డ్రగ్స్ రాకెట్ లో బాలీవుడ్ ప్రముఖులు..!

Sep 08, Tue 2020 06:09 PM Politics

-- సుశాంత్ మృతి కేసులో కొత్త మలుపులు
-- విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన రియా
-- నాలుగు రోజుల విచారణ తర్వాత రియా అరెస్ట్

అంతా ఊహించినట్టే జరిగింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న.. బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. నాలుగు రోజుల విచారణ తర్వాత రియాను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ లింకులకు సంబంధించి రియాను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. అధికారులు రియాను కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి ఆధారాలతోనే రియా చక్రవర్తిని అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు స్పష్టం చేశారు.

ఇక, ఈ కేసులో ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరిండాలకు ముంబై కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించింది. బుధవారం వరకు వీరిద్దరు ఎన్సీబీ రిమాండ్ లో వుంటారు. వీరితో పాటు డ్రగ్స్ కేసుతో సంబంధం వున్న పలువురిని ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ కేసులో డ్రగ్స్ కు సంబంధించి ఇప్పటికే షోవిక్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. రియా సూచనలతోనే తాను సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు షోవిక్ ఎన్సీబీ విచారణలో తెలిపాడు. షోవిక్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్సీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమెను అరెస్ట్‌ చేశారు.

సుశాంత్ తో కలిసి గంజాయి సేవనం..!
ఇదిలావుంటే, నాలుగు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ విచారణలో రియా చక్రవర్తి పలు సంచలన విషయాలు వెల్లడించింది. డ్రగ్స్ కు సంబంధించి ఏకంగా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను బయటపెట్టడం సంచలనంగా మారింది. దీంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కార్టెల్ ఎ, బి, సి కేటగిరీలకు సంబంధించిన 25 మంది బాలీవుడ్ ప్రముఖుల జాబితాను ఎన్సీబీ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం.

ఇక, సుశాంత్ తో కలిసి తాను గంజాయి దట్టించిన సిగరెట్లు తాగేదాన్నని రియా ఎన్సీబీ ముందు అంగీకరించింది. అంతేకాదు, సుశాంత్ సింగ్ 2016 నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడని బాంబు పేల్చింది రియా చక్రవర్తి. ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అధికారులు ఆ విషయాన్ని రాబట్టారు. రియా పాత మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ల ఫోరెన్సిక్ పరీక్షల్లో ఎన్సీబీ పలు విషయాలు వెలుగుచూశాయి.

మూడేళ్లుగా డ్రగ్స్ మాఫియాతో లింకులు..!
రియా 2017, 2018, 2019ల్లో డ్రగ్స్ సర్కిల్ లో చాలా చురుగ్గా ఉన్నట్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న గాడ్జెట్స్ ద్వారా తెలుస్తోంది. ఆ గాడ్జెట్స్ నుంచి దర్యాప్తు సంస్థలు మత్తుపదార్థాలకు సంబంధించిన పలు ఫొటోగ్రాప్ లను, వీడియోలను, వాట్సప్ సందేశాలను, ఎస్ఎంస్ లను రాబట్టారు. వీడియోల్లో, ఫొటోల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వారి గురించి ఎన్సీబీ ఆరా తీస్తోంది.

ఇదిలావుంటే, సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కు సంబంధించి పలు అరెస్టులు జరిగే అవకాశం వుంది. సుశాంత్ పని మనిషి నీరజ్ కు సంబంధించి రియా, షోవిక్, శామ్యూల్ ఇప్పటికే కొన్ని విషయాలు వెల్లడించారు. దాంతో నీరజ్ ను కూడా ప్రశ్నించాలని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు.

ఈ కేసులో శృతి మోదీకి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. సోమవారం నాటి విచారణలో శృతి మోదీ సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. డ్రగ్స్ ఇంటికే వచ్చేవా..?, డ్రగ్స్ కొనుగోలుకు ఎవరి డబ్బులు వాడేవారు..?, ముంబైలోని హోటల్లో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా..? వంటి ప్రశ్నలకు ఆమె జవాబులు ఇవ్వలేదు. దీంతో మరింత లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు.

#Sushant #Drugs #Rhea #Arrest #Bollywood #NCB