కాషాయ ప్రభంజనాన్ని కేసీఆర్ ఆపగలరా..?

Sep 12, Sat 2020 12:36 PM Right Angle

-- కేసీఆర్ జాతీయ పార్టీ! రేవంత్ ప్రాంతీయ పార్టీ!!
-- సెన్సేషన్ కు సక్సెస్ సాధ్యమా?
-- కేసీఆర్ నిజంగానే జాతీయ పార్టీ పెడతారా?
-- బీజేపీని ఎదుర్కొనే వ్యూహం సిద్ధం చేసుకున్నారా?
-- రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీకి ఆదరణ ఉంటుందా?
-- రెడ్డి సామాజిక వర్గానికి కోల్పోయిన ప్రాభవం దక్కుతుందా?

ప్రాంతీయ పార్టీ స్థాపించి, ప్రాంతీయ ఆకాంక్షను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారనీ, జాతీయ పార్టీలో క్రియాశీల నేతగా ఉన్న రేవంత్ రెడ్డి త్వరలో ఓ ప్రాంతీయ పార్టీని ప్రకటిస్తారనీ....ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. వాటి సాధ్యాసాధ్యాల మాటెలా ఉన్నా, గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్లిప్తంగా ఉన్న రాజకీయ వాతావరణంలో హుషారు పెంచేందుకు ఈ ప్రచారం కారణమైంది. ఇద్దరూ ప్రాంతీయ పార్టీ నీడలో ఎదిగిన నేతలే! కేసీఆర్ టీడీపీని వీడి తెరాసను ఏర్పాటు చేసాక రేవంత్ అందులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎక్కడ చెడిందో తెలియదు రేవంత్ టీడీపీ నీడన చేరారు.

ఆ ఇద్దరు నేతలూ తిరిగి కొత్త పార్టీల ఆలోచన చేయడం ఆసక్తిరేకెత్తిస్తున్న పరిణామం. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహించీ, దాన్ని సాధించిన కేసీఆర్ పధ్నాలుగేళ్ల ఉద్యమ ప్రయాణం, ఆరేళ్ల పాలనా అనుభవం తర్వాత తనవైన వ్యూహం-ఎత్తుగడలను ప్రామాణీకరించుకున్నారు. రెండు దశాబ్దాల్లో తారసపడిన ఎత్తుపల్లాల, కష్టనష్టాల, అవమాన, సత్కారాల అనుభవ సారాన్ని క్రోడీకరించారు. దీన్నే Conceptualization of practice అంటాం.

ప్రాంతీయ స్థాయిలో నిర్ధారించి, ప్రామాణీకరించుకున్న వ్యూహం-ఎత్తుగడలు జాతీయ స్థాయిలో సాపేక్షికంగా అయినా పరీక్షకు నిలబడతాయా? 90వ దశకం నుంచి 2014 వరకూ సాగిన కప్పలతక్కెడ రాజకీయాల అనుభవాన్ని కేసీఆర్ ఎలా అంచనా కడతారు? దీర్ఘకాలిక వ్యూహంతో, సైద్ధాంతిక లక్ష్యంతో పటిష్ఠ సౌధాన్ని నిర్మించుకున్న బిజెపికి బలమైన ప్రత్యర్థి సమకూరడం సులభమా? జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ డీలా పడుతున్నప్పుడు, ప్రాంతీయ పార్టీ నేత ఓ జాతీయ పార్టీని స్థాపించి, విజయ తీరానికి చేర్చడం సాధ్యమా? లాంటి ప్రశ్నలకు కేసీఆర్ సరికొత్త ఆచరణ సమాధానం ఇస్తుందా..? అనేది చూడాల్సిందే..

ఇక రెండో అంశం రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు.. దీని గురించి విశ్లేషించుకునే ముందు, తెలంగాణ లో అధికారానికి రెడ్లు ఎలా దూరమయ్యారో తెలిపే చారిత్రక పరిణామాన్ని తెలుసుకోవాలి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించి 1971 సెప్టెంబర్ లో పీ.వీ.నరసింహారావును నియమించారు ప్రధాని ఇందిరాగాంధీ. వచ్చిందే తడవుగా భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు పీవీ. ఇందుకు ప్రధాన కారణం భూ సంస్కరణలు స్వాతంత్ర్యోద్యమ ఆకాంక్షలో ప్రధాన భాగం కావడం ఒకటైతే, పీవీ స్వయంగా స్వామీ రామానంద తీర్థకు శిశ్యుడు కావడం మరోకారణం. మొత్తానికి స్వామీ రామానందతీర్థ ఆశయాన్ని శిశ్యుడిగా పీవీ నిజం చేశారు. 1972, మే 2 అర్ధరాత్రి భూ సంస్కరణల ఆర్డినెన్స్ వచ్చింది. ఈ ఆర్డినెన్స్ తో నిర్దిష్ట పరిమితికి మించిన భూముల క్రయవిక్రయ, లావాదేవీలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి.

రాజకీయ ఆదర్శాలు, ఆశయాలూ చదువుకుని తాదాత్మ్యం చెందినంతగా ఆచరణలో అనుకూలించవు. మనం విశ్వసించిన ఆశయాలే మన రాజకీయ జీవితానికి చరమగీతం పాడే అవకాశాలే ఎక్కువ. పీవీ విషయంలో అదే జరిగింది. తెలంగాణ ప్రాంతంలో భూమి ఎక్కువ మోతాదులో రెడ్లు, బ్రాహ్మణ జమీందార్ల ఆధీనంలోనే ఉండేది. జనాభా రీత్యా బ్రాహ్మణ జమీందార్ల సంఖ్య తక్కువ. పైగా రెడ్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నాటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అంటే రెడ్లు, రెడ్డి అంటేనే కాంగ్రెస్ అనేంత ప్రాబల్యం ఉండేది. అలాంటి రెడ్డి సామాజికవర్గానికి చెందిన భూమిని భూసంస్కరణల పేరిట సొంత పార్టీ, తమ ప్రభుత్వమే తీసుకోవడం తీవ్ర రాజకీయ, సామాజిక పరిణామాలకు దారితీసింది. అదనులో పదునులా ముల్కీ నిబంధలపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు. ఖచ్చితంగా అమలు చేస్తామని బహిరంగ ప్రకటన చేశారు. మొత్తంగా భూ సంస్కణల ఆర్డినెస్స్ వచ్చిన ఏడాదికే పీవీ ముఖ్యమంత్రి పదవి ఊడింది. పదవి పోవడానికి రెండు కారణాలు: భూసంస్కణలు, ముల్కీ నిబంధనల తీర్పు సమర్థన. తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న భూమి ఏదో ఒక ప్రమాణంలో తగ్గింది. పీవీ తన మంత్రివర్గంలో రెడ్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. బ్రాహ్మణులకు కూడా సముచిత స్థానం ఇవ్వలేదన్నఅంచనాలూ ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఆర్థిక మూలాలు ప్రభావితం కావడం, రాజకీయ ప్రాతినిథ్యం కొరవడటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, కాంగ్రెస్ పార్టీలో ఇది తొలి పరిణామం.

రెండో పరిణామం: తెలుగుదేశం ఆవిర్భావం, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు
భూ సంస్కరణలు అమలైన దశాబ్ద కాలానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడింది. 1972, మే2న భూ సంస్కరణల ఆర్డినెన్స్ ప్రకటన, 1982, మార్చి29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన. సుమారుగా పదేళ్ల తేడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరోకీలక పరిణామాన్ని కూడా గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీకి ఇరుసుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ప్రతిగా కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ రూపంలో రాజకీయ ప్రాతినిథ్యం లభించింది. కాంగ్రెస్ లో కమ్మవారి పాత్ర తక్కువ. అందుకు కారణాలూ లేకపోలేదు. జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కమ్మ సామాజిక వర్గం స్వాంతంత్ర్యానంతర కాలంలో పరిశ్రమలూ, వ్యాపారం లాంటి రంగాలకు తరలిపోయింది. వాణిజ్యం, వ్యవసాయం విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చారన్నది ఒకానొక పరిశీలన. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మవారి ప్రాధాన్యత విశేషంగా పెరిగింది. తెలంగాణకు ఆంధ్రప్రాంతం నుంచి వలస, కమ్మవారి ప్రాబల్యం పెరిగింది. హైదరాబాద్ చుట్టుతా పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారిదే ప్రధాన పాత్ర. సినిమా రంగంలో చెప్పనక్కరలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, ఆ పార్టీ అధికారంలో ఉన్నా రాయలసీమ రెడ్ల ప్రాబల్యం కారణంగా తెలంగాణ రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యత లేని పదవులో, ప్రాధాన్యత ఉన్నా నిర్ణయాలు తీసుకునే శక్తిలేని స్థానాల్లోనో ఉన్నారు మినహా అధికారంగా అడిగి తీసుకునే స్థితి లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతుంటారు.

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు ఎన్టీఆర్. అందుకు సామాజిక పొందికతో పాటు, కాంగ్రెస్ బలాబలాల్ని పరిగణలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అక్కున చేర్చుకున్న రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాలను పక్కనబెట్టి, ఆ పార్టీ విస్మరించిన బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలు తెలుగుదేశం పార్టీలో చేరడమన్నది తెలంగాణ గ్రామాల్లో అనేక మార్పులకు కారణమైంది. రెడ్ల అధికారాన్ని సవాలు చేసేందుకు బీసీలకు ఓ రాజకీయ వేదిక దొరికినట్లయింది. పోలీస్ పటేల్, మాలి పటేల్, పట్వారీ అనే మూడు పదవుల ఆధారంగా అంతకాలం నడిచిన తెలంగాణ గ్రామీణ పాలనా వ్యవస్థను 1985లో రద్దు చేశారు ఎన్టీ ఆర్. దీన్నే వ్యవహారంలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు అంటారు. పోలీస్ పటేల్ శాంతి, భద్రతలు పర్యవేక్షిస్తే, మాలి పటేల్ పాలనా వ్యవహారాలను చూసేవాడు. పట్వారీ భూ రికార్డుల నిర్వాహణ ఇతర రెవెన్యూ సంబంధిత పనులు చూసేవాడు. స్థూలంగా పోలీస్ పటేల్, మాలి పటేల్ పదవులను ఎక్కువగా రెడ్లు నిర్వహిస్తే, పట్వారీ ఉద్యోగం బ్రాహ్మణుల చేతిలో ఉండేది.

అనంతర కాలంలో రెడ్లు కూడా తెలుగుదేశంలో చేరి వారు ఇచ్చిన పదవులను పొందారు. అంటే రెడ్ల ప్రాధాన్యత తగ్గే పరిణామం 1972 మొదలైతే 1985 పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో గుణాత్మకంగానే మారింది. 1989లో మండల్ కమిషన్ సిఫారసుల అమలు కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు క్రమంగా వివిధ రంగాలకు విస్తరించారు. పరిమాణంలో తక్కువే అయినా, అంతకు ముందున్న స్థితి నుంచి ప్రశ్నించే స్థితికి వచ్చారు.

తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ రెడ్డి సామాజికవర్గం కీలక పాత్ర పోషించింది. 1969 తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి ప్రాబల్యాన్ని కనపరిచింది. కాలక్రమంలో అది కాంగ్రెస్ లో కలిసిపోవడంతో కథ ముగిసింది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో పి.ఇంద్రారెడ్డి ‘జై తెలంగాణ పార్టీ’ పెట్టి ప్రయత్నాలు ఆరంభించిన కొన్నాళ్లకే ప్రమాదంలో మరణించారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో కొంతకాలం ఖాళీ ఏర్పడింది. నిజానికి ఇంద్రారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం కొనసాగి ఉంటే రెడ్డి సామాజిక వర్గం పాత్ర ఎలా ఉండేది అనే హైపోథెటికల్ సందేహం ఆసక్తిని రేకెత్తిస్తుంది. తిరిగి 2001లో కేసీఆర్ టీడీపీని వీడి టీఆర్ఎస్ స్థాపించడం, కేసీఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఉద్యమ స్వభావాన్ని మార్చింది. ఉద్యమ విజయం తర్వాత అందే ప్రతిఫలాల పంపకంలో ప్రస్ఫుటంగా అది ప్రతిఫలించింది. ఉద్యమం నుంచి లాబీ వరకూ, కాంగ్రెస్ భజన నుంచి బెదిరింపు వరకూ కేసీఆర్ అవలంబించిన ఎత్తుగడలు ఓ రెడ్డి సామాజిక వర్గం నేత అవలంబించే అవకాశం ఉంటుందా? అంటే సమాధానం అత్యంత సంక్లిష్టమైంది.

తెలంగాణలో తొలి నుంచీ రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా గట్టి పట్టుండేది. కాంగ్రెస్‌లో కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి ప్రముఖులు ఉంటే, పీడీఎఫ్‌ లో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి వంటి ప్రముఖులు ఉండేవారు. 1952 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం వారు కాంగ్రెస్‌ నుంచి తొమ్మిది మంది గెలిస్తే, పీడీఎఫ్‌ నుంచి పది మంది విజయం సాధించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో రెడ్ల ప్రాబల్యం అప్పటి నుంచే ఉన్నట్లు ఫలితాలను విశ్లేషిస్తే అర్ధమవుతుంది. ఇంకా సోషలిస్టు పార్టీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లుగా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గంవారు నాటి ఎన్నికల్లో గెలుపొందారు.

తెలంగాణ లో 1983లో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 34 ఉంటే బీసీ-17, ఎస్సీ-17, ఎస్టీ-08 మంది ఉన్నారు. ఇది 2018 వచ్చే సరికి రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 40 ఉంటే బీసీలు 22 మంది, ఎస్సీలు 19, ఎస్టీలు 12 మంది ఉన్నారు. 1983 నుంచి 2018 వరకూ రెడ్డి ఎమ్మెల్యేల సంఖ్య 34 నుంచి 40 లోపు తచ్చాడుతూ ఉంది. 1983లో వెలమ ఎమ్మెల్యేల సంఖ్య 8 మంది మాత్రమే అదే 1989లో 14కు పెరిగింది. ప్రస్తుతం 10కి పరిమితమైంది. రెడ్డి ఎమ్మ్యేల సంఖ్య ఎక్కువే అయినా ప్రాధాన్యతా క్రమంలో చివరి వరుసలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యం ఉన్నట్టే కనిపించినా....ఏ కీలక పదవిలో ఉన్నవారికైనా నిర్ణాయకశక్తి ఉండదు.

ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉంది. కేవలం రెడ్డి సామాజిక వర్గం మూలంగానే కాంగ్రెస్ తెలంగాణలో మనగలుగుతోంది. అయితే కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఆశాజనకంగా లేకపోవడంతో రేవంత్ రెడ్డి లాంటి సత్తా ఉన్న నేతలు కొత్త పార్టీ పెట్టి, రెడ్డి సామాజిక వర్గం ప్రభ మరోసారి అధికార పీఠంపై వెలుగులు విరజిమ్మాలనుకోవడం సహజం.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షమే లేని లేదా, బలహీన ప్రతిపక్షం గల వాతావరణం అత్యంత ప్రమాదకరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణ ఆవిర్భావంలో కీలక పాత్రపోషించాయి. అయితే తమ రాజకీయ పరపతిని ఎన్నికల గణాంకాల్లోకి తర్జుమా చేసుకోలేకపోయాయి. మొదటి ఎన్నిక మాటెలా ఉన్నా కనీసం 2018 ఎన్నికల్లో అయినా కాస్త మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉండింది. తిరిగి టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ మరింత ఢీలా పడింది. ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి పార్టీ పెట్టేందుకు కాలమాన పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా అంతకు మించి చిక్కుముడులూ ఉన్నాయి. రంగంలోకి దిగితే సాధించలేని పద్మవ్యూహమేమీ కాదుగానీ, కేసీఆర్ అనబడ కౌటిల్య రాజనీతిని ఢీకొట్టగల యుద్ధనైపుణ్యం కావాలి.

ఏమీ చేయకపోవడమంటే కూడా ఏదో ఒకటి చేయడమే! అన్నారు మాజీ ప్రధాని, దివంగత పీ.వీ.నరసింహారావు. మిగతా వీషయాల్లో ఏమో కానీ, ఈ సూక్తిని మాత్రం కేసీఆర్ తూ.చ తప్పక పాటిస్తారు. దినపత్రికల్లో దర్శనమిస్తున్న కేసీఆర్ జాతీయ పార్టీ వార్త నిజమో అబద్ధమో తెలియదు. రేపటి చిత్రం నేడే విడుదలైనట్టూ...బయటకు పొక్కిందేమో చెప్పలేం.

తెలంగాణ లో పెరుగుతున్న కాషాయ జెండా గాలిని నిలువరించడానికి వ్యూహాత్మకంగా తనను తాను జాతీయ స్థాయి నాయకుడిగా ప్రోజెక్ట్ చేసుకోవాలని కే సీఆర్ ప్రణాళికలు రచిస్తున్నాడనీ, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అనీ కొట్టి పారేస్తున్నవారూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మోదీ మానియాను తట్టుకోవాలంటే జాతీయ పార్టీ పేరుతో ఎంతో కొంత హడావిడి చేయడమే కేసీఆర్ వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ రెంటి భవితవ్యం తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే..!

#RightAngle #SaiKrishna #Kcr #NationalParty #RevanthReddy #LocalParty