పెంటగాన్ గుప్పిట డ్రాగన్ గుట్టు..!

Sep 05, Sat 2020 10:06 PM Right Angle

నెరవేరకుండానే కల విచ్ఛిత్తి కావడం వైయక్తిక స్థితిని కాస్త తారుమారు చేస్తుంది. అయితే అదే అగ్రరాజ్యాపు కల మబ్బు తునకవలె పొరలు పొరలుగా గాలిలో తేలిపోవడం భౌగోళిక రాజకీయాలను తలక్రిందులు చేస్తుంది. చతురంగబలాల సైన్యం, అణువణువూ పుక్కిటపట్టే ఆర్టీఫీషియల్ ఇంటెలీజెన్స్, వైరి విశ్రాంతిగదిని స్కాన్ చేయగల నిఘానేత్రం, వలపు వల విసిరి రహస్యం తెలుసుకునే గూఢచర్యం ఉన్న దేశమది. అలాంటి అమెరికా, శతృదేశ బలాబలాలతో సరి పోల్చుకునే స్థితికి రావడం ఊహించని పరిణామం. పెంటగాన్ అంటే సంస్కృతంలో ‘పంచభుజి’ అని అర్థం. అమెరికా సాయుధ శక్తికి అలంకార నామమే ‘పెంటగాన్’. ప్రపంచంలోనే అతి విశాలమైన అధికారిక ప్రాంగణం దాని సొంతం. 65లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో, 1941లో రూపుదిద్దుకుంది ‘పంచభుజి’ కార్యాలయం.

పెంటగాన్ షష్ఠిపూర్తి చేసుకున్నరోజే, అంటే 2001, సెప్టెంబర్11న ఆల్ ఖైదా అమెరికాపై విరుచుకుపడింది. తన వేలుతో తన కన్నే పొడిచినట్టు, పంచభుజిపై అమెరికా ఎయిర్ లైన్స్ విమానాన్నే కూల్చి 189 మంది మరణానికి కారణమైంది. 9/11-నైన్ లెవెన్ తర్వాత సరిగ్గా ఇరవై ఏళ్లకు, అంటే పెంటగాన్ నిర్మాణానికి 80ఏళ్లు నిండి, సహస్రచంద్ర దర్శనం దగ్గర పడుతున్న కాలానికి డ్రాగన్ తో సరిపోల్చుకునే సమయం ఆసన్నమైంది. వెయ్యి పున్నమి వెన్నెలలు చూసిన అమెరికా అమావాస్యలోకి అడుగుగుపెడుతోందా అనే కాల్పనిక ఆసక్తి అంతటా వినిపిస్తోంది.

క్రమేపీ విస్తరిస్తున్న చైనా సైనిక శక్తి గురించి అమెరికాకు బెంగపట్టుకుంది. ఆజానుబాహుడికి మరుగుజ్జుతో పోల్చుకునే స్థితి రావడం, మల్లయోధుడు, రివటను చూసి పరుగులు తీయడం అంటే ఇదే ! ప్రపంచ దేశాల్లో కేవలం సైనిక శక్తితో మాత్రమే చరాచర సృష్టిని శాసించవచ్చని గుర్తించిన అరడజను దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంటుంది.

రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం బ్రిటన్ ఎంతటి సైనిక శక్తినీ, వ్యూహ చతురతను, ఎత్తుగడల నైపుణ్యాన్నీ ప్రదర్శించిందో ఆ కోవలోకి వస్తాయి రష్యా, అమెరికా, చైనా, ఇజ్రాయిల్ దేశాలు. అలాంటి అమెరికాకు బెంగ ఎందుకు పట్టుకుంది? మొన్నటి దాకా డ్రాగన్ తో వాణిజ్య యుద్ధం చేసిన శ్వేతసౌధం హఠాత్తుగా నేల వాలిపోయే లక్షణాలను ఎందుకు కనపరుస్తున్నట్టూ? చైనా అధికారిక సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శక్తి, సామర్థ్యాలను అంచనా వేయాలని పెంటగాన్ ఎందకు భావించింది? ‘Militery and security devlopements involving the people’s republic of china-2020’ నివేదిక ఏం చెపుతోంది? గతేడాది సిడ్నీ రిపోర్ట్ కు తాజా నివేదికకూ తేడా ఏంటి? అమెరికా తన సైనిక శక్తిని పీ.ఎల్.ఏ తో ఎందుకు పోల్చుకుంటోంది? ఇండో-చైనా సరిహద్దు వివాదం విషయంలో చైనా ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది? పూర్తి స్థాయి యుద్ధానికి డ్రాగన్ సిద్ధమవుతోందా? అంతర్జాతీయ రాజనీతి సాంతం ప్రస్తుతం ఈ సందేహాల చుట్టే ప్రదక్షిణలు చేస్తోంది.

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో అమెరికా అధ్యయన కేంద్రం ఏడాది క్రితం అంటే 2019, ఆగస్టులో రూపొందించిన నివేదిక కూడా అమెరికా శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ నివేదికలో ఏముందో చూద్దాం...

చైనా శరవేగంగా తన సైన్యాన్ని ఆధునికీకరించటం గురించి నిపుణులు చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఆ దేశాన్ని ‘ఎదుగుతున్న శక్తి’గా ప్రస్తావిస్తున్నారు.చైనా ఇప్పుడు ఎదుగుతున్న శక్తి కాదు. అది ఎదిగిపోయింది. ఇప్పుడా దేశం అనేక సైనిక రంగాల్లో అనేక రకాలుగా అమెరికాను సవాల్ చేస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా రక్షణ వ్యూహం అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఇండో-పసిఫిక్‌లో అమెరికాకు ఇప్పుడిక సైనిక ఆధిపత్యం క్రమంగా క్షీణిస్తోంది. ఇక్కడ సైనిక ప్రాబల్యం తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగల ఆ దేశ సామర్థ్యం అంతకంతకూ అనిశ్చితమవుతోంది. నిఘా సమచార సేకరణ, ఖండాంతర క్షిపణి రక్షణ, నూతన తరం యుద్ధ విమానాల వంటి కీలక రంగాల్లో అమెరికా సాంకేతికంగా చాలా ముందుంది. అలాగే ఆసియాలో లోతుగా పాతుకున్న మిత్రుల వ్యవస్థ మీద.. యూరప్‌లో నాటో వ్యవస్థ మీద అమెరికా ఆధారపడగలదు.

చైనాకు ఇటువంటి మిత్రుల వ్యవస్థ ఏదీ లేదు. కానీ.. అమెరికాకు గల సాంకేతిక ఆధిక్యతను చైనా వేగంగా తుడిచేస్తోంది. చైనాకు చాలా కీలకమైన ప్రాంతం ఆసియా. విస్తరణ విషయంలో దీనిని తన ఇంటి పరిసరాలుగా పరిగణిస్తుంది.

రెండు కీలకమైన అంశాలు: దృష్టి - సామీప్యత అనే అంశాలు పరిశీలిస్తే.. ఆసియాలో అమెరికాను సవాల్ చేస్తున్న ఒక సూపర్-పవర్‌గా చైనా ఇప్పటికే అవతరించింది. అమెరికా శక్తిసామర్థ్యాలను, యుద్ధపోరాటాలను చైనా అధ్యయనం చేసింది.

అమెరికా సైనిక శక్తికి సంప్రదాయ వనరులుగా ఉన్న వాటిని నిరోధించటానికి.. ముఖ్యంగా అమెరికా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంలో కీలకంగా ఉన్న ఆ దేశ నావికాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధవిమాన వాహక బృందాలను ఎదుర్కోవటానికి సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేస్తోంది.

సైనిక భాషలో చెప్పాలంటే.. ‘‘నీది నీకు ససేమిరా ఇవ్వను. నాది కరాఖండిగా వదులుకోను’’ అనే వైఖరిని అవలంబిస్తోంది. అమెరికా బలగాల సంచారం తన తీరానికి సాధ్యమైనంత దూరంగానే ఆగిపోయేలా చేయటానికి.. అనేక సెన్సర్లు, ఆయుధ వ్యవస్థల మీద చైనా తదేకంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇండో-పసిఫిక్‌లో తన శక్తిని చాటగల అమెరికా సామర్థ్యాన్ని.. చైనా కౌంటర్-ఇంటర్వెన్షన్ వ్యవస్థలు తగ్గించివేశాయి. అమెరికా స్పందించటానికి ముందే.. ఆ దేశం తేరుకునే లోగానే విజయం సాధించటానికి చైనా పరిమిత బలం ఉపయోగించే ముప్పు పెరిగింది. చైనా గత దశాబ్దంలో తన అణ్వాయుధ సంపత్తిని రెట్టింపు చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోందని పెంటగాన్ రూపొందించిన ‘Militery and security devlopements involving the people’s republic of china-2020’ పేరుతో 173 పేజీల నివేదిక వెల్లడించింది.

ఈ నివేదికలో.. అమెరికా వరకూ వెళ్లగలిగేలా రూపొందించిన బాలిస్టిక్‌ క్షిపణులు కూడా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా ఎదగడానికి, 2049 కల్లా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాతో సమానంగా.. లేదా దాన్ని అధిగమించే ఆధిపత్య శక్తిగా ఎదగడానికి చైనా ప్రణాళికలు రూపొందిస్తోందని.. నివేదికలో స్పష్టం చేసింది. అందులో భాగంగానే తన అణ్వాయుధ సంపత్తిని ఆధునికీకరించుకోవడంతో పాటు మరింత పెంచుకుంటోందని తెలిపింది. భూతల, సముద్ర, గగన తల ఆధారిత అణ్వాయుధాల సంఖ్య పెంచుకోబోతుండటంతో వచ్చే దశాబ్దంలో చైనా అణు బలం పెరగనుందని తాజా నివేదిక తేల్చింది.

భారత్‌ను మరింతగా దిగ్బంధం చేసేందుకు చైనా యత్నిస్తోందని కూడా డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ నివేదిక తేటతెల్లం చేసింది. భారతదేశానికి చుట్టూ ఉండే పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్ సహా మొత్తం 12 దేశాలలో అత్యాధునిక వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని చైనా సంకల్పించింది. ఈ దిశలో చర్యలు కూడా చేపట్టిందని పెంటగాన్ తెలిపింది. ప్రత్యేకించి భారత్‌ను అన్ని దిక్కుల నుంచి కట్టడి చేసే విధంగా ఈ 12 దేశాలను ఎంచుకున్నారు. చైనా సైన్యం పిఎల్‌ఎ నుంచి ఈ దేశాల్లోని స్థావరాల ద్వారా కార్యకలాపాలు సాగించేందుకు, వారి ప్రాజెక్టులు చేపట్టేందుకు, సైనిక శక్తిని పెంపొందింపచేసుకునేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని పెంటగాన్ తన నివేదికలో వెల్లడించింది. సరైన వ్యూహాత్మక దూరాలను ఖరారు చేసుకుని నిర్థిష్టంగా కొన్ని దేశాలను ఇరకాటంలోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేసుకొంటోందని తెలిపింది. పాక్, శ్రీలంక, మయన్మార్ కాకుండా తమ కీలక సైనిక లేదా వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటుకు చైనా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేషియా, యుఎఇ, కెన్యా, టాంజానియా, అంగోలా, తజకిస్తాన్‌ల్లో పాగా వేయాలని భావిస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది. సైనిక భద్రతా పరిణామాల పేరిట పెంటగాన్ తమ వార్షిక నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చైనా నౌకాబలగాలు తిష్టవేసుకుని ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు 12 చోట్ల తమ బలమైన స్థావరాలను చైనా ఏర్పాటు చేసుకొంటోందని విశ్లేషించారు. తమ సైనిక బలగాలన్నింటికి ఎప్పటికప్పుడు మద్దతుగా నిలిచే విధంగా అత్యంత భౌగోళిక ప్రాధాన్యత కల ప్రాంతాలను చైనా ఎంచుకుంది. ఇప్పటికే చైనా నమిబియా, వనూవాటూ, సోలోమన్ ఐలాండ్స్ వంటి వాటిని తగు విధంగా ప్రలోభపర్చుకుని తమకు అనుకూలంగా చేసుకుంది. అన్నింటికి మించి చైనా తలపెట్టిన వన్ బెల్ట్ ఒన్ రోడ్ -ఓబీఓఆర్ నిర్మాణం కేవలం ఆ దేశ జాతీయ పునరుజ్జీవ ప్రక్రియలో భాగం కాదనీ, ఇంతకు ముందు చైనాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార వాణిజ్య మార్గాల పునరుద్ధరణ అనుకోరాదని, దీని వెనుక ఆ దేశ బలీయమైన అంతర్జాతీయ విస్తరణ కాంక్ష,అంతకు మించిన ప్రపంచ స్థాయి రవాణా పటిష్టత వంటివి అనేకం ఉన్నాయని తెలిపింది. పలు దేశాలను మచ్చిక చేసుకుంటూ చైనా తలపెట్టిన ఈ వాణిజ్య మార్గం, ఈ అనుసంధాన ప్రక్రియతో పలు ఇతర దేశాలకు నష్టం వాటిల్లుతుందని కూడా నివేదిక స్పష్టం చేసింది. నిజానిజాలేంటో చూద్దాం..

2030నాటికి ఆధునిక సైనిక వ్యవస్థలా మారాలన్నది చైనా పంతం. అనుకుంది సాధిస్తుందా లేదా అన్నది భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై ఆధారపడి ఉందంటారు నిపుణులు. భారత్ తో కయ్యం పెట్టుకుని చైనా ఒంటిరిగా సాధించేదేమీ లేదంటారు. 2023 నాటికి చైనా ఆయుధ సమీకరణ, ఆధునీకీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత నుంచి సూపర్ ఆర్మీగా తయారుకావడానికి పథక రచన చేసినట్టూ నివేదిక పేర్కొంది. ఆసియా అంతా ఒకేసారి దాడిచేసినా తట్టుకొనే శక్తిని సాధించాలన్నది చైనా దీర్ఘకాలిక వ్యూహం. 1990ల నాటి నుంచి చైనా ఆర్మీ పూర్తిగా భూతల సైన్యాన్ని ఆధునీకరించింది. ప్రస్తుతం విదేశాలకు ఆయుధాలు ఎగుమతి చేస్తోంది. రష్యాతో కలసి యుద్ధవిమానాలు, మిస్సైల్ సిస్టమ్స్‌ను తయారుచేస్తోంది. ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. రెండు దశాబ్దాల క్రితం నాటికే చైనా ఆర్ధికంగా సంపద్వంతమైంది. అయితే చైనా ఆర్థిక వృద్ధిపై సైతం అనేక అనుమానాలున్నాయి. చైనా ఆర్థిక వృద్ధి అభూత కల్పన అంటూ కొట్టిపారేసింది జపాన్ టైమ్స్ పత్రిక కథనం. ‘‘ఆర్థిక భ్రమల్లో సైతం సూర్యుడు ఉదయిస్తాడు’’అంటూ వ్యంగాత్మకమైన కథనం రాసింది జపాన్ టైమ్స్ పత్రిక. సైన్యాన్ని ఆధునీకీకరించడానికి, ఆయుధ సంపత్తిని తయారు చేసుకోవడానికి నిధులు భారీగా సమీకరించినట్టూ డాంబికాలు చెపుతోంది. అందుకే innovative technology sector మీద పెట్టుబడి పెట్టిందనీ, సైనికుల సంఖ్యను తగ్గించి… మోడర్న్ మిలటరీ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతోందనే ప్రచారాలు సైతం విస్తృతంగానే ఉన్నాయి.

అమెరికా నుంచి చైనా బాగా నేర్చుకుంది. అగ్రరాజ్యం ఏ దేశంలో సైన్యాన్ని ఉంచినా ఖర్చులన్నీ ఆ దేశం నెత్తిమీద వేస్తుంది. దాని వల్ల ఆధునిక సైన్యాన్ని తయారుచేయడానికి అమెరికాకు అవకాశం దోరికింది. ఇప్పుడు చైనా కూడా ఆ కోవలోనే ఆలోచిస్తోంది. మిత్రదేశాల రక్షణ బాధ్యతను తను తీసుకొని, సైనిక ఖర్చును తగ్గించుకోవాలని అనుకొంటోంది. ఇక్కడే చైనా కొంత దూకుడిగా వ్యవహరించింది. ఎయిర్ ఫోర్స్, నేవీని పక్కనపెట్టి సైన్యంమీదనే ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ రెండింటికి ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు equipment modernization projects, realistic trainingమీద చైనా దృష్టి కేంద్రీకరించింది. ఇదంతా సైన్యాన్ని ప్రొఫెషనల్ , మోడర్న్ వార్‌ఫేర్‌లో సూపర్ ఆర్మీగా తీర్చిదిద్దడానికే అనేది ఓ అంచనా. అమెరికాకున్నంత నిధుల దన్ను చైనాకు లేదు. కాని, ఎంతమంది కావాలంటే అంత సైన్యం, వనరుల మీద నియంత్రణ ఉంది. ఇదే చైనాకున్న గొప్ప అవకాశం. సమస్యంతా అమెరికాలాగా ముఖాముఖి తలపడిన అనుభవం అసలే లేదు. భారత్ కు ఉన్న యుద్ధ అనుభవం కూడా ఆ దేశ సైన్యానికి లేదు. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం 1979లో వియత్నాంతో చేసిన యుద్ధమే చైనా సైన్యానికి చివరి యుద్ధం. ఈ కారణంగానే ఇండో-చైనా యుద్ధం జరిగితే విజయావకాశాలు భారత్ కే ఉంటాయంటారు నిపుణులు. కారణాలు ఏవైనా అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్యం ఓటమి అంచుల్లో, రాజీ సరిహద్దుల్లోకి నెట్టివేయబడటం ప్రపంచ చరిత్రలో అరుదైన పరిణామం. అమెరికా డిఫెన్స్ పొజిషన్ లోకి వెళుతున్న కారణంగానే భారత్ విషయంలో చైనా దూకుడు పెంచిందంటారు నిపుణులు.

కారణాలేవైనా....‘వీరుల వసారా’ అని పిలిచే హాల్ ఆఫ్ హీరోస్ కొలువుదీరిన పెంటగాన్; చైనాను చూసి కుంగిపోవడం కలలో సైతం ఊహించని పరిణామం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి చిన్న దేశాలపైకి వనరుల కాంక్షతో, ఒంటికాలితో లేచిన అమెరికా ప్రమాదకరమైన వైరిని చూసి బిక్కచచ్చిపోవడం ప్రపంచ చరిత్రలో అరుదైన ఘటన. చరిత్ర ఓ కీలక మలుపు తిరిగేందుకు కాలం వేచి చూస్తోంది. ఇండో-చైనా యుద్ధమే ఈ వైరుధ్యానికి పరిష్కారమా? వేచి చూద్దాం....సమయం అందుకు సిద్ధం కమ్మంటే మనమంతా సరిహధ్దుకు పయనమవుదాం..

#RightAngle #SaiKrishna #Pentagon #China