అక్క చెబితేనే అలా చేశాం..!

Sep 05, Sat 2020 11:01 PM Politics

-- రియా ఆదేశాలతోనే సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చామన్న షోవిక్
-- డ్రగ్స్ మాఫియాతో సంబంధాలపై నోరు విప్పిన రియా సోదరుడు
-- NCB దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు..!

ముంబై మహానగరం డ్రగ్స్ మాఫియా ముసుగులో ఎంతలా కూరుకుపోయిందో.. బాలీవుడ్ బలవంతంగా ఎలా మత్తుకు బలవుతుందో.. సుశాంత్ సింగ్ కేసును బట్టి అర్థం చేసుకోవచ్చు. సుశాంత్ మృతి కేసులో తవ్వుతున్న కొద్దీ కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటికొస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో సంబంధాల ఆరోపణలపై అరెస్టయిన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజర్ శ్యామూల్ మిరాండా నోరువిప్పారు. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో విచారణలో షోవిక్ చెప్పిన విషయాలు దిగ్బ్రాంతిని కలిగిస్తున్నాయి .

ఎవరీ బాసిత్..?
డ్రగ్స్ మాఫియా లింకులపై దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ బ్యూరో శుక్రవారం ఉదయమే రియా, షోవిక్, శ్యామూల్ మిరాండా నివాసాలపై దాడులు చేసింది. షోవిక్‌కు డ్రగ్స్ సప్లయర్ బాసిత్‌కు సన్నిహిత సంబంధాలు, డ్రగ్స్ వాడకం విషయాలు బయటకు రావడంతో ల్యాప్‌టాప్ సీజ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అంతేకాకుండా రియా కారు, మొబైల్ ఫోన్ తో పాటు షోవిక్ ల్యాప్ టాప్ ను కూడా అధికారులు సీజ్ చేశారు.

రియా క్రెడిట్ కార్డ్ తోనే డ్రగ్స్ కొనుగోళ్లు..!
ఎన్సీబీ అధికారుల విచారణలో షోవిక్ చక్రవర్తి సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. శ్యామ్యూల్ మిరాండా సహాయంతోనే తాను డ్రగ్స్ సేకరించానని.. సోదరి రియా చక్రవర్తి ఆదేశాల మేరకు సుశాంత్ సింగ్‌కు డ్రగ్స్ ఇచ్చామని.. షోవిక్ పలు విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. అంతేకాదు, రియా క్రెడిట్ కార్డుతోనే శ్యామ్యూల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశామని NCB అధికారులకు వివరించాడట షోవిక్. డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించి రియా క్రెడిట్ కార్డు ద్వారా దాదాపు 12 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు అధికారులు గుర్తించారు.

ఫుట్ బాల్ క్లబ్ లో పిచ్చాపాటి..!
ఇక డ్రగ్స్ సప్లయర్ బాసిత్ పరిహార్‌తో చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని.. ముంబైలోని బాంద్రా వద్దనున్న ఫుట్‌బాల్ క్లబ్‌లో కలుసుకునే వాళ్లమని.. రెండేళ్లుగా కాంటాక్ట్‌‌లో ఉన్నామని.. షోవిక్ పూసగుచ్చినట్టు వివరించాడట. అంతేకాదు, చాలాసార్లు తమ ఇంటికి బాసిత్ వచ్చేవాడని.. తన కుటుంబ సభ్యులతో కూడా బాసిత్ కు పరిచయం వుందని షోవిక్ చెప్పినట్టు సమాచారం. షోవిక్ చెప్పిన ఆధారాలతో ప్రస్తుతం కస్టడీలో వు న్న బాసిత్ ను విచారించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

ఇక రియా వంతేనా..?
ఇప్పటికే ఈ కేసులో రియాను సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ప్రశ్నించాయి. రియాపై ఎన్సీబీ క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. ఇక ఇప్పటికే ఈడీ రికార్డు చేసిన రియా చక్రవర్తి వాట్సాప్ ఛాటింగ్.. ఈ కేసులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. విచారణ సమయంలో కొన్ని మెసేజ్ లు డిలీట్ అయినట్టు ఈడీ గుర్తించింది. డిలీట్ అయిన మెసేజ్ లు సేకరించిన ఈడీ.. వాటిని ఎన్సీబీ అధికారులకు అందించినట్టు తెలుస్తోంది. ఈ మెసేజ్ ల ఆధారంగానే ఎన్సీబీ కేసు రిజిస్టర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రియాకు చెందిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిలోని ఛాటింగ్స్, మెసేజ్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి, షోవిక్ నోరు విప్పిన నేపథ్యంలో NCB అధికారులు రియా చక్రవర్తిని ఏ క్షణమమైనా అరెస్ట్ చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

వేగం పెంచిన CBI
అటు, CBI కూడా సుశాంత్ మృతి కేసులో వేగం పెంచింది. సుశాంత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పితాని, వంటమనిషి నీరజ్, పనిమనిషి కేశవ్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. మరోసారి క్రైమ్ సీన్ ను రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సుశాంత్ సోదరి మితూసింగ్ ను కూడా అధికారులు విచారణకు పిలిచినట్టు సమాచారం.

#Sushant #Drugs #Rhea #NCB #CBI