే ప్రమాదానికి కారణంపై స్పష్టత వచ్చేది. మరోవైపు డాగ్‌ స్క్వాడ్‌ ప్రమాద స్థలి నుంచి వేగంగా బయల్దేరి కల్యాణ వేదిక నుంచి పక్కనే ఉన్న తలనీలాలు సమర్పించే ప్రాంతానికి చేరుకుని అక్కడే ఎందుకు ఆగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆలయానికి ఇన్‌ఛార్జి అధికారిని అమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి పూర్తి బాధ్యతలతో పాటు తలుపులమ్మలోవ ఆలయానికి కూడా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడడానికి ప్రధాన కారణం ఇదేనని పలువురు ఆరోపిస్తున్నారు. అదనపు బాధ్యతలు అప్పగించేటప్పుడు సమీపంలోని ఆలయాలకు కాకుండా దూరం.. దూరం ఉన్న ఆలయాల బాధ్యతలు ఎలా అప్పగిస్తారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆలయంలో 85 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది రెగ్యులర్‌ సిబ్బంది కాగా మిగిలిన 68 మంది ఎన్‌ఎంఆర్‌లు, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు ఎన్‌ఎంఆర్‌లు మాత్రమే విధుల్లో ఉన్నారు. రథం చాలా వరకు కాలిపోయిన తర్వాత గానీ ప్రమాదాన్ని గుర్తించలేదు.

ఆలయ ప్రాంగణంలో 40 అడుగుల ఎత్తున్న రథాన్ని శ్లాబుతో నిర్మితమైన 50 అడుగుల షెడ్డులో ఉంచారు. ముందు భాగంలో ఎండ, వాన తగలకుండా తలుపు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం తాటాకులు, ప్లాస్టిక్‌ తాడులతో కూడిన తాత్కాలిక అడ్డుగోడ ఏర్పాటు చేశారు. రథం ఉంచే షెడ్డుకు ఎలాంటి విద్యుత్తు వైరింగ్‌ గానీ, సౌకర్యం గానీ ఏర్పాటుచేయలేదు. పై నుంచి కూడా ఎలాంటి తీగలు లేవు. దీంతో అగ్నిప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.

భక్తులు నాణాలు విసిరేస్తే ఏడుకొండలవాడి పింక్ డైమండ్ పగిలిపోయింది, ముక్కలు చెక్కలైంది, పిచ్చివాళ్ల కారణంగా బిట్రగుంటలో ప్రసన్న వేంకటేశ్వర స్వామి రథం దగ్ధమైంది, అంతర్వేది ఘటన తేనె సేకరణ ముఠా చేసింది అనడం హాస్యాస్పదం.

పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయ పురోగతి, సాహిత్య సృజన, కళాపోషణ, ఆధునిక సేద్యం లాంటి రంగాల్లో విశేషమైన చరిత్రను నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆలయ భూములు, ఆలయాల విధ్వంసం, ముక్కారు పంటలు పండే రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం అనే అవాంఛనీయమైన విష వలయంలో ఇరుక్కు పోవడం ఆంధ్ర ప్రాంతపు నైతిక ప్రతిష్ఠకే కాదు, ఆర్థిక ప్రగతి కూడా ఆటంకమనే వాస్తవాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి.

కేవలం రాజకీయ ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సేవల్లో తరించింది గత ప్రభుత్వం. వై.ఎస్.జగన్ ప్రభుత్వం అందుకు భిన్నమనీ, ధార్మిక అంశాల విషయంలో ఖచ్చితంగా వ్యవహరించేవారిమనీ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఆలయాల పరిరక్షణ కేవలం ధార్మిక అంశమే కాక, సాంస్కృతిక నేపథ్యమనీ గుర్తించాలి.

#RightAngle #SaiKrishna #Antarvedi #ChariotBurning #AndhraPradesh #JaganMohanReddy