మాన్‎సూన్ సెషన్..! మాస్క్ వుంటేనే పర్మిషన్..!!

Sep 12, Sat 2020 12:38 PM Politics

-- సరికొత్తగా పార్లమెంట్ వర్షకాల సమావేశాలు
-- పార్లమెంట్ చరిత్రలో తొలిసారి మాస్కులతో దర్శనమివ్వనున్న సభ్యులు
-- కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన నిబంధనలు

ముక్కూనోరూ మూసుకునేలా మాస్కులు,.. అవసరమైతే ఫేస్ షీల్డులు,.. సభ్యుడికి సభ్యుడికి మధ్య ఖాళీ సీటు. ఇదీ త్వరలో ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో కనిపించే సీన్. దేశంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న నేపథ్యంలో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు కఠిన నిబంధనలు రూపొందించారు. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలన్నీ సాధ్యమైనంత వరకు డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ దఫా తొలిసారి లోక్‌సభ ఎంపీలు తమ అటెండెన్స్‌ను మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలని వివరించారు. కరోనా నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇలా డిజిటల్‌ అటెండెన్స్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సభ్యులందరూ ఆర్టీపీసీఆర్ కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు.

పార్లమెంట్ లోపల సభ్యుల మధ్య భౌతికదూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేయడంతోపాటు ఎల్‌సీడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో 257 మంది లోక్‌సభ హాల్లో, 172 మంది లోక్‌సభ గ్యాలరీలో, 60 మంది రాజ్యసభలో, 51 మంది రాజ్యసభ గ్యాలరీలో కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు స్పీకర్ తెలిపారు. అయితే 14వ తేదీన లోక్‌సభ ఉదయం, రాజ్యసభ మధ్యాహ్నం జరగనుంది. ఆ తర్వాత రోజు నుంచి రాజ్యసభ ఉదయం వేళ, లోక్‌సభ మధ్యాహ్నం వేళ జరగనుంది. అయితే ఈ సభలు నాలుగు.. నాలుగు గంటలు మాత్రమే జరగనున్నాయి.

ఇదిలావుంటే, శుక్రవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయడు.. రాజ్యసభ మాక్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ కు హాజరైన సభ్యులంతా మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించారు. అధికారులు సైతం మాస్కులతో దర్శనమిచ్చారు. మొత్తానికి, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలకు న్యూ లుక్ వచ్చేసిందన్నమాట.

#Parliament #MansoonSession #Covid #CoronVirus