కాంగ్రెస్ వీడియో నాటకం..! అసలు నిజం బహిర్గతం..!!

Sep 09, Wed 2020 08:35 PM Politics

-- బట్టబయలైన కాంగ్రెస్ పెద్దల చైనా అనుకూల వైఖరి
-- చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ చెట్టాపట్టాల్..!
-- వెలుగుచూసిన అగ్రిమెంట్ ఫొటోలు..!
-- డ్యామేజీ కంట్రోల్ కోసం చైనా టూరిస్టు వీడియోతో కొత్త నాటకం
-- అసలు నిజం బయటపడటంతో అభాసుపాలు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ.. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ నేషనల్ పార్టీ.. ఇప్పుడు అవసాన దశలో వుందనేది కాదనలేని వాస్తవం. భారత రాజకీయ చరిత్రలో.. తొలిసారి వరుసగా రెండుసార్లు ఓడిపోయి.. తన కీర్తిని పాతాళానికి దిగజార్చుకుంది. దీంతో ఎలాగైనా గట్టెక్కడానికి ఆ పార్టీ చేయని ప్రయత్నాలంటూ లేవు. పునర్వైభవం కోసం ఆ పార్టీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. కనీసం పార్టీ ఉనికినైనా నిలుపుకోవడం కోసం.. వారసత్వ నాయకత్వం నిద్రలోనూ ఉలికిపాట్లు పడుతోంది.

విచిత్రమేమిటంటే.. కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో.. ఆ పార్టీ కీర్తిని మరింత దిగజార్చుతున్నారు హస్తం పెద్దలు. నాయకత్వ మెప్పుకోసమో.. లేక, ప్రత్యర్థిపై బురద జల్లడం కోసమో తెలియదు గానీ, పేరెన్నికగన్న ఆ పార్టీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా రాద్దాంతం చేసి.. ప్రభుత్వంపై బురదజల్లి అబద్ధపు కథనాలు వండి వారుస్తున్నారు. ప్రజల్లో భ్రమలు కల్పించి అభాసుపాలవుతున్నారు. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేసి.. మరోసారి పరువు పోగొట్టుకున్నారు కాంగ్రెస్ పెద్దలు.

ఓవైపు చైనా కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోతున్నాయి. సరిహద్దుల్లో మాటిమాటికీ ఉద్రిక్తతలను పెంచిపోషిస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే, చైనా కుటిల ప్రయత్నాలకు మన వీరజవాన్లు బుద్ధి చెబుతూనేవున్నారు. సరిహద్దులు దాటితే కబడ్దార్ అంటూ హెచ్చరిస్తూనేవున్నారు. అయినా బుద్ధి మార్చుకోని బీజింగ్ రాక్షసమూక.. తాటాకు చప్పుళ్లు వినిపిస్తూనేవుంది. దీంతో రణక్షేత్రంలోనే కాదు, అటు దౌత్యపరంగా కూడా దెబ్బమీద దెబ్బ వేస్తోంది భారత్. ఇప్పటికే చైనా యాప్స్ ను, చైనా వస్తువులను బహిష్కరించే పనిలో మోదీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తద్వారా ఆర్థికంగా చైనాను కోలుకోకుండా చేయాలని ప్రయత్నిస్తోంది.

ఇలాంటి సమయంలో కేంద్రానికి అండగా వుంటూ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం.. ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకు అలవాటైన రీతిలో ప్రభుత్వంపైనే నిందలు వేస్తోంది. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పువాటిల్లేలా ప్రవర్తిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు సరిహద్దుల విషయంలో, సైనిక పాటవం విషయంలో యక్ష ప్రశ్నలు వేసి.. రాహుల్ గాంధీ పరువు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా అబద్ధపు కథనాలు అల్లి.. బొక్కాబోర్లా పడ్డారు.

ఎక్కడలేని దేశభక్తి..!
అసలు విషయానికి వస్తే.. ప్యాంగాంగ్ సరస్సులో విహరిస్తున్న చైనీయుల వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ. అంతటితో ఆగకుండా.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. " ఇదిగిదిగో చూడండి లద్దాక్ లో చైనా టూరిస్టులు..!, ఇక ఎవరైనా చౌకీదార్ ను ప్రశ్నించండి.. ఇప్పుడు భారతీయులు ప్యాంగాంగ్ సరస్సును సందర్శించాలంటే వీసా కావాలేమో.." అంటూ ఎగతాళి చేశాడు.


ఇక, సరళ్ పటేల్ అనే మరో కాంగ్రెస్ నేత.. "ప్యాంగాంగ్ లో చైనా టూరిస్టులు" అంటూ పోస్ట్ పెట్టారు.

కాంగ్రెస్ నాయకురాలు షమా మొహమద్ అయితే, మరో అడుగు ముందుకేసి.. ఎక్కడలేని దేశభక్తినంతా ప్రదర్శించారు. " ప్యాంగాంగ్ వద్ద చైనా టూరిస్టులను చూస్తే.. భారతీయురాలిగా నా రక్తం మరిగిపోతోంది.. ఇంత జరుగుతున్నా మోదీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. చొరబాట్లకు పాల్పడలేదంటూ బుకాయిస్తున్న.. చైనా మాటల్నే నమ్ముుతున్నారు." అంటూ తన ఆవేశాన్నంతా వెళ్లగక్కారు.

ఇక, కాంగ్రెస్ డిజిటల్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్, సోషల్ మీడియా డిపార్ట్ మెంట్ కు చెందిన గౌరవ్ పంధి.. మరింత రెచ్చిపోయాడు. "ప్యాంగాంగ్ సరస్సులో చైనా టూరిస్టుల విహారం, విదేశీ టూరిస్టులకు కూడా చైనా అనుమతి ఇచ్చింది" అంటూ ఎగతాళి చేశాడు. అంతటితో ఆగకుండా.. "ఇంత జరిగినా.. చైనాను వదిలిపెట్టి బీజేపీ ప్రభుత్వం మన ఆర్మీని కించపరిచేలా.. తన అశక్తతను ప్రదర్శిస్తోంది" అంటూ 2009 లో ప్యాంగాంగ్ వద్ద షూటింగ్ జరుపుకున్న.. త్రీ ఇడియట్ సినిమా షూట్ కు సంబంధించిన ఓ ఫొటోను జతచేశాడు. అప్పట్లో ఇది భారత భాభూగమని.. ఇప్పుడు చైనాలో వుందని చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇదీ అసలు నిజం..!
ఇలా, చైనా టూరిస్టుల వీడియోను ఆధారంగా చేసుకుని.. ఒకరి వెనుక ఒకరు రెచ్చిపోయి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఓ తప్పుడు వీడియోను ఒప్పుగా చూపిస్తూ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా ఇందులో ఏమాత్రం నిజం లేదు. అసలు, భారత ప్రభుత్వం ప్యాంగాంగ్ సరస్సును స్వాధీనం చేసుకున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి, ఈ సరస్సు భారత భూభాగంలో 40 శాతం, చైనా ఆక్రమిత టిబెట్ లో 60 శాతం ప్రవహిస్తోంది. చైనా టూరిస్టులు మన భూభాగంలోకి వచ్చేశారని.. గుండెలు బాదుకుంటూ కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేసిన వీడియో.. ప్యాంగాంగ్ సరస్సు చైనా వైపు భాగానికి సంబంధించింది. తమ భూభాగంలో విహరించే హక్కు ప్రతి దేశ పౌరులకూ ఉంటుంది. అలాగే, ప్యాంగాంగ్ సరస్సు చైనా వైపు ఉన్న భూభాగంలో చైనీలు విహరించడంలో తప్పేముంది..? అయితే,.. ఈ వీడియోను కావాలని తప్పుగా ప్రచారం చేసి.. కేంద్రంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ.

మరి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి మరీ ఇంతలా దిగజారాలా..? ఇంత దారుణానికి ఒడిగట్టాలా..? ఎందుకిలా చేశారని ఆలోచిస్తే.. హస్తం పార్టీ అసలు తత్వం బోధపడింది. కాంగ్రెస్ తాలూకు కుటిల నీతి వెలుగుచూసింది. కుట్రపూరితంగా కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని స్పష్టమైంది.

చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ చెట్టాపట్టాల్..!
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు.. చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఓ ఒప్పందం చేసుకుంది. ఇరు పార్టీలు పరస్పర సహకారంతో మెలగాలని అవగాహనకు వచ్చాయి. ఇందుకోసం నాటి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలు ఎంవోయూపై సంతకాలు కూడా చేశారు. ఈ ఒప్పందం ప్రకారం హస్తం నేతలు ఎప్పుడూ చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూవుంటారు. అందుకే, భారత్, చైనా మధ్య ఎప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నా.. కాంగ్రెస్ పార్టీ చైనా పట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తుంటుంది. అయితే, ఇటీవల గల్వాన్ ఘటన చోటుచేసుకోవడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న సమయంలో.. ఈ ఒప్పందం తాలూకు ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో ఖంగుతిన్న కాంగ్రెస్ పార్టీ.. డ్యామేజీ కంట్రోల్ కోసం.. చైనా టూరిస్టు వీడియో నాటకాన్ని రక్తికట్టించారు. ఎక్కడ పరువు పోతుందోనని ఆలోచించి.. అప్పటికప్పుడు ఇలాంటి అబద్ధపు కథనాలు వండివార్చారు. అదన్నమాట అసలు సంగతి..!

మరోసారి పరువుపోగుట్టుకున్న కాంగ్రెస్
అయితే, కాంగ్రెస్ కుటిల నీతిని పసిగట్టిన జనం.. హస్తం పెద్దలను అసహ్యించుకుంటున్నారు. ప్రత్యర్థిని విమర్శించాలంటే, మన సైనిక పాటవాన్ని తక్కువ చేసి చూపించాలా..? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే మన వీరజవాన్లు గల్వాన్ లోయలో చైనాకు గుణపాఠం చెప్పారు. అటు, ప్యాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపునున్న.. కీలక ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకుని.. శత్రుమూకలకు సవాలు విసిరారు. అంతేకాదు, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాల వంటివి చేపట్టి.. సైనికుల అవసరాలను తీర్చడంలో కేంద్రం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రఫేల్ వంటి అత్యాధునిక ఆయుధ శక్తిని కూడా ప్రోగుచేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రానికి, సైన్యానికి అండగా నిలవాల్సిందిపోయి.. అబద్ధపు కథనాలతో బురదజల్లిన కాంగ్రెస్ పార్టీని జనం అసహ్యించుకుంటున్నారు. ఇలాంటి కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

#CongressPropaganda #China #ChineseCommunistParty #GalwanValley #PangyongLake #IndianArmy #PLA