4th జనరేషన్ వార్ ఫేర్ - నినాదాలే ఆయుధాలు

Sep 04, Fri 2020 01:48 AM Right Angle

కలియుగ రాక్షస మూకలకు ఆర్థికంగా సాయం చేస్తూ ఆయా దేశాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న మేధో నియంత జార్జ్ సోరోస్ గురించిన వివరాలు మీకు ఇంతకు ముందు తెలియజేసాను. ఆ అసుర దృక్పథానికి మూలాలను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను.

శతాబ్దం వయసున్న కమ్యూనిజం సుమారు 10 కోట్ల మంది ప్రాణాలు బలిగొంది. లండన్ హైగేట్ స్మశానవాటిక మట్టిలో కలిసిపోయిన కారల్ మార్క్స్ తన రచనల ఖరీదు కోట్లాదిమంది ప్రాణాలని ఊహించాడో లేదో తెలియదు. కానీ, జరిగింది మాత్రం అదే !

తూర్పు యూరప్ పరిణామాలూ, సోవియట్ రష్యా పతనం, ముగిసిన అమెరికా-రష్యా ప్రచ్ఛన్న యుద్ధం, కమ్యూనిజం నుంచి చైనా తిరోగమనం వీటన్నింటి మధ్య కమ్యూనిజం మరణదశలో ఉందా? హననకావ్యం రాసిన కమ్యూనిజం ఆత్మహత్యకు పాల్పడిందా? అంటే కొంతమంది కాదనీ, ఎక్కువ మంది అవుననీ సమాధానం చెపుతారు. ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ముందు ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం పొందిన కొన్ని పద బంధాలు..నినాదాలు.. ఉద్యమాల గురించి ముందుగా తెలుసుకోవాలి.

Religious Intolerance, Hyper-Nationalism, Hindu nationalists, Food Fascism, Dress Fascism, Mob Lynching, Triggering, Racists, Sexists.. ఇటువంటి పదాలు గతంలో మీరెప్పుడైనా విన్నారా..?

Body Positive, Fat Shaming, Slut Shaming, Gay Pride, Black Lives Matter, Jinnah waali Azadi... అనే నినాదాలు గతంలో మీ చెవిన పడ్డాయా..?

Happy to bleed, Me too, LGBT rights... ఇలాంటి ఉద్యమాలు గతంలో మీరు చూసారా..?

రెండు దశాబ్దాలకు పూర్వం ఈ పదాలు, నినాదాలు, ఉద్యమాలు నిజానికి లేవు. కానీ ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ ఎందుకు ప్రచారంలోకి వస్తున్నాయి. వీటికి మూలాలేంటి..? ఇవన్నీ నిజంగా పౌర హక్కుల పోరాటాలేనా..? ఈ స్పాన్సర్డ్ ఉద్యమాల లక్ష్యమేంటి..? జాతీయవాదం అన్న భావనను fascism లా చిత్రీకరించడం వెనక కుట్రలేంటి..? సమాజంలో హక్కుల ఉద్యమాల నెపంతో విచ్చిన్న వాదాన్ని జొప్పిస్తోందెవరు..? ఇలాంటి అంశాల గురించి ఇపుడు చూద్దాం.

పౌరసత్వ చట్ట సవరణ సమయంలో "ది వైర్" పాత్రికేయుదు షార్జిల్ ఇమామ్ ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేద్దాం అని బహిరంగంగా ప్రకటించాడు. విద్యార్థి నాయకుడి ముసుగులోని ఉమర్ ఖలీద్, కన్నయ్య కుమార్, రచయితగా పిలిపించుకునే అరుంధతి రాయ్ సహా కొందరు కుహనావాదులు కాశ్మీర్ వేర్పాటు వాదానికి మద్దతు పలుకుతారు. మరికొందరు... ద్రావిడ ఉద్యమం పేరుతొ ఉత్తర- దక్షిణ భారతాలను వేరు చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కేవలం ఉన్మాదంలోనో, ఉద్రిక్త పరిస్థితి వల్ల కలిగిన ఆవేశంలోనో జరుగుతున్న పరిణామాలు కాదు. ఏళ్ల తరబడి భారత దేశ భౌగోళిక స్వరూపాన్ని మార్చి, సమగ్రతను దెబ్బతీసే కుట్రలకు సంకేతాలు. ఆ పాఠాలు వింటున్నవారు.. దాన్ని అమలు పరుస్తున్న వారే వీరంతా.

ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్, ది వైర్ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్, NDTV ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావిష్ కుమార్, హిందూ ఎడిటర్ N. రామ్, బర్ఖ దత్, అభిసార్ శర్మ, రానా అయూబ్, రెడియో మిర్చీ జాకీ సైమా, నేహా దీక్షిత్, స్వరా భాస్కర్.. ఇలా చాలా మంది కొత్త కొత్త పదాలను.. నినాదాలను.. స్పాన్సర్డ్ ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంటారు. ఈ ఉదాహరణలు ఎందుకంటే.. రాజకీయంగా కమ్యూనిజం చచ్చిపోయింది.. కానీ అనేక రూపాల్లో వామపక్ష ఆలోచనలు భారత అంతర్గత భద్రతను సవాలు చేస్తున్నాయని చెప్పేందుకు ఇవి సాక్ష్యాలు. జిన్నావాలీ ఆజాదీ, హిందుస్థాన్ సే ఆజాదీ, ట్రిగ్గరింగ్.. ట్రిగ్గరింగ్ లాంటి నినాదాలు విన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాలు, ఎల్జీబీటీ హక్కుల సంస్థలు, పింజ్రేతోడ్ లాంటి సంస్థల ప్రమేయం భౌతికంగా మనకు ఢిల్లీ అల్లర్ల సమయంలో కనిపించింది కానీ, సదరు సంస్థలు చేస్తున్న భావజాల యుద్ధం అత్యంత ప్రమాదకరమైంది. "పింజ్రేతోడ్" అనే పేరులోనే వారి ఆలోచన అర్థమవుతుంది. పంజరాన్ని ఛేదిద్దాం అన్నది దాని అర్థం. నిజమైన అర్థం ఏ రకమైన సమగ్రతనూ, పద్ధతినీ ఒప్పుకోవన్నమాట.

ఇవి కేవలం యవ్వన ప్రాయపు కేరింతలు కాదు. ఆకతాయి నినాదాలు అంతకన్నా కాదు. వీటివెనుక దశాబ్దాల కుట్ర ఉంది. నినాదాల మాటున మారణహోమం దాగుంది. ఈ ప్రమాదకరమైన లెఫ్ట్ భావజాలం చాపకింద నీరులా విస్తరిస్తున్న వాస్తవం మన కళ్లముందే కనిపిస్తోంది. విద్వేషం వెనుక వ్యూహం ఉంటుంది. కుట్రల వెనుక ఎత్తుగడ ఉంటుంది అన్న యుద్ధ సూత్రం అక్షరాలా నిజం.

ఇది ఫోర్త్ జనరేషన్ వార్ ఫేర్. నిక్కంగా నాలుగో తరం యుద్ధ రంగం. కమ్యూనిజం ప్రపంచంలో మూడు తరాల యుద్ధం చేసింది. ఈ మూడు తరాల యుద్ధాలూ ప్రత్యక్షంగా చేసినవైతే, ఇప్పుడు జరుగుతున్నది పరోక్ష యుద్ధం. ఉత్పాతం లాంటి సైద్ధాంతిక దాడి.

ఫోర్త్ జనరేషన్ వార్ ఫేర్ లో రెండు ఆయుధాలను ఉపయోగిస్తోంది లెఫ్ట్ వింగ్ స్లాటర్ హౌస్. ఒకటి.. విశ్వవిద్యాలయాలు. రెండు.. ప్రసార మాధ్యమాలు. ఈ రెంటికీ అన్యోన్యమైన బంధం ఉంది. రెంటి మధ్యా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. యూనివర్సిటీలు నూరిపోసిన భావజాలంతో మీడియా సంస్థల్లో చేరి పాత్రికేయ అవతారమెత్తుతారు వామపక్షవాదులు. లెఫ్ట్ లీనింగ్ జర్నలిస్టులను విమర్శిస్తే యూనివర్సిటీలు తీవ్రంగా స్పందిస్తాయి. యూనివర్సిటీల్లో జరిగే అక్రమాలను ప్రభుత్వాలు గుర్తించి చర్యలకు దిగితే.. విశ్వవిద్యాలయాలు నిర్బంధ శిబిరాలంటూ మీడియా ప్రచారాన్ని లంకించుకుంటుంది.. ఇలా సాగుతుంది ప్రయాణం.

విశ్వవిద్యాలయాల్లోకి వామపక్ష భావజాలం ఎలా ప్రవేశించిందో తెలుసుకుంటే.. చాలా ఆసక్తికరమైన చరిత్ర తారసరపడుతుంది. అదేంటో చూద్దాం...

రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత పాశ్చాత్య దేశాలు సాధించిన అభివృద్ధి, సామాజిక శాస్త్రాల ప్రగతి అనిశ్చితిని ఎదుర్కొన్నాయి. అంతవరకూ విశ్వసించిన రాజకీయ, తత్వశాస్త్రాల పరిధిలో కొత్త పరిణామాలు అర్థం చేసుకునేందుక విఫలయత్నం చేశారు తొలితరం సిద్ధాంత కర్తలు. ప్రధానంగా కాంట్, హెగెల్, మార్క్సియన్ తాత్విక, రాజకీయ శాస్త్రాలపై అభిశంసన మొదలైంది. కొత్త పరిస్థితుల నేపథ్యంలో మార్క్సిజం సమగ్రం కాదనే భావన రోజురోజుకూ విశాలమైంది.

ప్రపంచ కార్మికులంతా ఏకమవ్వాలని కాంక్షించిన మార్క్సిస్ట్ మేధావులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఎవరికీ వారు ఆయా దేశాల కోసం పోరాడడంతో.. ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అనంతరం కమ్యూనిస్టు సిద్ధాంతాలపై అవలోకనం ప్రారంభించారు.

దీని పర్యవసానంగా 1923లో జర్మనీ కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ అనే సంస్థని స్థాపించారు. అనంతర కాలంలో ఇదే "ఫ్రాంక్ ఫర్ట్ స్కూల్"గా పరిణామం చెందింది. అల్తుజర్, లూకాచ్ లాంటి సాహిత్యకారులు, ఎరిక్ ఫ్రామ్, మాక్స్ హోకిమెర్, అడార్నో లాంటి వారంతా కలిసి మార్క్సిజానికి సైకాలజీని జోడించే ప్రయత్నాలు చేశారు. అల్తుజర్, లూకాచ్ లాంటి వారు మార్క్సిజం...పునాది-ఉపరితలం, పదార్థం-చైతన్యం. ఆచరణ-సిద్ధాంతం లాంటి యాంత్రిక ద్వయాలకు పరిమితమైందని విమర్శించారు. దీన్నే కల్చరల్ మార్క్సిజమని సూత్రీకరించారు.

జర్మనీలో హిట్లర్ నేతృత్వంలోని నాజీల ప్రభావం పెరగడంతో వీరంతా అమెరికాకు వచ్చి న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీలను తమ కేంద్రంగా మార్చుకున్నారు. దీంతో మార్క్సియన్, ప్రత్యామ్నాయ మార్క్సియన్, సైకో ఎనాలిస్ కమ్ మార్క్సిజం జాడ్యం అమెరికాకు అంటింది. అనంతర కాలంలో ఇది భారత్ కు పాకింది. ది హిందూ ఎడిటర్ ఎన్. రామ్, బర్ఖ దత్ లాంటి చాలా మంది కొలంబియా యూనివర్సిటీ లోనే జర్నలిజం చదివారు. ఈ విశ్వ విద్యాలయాల ప్రభావమే మన దేశంలోని jnu సహా చాలా యూనివర్సిటీలపై ఉంది. జాతి భావనను తిరస్కరించడం, సమగ్రతను ఎగతాళి చేయడం, దేశభక్తిని కించపరచడం .. మొత్తంగా సాంప్రదాయ పద్ధతులు.. ఆచార వ్యవహారాలు అన్నింటినీ విమర్శించడమే ఫ్యాషన్ గా మారింది. ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ నేత, సిద్ధాంత కర్త ఆంటోనియో గ్రాంసీ ప్రతిపాదించిన కల్చరల్ హెజీమనీ, ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ భావనలను పటాటోపంగా ప్రచారం చేయడం లెఫ్ట్ ప్రివిలేజ్ కి ప్రతీకగా మారింది. ఈ విధానానికి వీరు పెట్టిన పేరు... క్రిటికల్ థింకింగ్. ప్రస్తుతం యూనివర్సిటీల్లో కిస్ ఫెస్టివల్స్.. హగ్ ఫెస్టివల్స్ పేరిట జరుగుతున్న వికృత వేడుకలు ఈ క్రిటికల్ థింకింగ్ పర్యవసానాలే. ఈ సూత్రీకరణల మూలంగా మార్క్సిజం కోరుకున్న విశ్వమానవ సౌభ్రాతృత్వమే అబద్ధమని నిరూపితమైంది. మార్క్స్ సైద్ధాంతిక చట్రాన్ని విశ్వసించి, అక్టోబర్ విప్లవానికి నేతృత్వం వహించిన లెనిన్ అంచనాలు నిరూపితం కాలేదనడానికి ఇవే సాక్ష్యం.

మార్క్స్ చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం కన్నా, భవిష్యత్తు గురించి ఆయన చేసిన ఊహే మరింత సందేహాస్పదమైంది. కార్మికవర్గం తనను తాను శ్రమదోపిడీ నుంచి విముక్తం చేసుకుని, పెట్టుబడి ఆధిపత్యాన్ని కూలదోసి సమాజ భవితవ్యాన్ని తానే నిర్ణయిస్తుందనేది స్థూలంగా మార్క్స్ అంచనా. సంపూర్ణ సత్యాలుగా మార్క్స్ భావించిన అనేక విషయాలు సాపేక్షికంగా కూడా వాస్తవరూపం దాల్చలేదు. రెండు ప్రపంచ యద్ధాల సమయంలో ఆయా దేశాల పౌరులుగా తమ జాతీయ భావనను అభివ్యక్తీకరించారు తప్ప విశ్వజనీనమైన లక్ష్యం గురించి ఆలోచించలేదు. జాతిభావన, జాతి సమగ్రత అన్న బలమైన భావనల ముందు ప్రపంచ కార్మికులారా ఏకం కండీ! మార్క్స్-ఏంగెల్స్ ల నినాదం వెలవెలబోయింది.

యాభై ఏళ్ల ఢిల్లీ జే.ఎన్.యూ చరిత్రను పరిశీలించిన వారెవరికైనా వామపక్షాలు విశ్వవిద్యాలయాలను ఎలా భ్రష్టు పట్టించాయో తెలుస్తుంది. 1969, ఏప్రిల్ 22న జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఏర్పడింది. ప్రజాస్వామ్యం, హక్కుల గురించి పదే పదే మాట్లాడే కమ్యూనిస్టులు 1969 నుంచి 1983 వరకూ ఇతర భావజాల బృందాలను అనుమతించలేదు.

1983లో ఏడాదిపాటు వామపక్ష బృందాలు తీవ్రమైన హింసకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణలను వామపక్ష అనుకూల ఆంగ్ల వార పత్రిక ‘‘ఎకానమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’’ రిపోర్ట్ చేసింది. బీబీసీ సైతం జే.ఎన్.యూను నాడు సందర్శించింది. నాటి వైస్ ఛాన్స్ లర్ పీ.ఎన్. శ్రీవాత్సవను వెంటాడి వేధించాయి వామపక్ష విద్యార్థి సంఘాలు. ఝీలం హాస్టల్ వార్డెన్ గా ఉన్న హర్జీత్ సింగ్ నాటి భయానక సంఘటనలను నేటికీ గుర్తు చేసుకుంటారు.

కాంగ్రెస్ పారిపాలన సాగినంత కాలం లౌకికవాదం, ప్రజాస్వామిక విలువలు, భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వామపక్షాలు ఆడిందే ఆటగా సాగింది. విశ్వవిద్యాలయాలు తమ భావజాల కేంద్రాలుగా మార్చుకుని కొత్త కొత్త పదాలు, నినాదాలు సృష్టిస్తూ... స్వేచ్ఛ పేరిట విశృంఖల విధానాలను ప్రచారం చేస్తున్నారు.

గతంలో కమ్యూనిజం కార్మిక హక్కుల కోసం చేసే పోరాటాల్లో కొంతవరకు కనిపించేది.. కానీ, ఇప్పుడది జార్జ్ సోరోస్ లాంటి వారి ప్రయోజనాలకు దాసోహమయింది. అప్పట్లో మార్క్సిజం పేదవారి ఆకలిని కనీసం ప్రస్తావించేది.. కానీ, ఇప్పుడది విశ్వ విద్యాలయాల్లోని విశృంఖలతకు పరిమితమైంది. నాడు కమ్యూనిస్టులు మహిళా హక్కుల కోసం ఎంతో కొంత ప్రశ్నించే వారు.. నేడు కిస్ ఫెస్టివల్స్ మత్తులో పరవశిస్తున్నారు. ఎన్ని ఇజాలు వచ్చినా.. ఎన్ని కుట్రలు చేసినా.. ఈ దేశ సమగ్రతను కాపాడుతూ వస్తున్న నిజం ఒక్కటే.. అదే భారతీయత.

#RightAngle #SaiKrishna #4thGenerationWarFare #SloganWeapons