ఫతే సింగ్ & జోరావర్ సింగ్ వీరుల చరిత్ర

Aug 24, Mon 2020 11:16 PM Bharateeyamనమ్మించి గొంతుకోయడంలో మొగల్ రాజులకు మించినవారుండరు. అందులోనూ పరమ దుర్మార్గుడు…మతోన్మాది ఔరంగజేబు అయితే విశ్వాస ఘాతానికి పరాకాష్ట.! రాజ్యాధికారం కోసం కన్నతండ్రినే చెరసాలలో వేసి చంపాడు. ఇక తన పెద్దన్న షాజహాన్ తర్వాత మొగల్ సింహాసానికి అసలు వారసుడు దారా షికోను అతని కుమారుడిని అత్యంత దారుణంగా చంపించాడు ఔరంగజేబు. అటు ఆనందపూర్ సాహెబ్ ను వదిలి పెట్టే సమయంలో.. గురు దేవుల కుటుంబం రెండుగా విడిపోయింది. ఆయన చిన్న పిల్లలు ఇద్దరు జోరావర్ సింగ్, ఫతే సింగ్ లు నాయనమ్మ గుజరీ మాతతో కలిసి అడవులు, కొండల గుండా సమీపంలోని గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కమ్మా అనే ఓ పేద కార్మికుడు వారికి ఆశ్రయం ఇచ్చాడు. గురు దేవుల పిల్లలు అని తెలిసి వారిని తన ఇంట ఉండమని ప్రార్థించాడు. ఎంతో ప్రేమతో వారికి సేవలు చేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గ్రామానికి గంగూ అనే వంటవాడు వచ్చాడు. ఇతను గురు గోవిందుల వద్ద వంటవాడిగా చాలా ఏళ్లు పనిచేశాడు. గుజారీ మాతను గుర్తించి తన గ్రామానికి రావాల్సిందిగా ప్రార్థించాడు. గుజరి మాతలో ఏదో తెలయని సందిగ్ధం. అనేక ఆలోచనలు. ఈ గంగూ విశ్వాసఘాతుకం చేస్తే…, ఇద్దరు చిన్నారుల ప్రాణాలేమవుతాయనే ఆందోళన.! అయితే ఆందోళన వద్దని…తాను ఎన్నో ఏళ్ల నుంచి మీ ఉప్పు తిన్నానని, ఇలాంటి కష్టసమయంలో మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వండని వేడుకున్నాడు. గురు దేవుల పిల్లలనే విషయం బయటికి పొక్కదని వాగ్దానం చేశాడు. దాంతో గుజరీ మాత పిల్లలతో కలిసి అతడి గ్రామానికి వెళ్ళడానికి సమ్మతించింది. సామానంతా గాడిదపై వేసుకుని అంతా కలసి గంగూ గ్రామానికి ప్రయాణమయ్యారు.

చిన్నారులైన జోరావర్ సింగ్, ఫతే సింగ్ లు తమ నానమ్మ గుజరీ మాత చిటికెన వేళ్లు పట్టుకొని నడిచారు. దారిలో ఆమె వారికి మహావీరుల కథలు వినిపించారు. అలా చీకటి పడే సమయానికి గంగూ ఇంటికి చేరుకున్నారు. అలసట కారణంగా చిన్నారులిద్దరు భోజనం చేయకుండానే నాన్నమ్మకు చెరోవైపు పడుకున్నారు. చిన్నారుల రక్షణ గురించే ఆమె చింత. గుజరీమాతకు రాత్రి నిద్రపట్టలేదు. అయితే కృతఘ్నుడైన గంగూ…వారి బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, నాణెలు కాజేసేందుకు తన ఇంటికి తీసుకువచ్చాడు. గుజరీమాతతోపాటు పిల్లలు పడుకున్నారని భావించి…వారి గదిలో ప్రవేశించి విలువైన వస్తువులను తీసి చప్పుడూ చేయకుండా బయటకు నడిచాడు. గుజరీమాత జరిగిన దొంగతనం గురించి చెప్పింది. తడబడుతూనే రాత్రి దొంగలు ఏమైనా వచ్చారని అడిగాడు. తలుపులు వేసి ఉన్నతర్వాత దొంగలు ఎలా వస్తారు. నన్ను అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా అంటూ మందలించింది గుజరీ మాత.! గట్టిగా అరిస్తే మేము నీ ఇంటిలో ఉన్న విషయం బయటకు తెలిసిపోతుంది. పిల్లల ప్రాణాలకు ప్రమాదమని చెప్పింది.!

దీంతో కోపోద్రిక్తుడైన గంగూ ఆగ్రహంతో ఊగిపోయి తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతని మనస్సులో దుష్ట ఆలోచన ఉంది. గురు పుత్రులను నవాబు సైనికులకు పట్టిఇస్తే తనకు మంచి బహుమానం వస్తుంది. వారి వస్తువులు అన్ని కూడా తనవే అవుతాయని భావించాడు. నేరుగా గ్రామాధికారి వద్దకు వెళ్లి గురుపుత్రలు తన ఇంటిలో ఉన్నవిషయం చెప్పాడు. కొద్ది మంది సైనికులను పంపిస్తే వారిని పట్టి ఇస్తానన్నాడు. వెంటనే తన వద్ద ఉన్న సైనికులతో గరు పుత్రులను , గుజరీమాతను పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించాడు గ్రామాధికారి.

అటు గంగూ వెంట సైనికులు రావడం గుజరీమతకు విషయం అర్థమైంది.! వచ్చిన సైనికులు...గ్రామాధికారి ఆజ్ఞను వినిపించారు.! పిల్లలిద్దరూ, గుజరీమాతతో కలిసి నిర్భయంగా నడవసాగారు. చిన్న పిల్లలను చూసి గ్రామ వాసులు గుసగుసలాడుకోసాగారు. పిల్లల సాహసం, తెగువ, ధైర్యం చూసి పొగడసాగారు. అదే సయంలో కృతఘ్నుడైన గంగూను తిట్టసాగారు. గ్రామాధికారి పిల్లలతోపాటు గుజరీమాతను ఖైదు చేసి సర్ హింద్ నవాబుకు విషయం చేరవేశాడు.

మొగల్ సైనికులు వచ్చి….,వారిని సర్ హింద్ నవాబు వద్దకు వారిని తీసుకెళ్లారు. డిసెంబర్ మాసం కావడంతో చలి బాగాఉంది. వారిని ఒక కోట బురుజులో ఉంచారు. కనీసం భోజనం కూడా పెట్టలేదు. ఆ రాత్రంతా గుజరీమాత, చిన్నారులిద్దరు దైవచింతనలో గడిపారు. పిల్లలకు వీరగాథలు చెప్పింది. కష్టకాలంలో ధర్మం వీడరాదని బోధించింది. పిల్లలు ఎక్కడ తమ ధర్మం నుంచి దురమవుతారనదే ఆమె ఆందోళన.! అయితే ఇద్దరు అన్నదమ్ములు..., తమ తండ్రిగారైన గురు గోవిందుల కీర్తికి మాట రానివ్వమన్నారు. తమ స్వధర్మం వదలి పెట్టమని గత నానమ్మకు మాట ఇచ్చారు.!

తెల్లవారగానే మొగల్ సైనికులు వచ్చారు. నిర్భయులైన సోదరులిద్దరు లేచినిలబడ్డారు. నాయనమ్మ పాదాలకు నమస్కరించారు. విజయం కలుగుగాక అని ఆమె వారిని ఆశీర్వదించింది. సోదరులిద్దరు... తలెత్తుకుని ధైర్యంగా నవాబు వజీర్ ఖాన్ దర్బారులోకి ప్రవేశించారు. వాహే గురుజీకి ఖాల్సా! వాహే గురూజీకి ఫతేహ్! అంటూ నినాదాలు చేశారు. అంతే దర్బార్ లో ఒక్కసారిగా నిశబ్దం అవరించింది. దర్బారులోని జనం అంతా ఆ వీర బాలాలవైపు చూశారు. తలపాగా, నడుముకు చిన్న ఖడ్గాలు, సుందర దేహం, పాలుగారే బుగ్గలను చూసి..., క్రూరుడైన నవాబు వారితో ఇలా అన్నాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. నేను నవాబు పిల్లల మాదిరిగా..., మిమ్ములను చూసుకుంటాను. మీ ధర్మం వదిలి పెట్టి ఇస్లామ్ మతంను స్వీకరించి ముస్లింలుగా మారండి. నేను...కోరినట్లు చేస్తే..., మీకు ఇంకా ఎన్నో బహుమతులు కూడా ఇస్తానని ఆశలు పెట్టాడు.

అయితే అన్నదమ్ములిద్దరూ..., ఒక్కమారుగా..., మాకు మా ధర్మం...., ప్రాణం కంటే ప్రియమైనది.! మా చివరి శ్వాస వరకూ మేము మా ధర్మాన్ని వదలిపెట్టేది లేదని తెగేసి చెప్పారు. దాంతో నవాబులో కోపం పెరిగిపోయింది. పిల్లలకు ఏం శిక్ష విధించాలంటూ ఖాజీని సలహా అడిగాడు.! పిల్లలు నిర్దోషులు. ఇస్లామ్ ప్రకారం వీళ్ళకు శిక్ష విధించరాదని చెప్పాడు ఖాజీ.! వీళ్ళ తండ్రి తప్పు చేశాడని నవాబు అన్నాడు.! అయినా సరే ఇస్లామ్ ప్రకారం…తండ్రికి విధించాల్సిన శిక్షను పిల్లలకు విధించరాని స్పష్టం చేశాడు ఖాజీ.!

అటు ఖాజీ కూడా పిల్లలను మరోసారి బుజ్జగించేందుకు ప్రయత్నించాడు.! తమ జీవితాలను నాశనం చేసుకొవద్దని, ఇస్లాంను అంగీకరించండి. సంతోషంగా తమ జీవితాన్ని గడపండన్నాడు ఖాజీ.! గురు దేవుల పిల్లలిద్దరు పెద్ద గొంతుతో…, మేం గురు గోవింద్ సింగ్ దేవుల పుత్రులం.! మాతాత గురు తేగ్ బహదూర్ దేవులు… మొగలుల నుంచి హిందూ ధర్మాన్ని రక్షించడానికి బలిదానం చేశారు.! మేము అలాంటి వీరుల సంతానం.! మా ధర్మాన్ని..., మేము ఎప్పటికీ వదులుకోము ! మా ధర్మం మాకు ప్రాణాలకంటే ప్రియమైనదన్నారు.

ఆ సమయంలో నవాబు కొలువులో హిందువైన సచ్చానందుడు అనే ఒకతను మంత్రిగా ఉన్నాడు. మిమ్ములను వదిలి పెడతే ఏం చేస్తారని ప్రశ్నించాడు. అందుకు బాలురైన జోరావర్ సింగ్, ఫతే సింగ్..., మీ అత్యాచారాలను ఆపేందుకు సైనికులను సమకూర్చుంటాం.! మీతో యుద్ధం చేస్తామన్నారు.! ఒక వేళ మీరు ఓడిపోతే అంటూ మంత్రి ప్రశ్నించగా…., ఓటమి అనేది మా జీవితంలో లేదని…, చనిపోయేవరకు యుద్ధం చేస్తూనే ఉంటామన్నారు చిన్నారులిద్దరు !

అటు నవాబు కలగజేసుకుని పిల్లల మనోధైర్యం పోగొట్టడానికి ఇలా అన్నాడు మీ నాన్నగారు. మీ ఇద్దరు సోదరులు యుద్ధంలో మరణించారని చెప్పాడు. ఇక ఈ ప్రపంచంలో మీకు ఎవరు లేరని.., మీరు ఇస్లామ్ మతాన్ని స్వీకరించండి…, ముస్లింలుగా మారిపోండని… మరోమారు అన్నాడు.! అయితే చిన్నారులు నవాబు మాటలను కొట్టిపారేశారు. మా తండ్రిగారు మహావీరుడు. ఆయనను ఎవరు చంపలేరన్నారు. నవాబుకు మరింత కోపం పెరిగింది. ఈ పిల్లలు విద్రోహానికి సిద్ధపడుతున్నారని ఖాజీకి చెప్పాడు. అంతే మొగల్ సామ్రాజ్యానికి శత్రువులైన వీరిని సజీవ సమాధి చేయాలని ఆజ్ఞాపిస్తున్నామని చెప్పాడు.

శిక్ష అమలు బాధ్యతను మలేర్ కోట్లా నవాబుకు అప్పగించారు. అయితే ఆయన అందుకు నిరాకరించాడు. సాయంత్రం వేళ పిల్లలనూ నాన్నమ్మ దగ్గరికి పంపారు. దర్బారులో తాము ఎలా నవాబును ఎదిరించింది చెప్పారు. బాలలిద్దరి ధైర్యానికి నాన్నమ్మ సంతోషించింది. మీరు మీ నాన్న గౌరవాన్ని నిలబెట్టారంది. మరుసటి రోజు పిల్లలను మళ్లీ దర్బారుకు తీసుకెళ్లారు. శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఇస్లామ్ స్వీకరించాలని లేదంటే సజీవ సమాధి చేస్తామని మరోసారి చెప్పాడు నవాబ్ వజీర్ ఖాన్.! పిల్లలిద్దరు మరోసారి తాము ధర్మం మారేది లేదని మరింత దృడంగా తేల్చిచెప్పారు.

మొగల్ దర్బారులో ప్రముఖ తాపీ మేస్త్రీలైన షిపాల్ బేగ్, విశాల్ బేగ్ లకు చిన్నారులను సజీవ సమాధి చేసే పనులు అప్పగించాడు నవాబు.! ఈ వార్త నగరం అంతటా వ్యాపించింది. వీర బాలలను చూసేందుకు నగరంలోని ప్రజలు అందరూ తరలివచ్చారు. గంగూను, నవాబును ప్రజలందరూ తిట్టసాగారు.! సమాధి చేసేందుకు నిర్ణయించిన స్థలం వద్దకు వారిద్దరిని తీసుకువచ్చారు. వారిని నిలబెట్టి…, చుట్టు గొడకట్టం ప్రారంభించారు మేస్త్రీలు.! అటు ఖాజీ…., మరోసారి పిల్లలను ఇస్లాం స్వీకరించమని కోరాడు. తమ ప్రాణాలు పోతున్న.., ఇద్దరు చిన్నారులు మాత్రం…, మళ్లీ ధైర్యంగా మేం ఇస్లాం స్వీకరించేది లేదని…, ఈ ప్రపంచంలో ఏ శక్తి మా పవిత్ర ధర్మం నుంచి మమ్మల్ని దూరం చేయలేదన్నారు.! గోడ నిర్మిస్తున్న మేస్త్రీలు కూడా ఇస్లాం స్వీకరించి ప్రాణాలు కాపాడుకోండని పిల్లలిద్దరికి సలహా ఇచ్చారు. ఇటు గోడ కట్టే పని కూడా వేగంగా జరుగుతోంది.! మరోవైపు పిల్లలను సజీవ సమాధి చేయవద్దు అంటూ నగర ప్రజలు రోధిస్తున్నారు. వారి చుట్టూ గోడకట్టడం… చేవుల వరకు వచ్చింది. జోరావర్ సింగ్ చివరిసారిగా…, తన తమ్ముడైన ఫతేసింగ్ వైపు చూడసాగాడు. జోరావర్ కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. ఫతేసింగ్… తన అన్నకళ్ళలో నుంచి వస్తున్న…, ఆ నీళ్ళేమిటి.? బలిదానం చేయడానికి భయపడుతున్నావా ? అని అన్నాడు.

అయితే పెద్దవాడైన జోరావర్ సింగ్ కు ఆ మాటలు గుచ్చుకున్నాయి.! అయినప్పటికీ ముఖంలో నవ్వు తెచ్చుకుని.., లేదు తమ్ముడు..! నేను చావుకు భయపడటం లేదు. అది మొదట నీవైపునకు వస్తోంది. నువ్వు నాకంటే ఈ ప్రపంచంలోకి వెనుక వచ్చావు. కానీ నాకంటే ముందు…, నీకు బలిదానం చేసే అవకాశం లభిస్తోందని.., అదే నా దుఃఖానికి కారణం అన్నాడు జోరావర్ సింగ్.! గోడ మరింత వేగంగా పూర్తవుతోంది. ఎత్తుకూడా పెరిగింది. మరోవైపు సూర్యాస్తమయం అయ్యే సమయం కూడా దగ్గరపడుతుండటంతో మేస్త్రీలు కూడా వేగంగా పనిచేస్తున్నారు. పిల్లలిద్దరు కళ్లుమూసుకుని తమ ఆరాధ్య దైవాలను స్మరిస్తున్నారు. అక్కడ గుమికూడిన జనం పిల్లల ధైర్యం, వారి ధర్మనిష్టను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చివరికి అన్ని వైపు గోడ… ఆ మహావీరులైన బాలురను కప్పేసింది. కొన్ని గంటల తర్వాత తిరిగి సజీవ సమాధి గోడను కూల్చేశారు మొగల్ సైనికులు.! అప్పటికే బాలురిద్దరూ స్పృహతప్పి పడి ఉన్నారు. ప్రపంచ చరిత్రలో చిన్నపిల్లలను ఈ విధంగా నిర్దయగా హత్య చేసిన సంఘటన మరొకటి లేదు. అలాగే ఈ వీర బాలురు చూపిన అపూర్వ సాహసం… ప్రపంచంలోని మరే దేశచరిత్రలో కూడా మనకు కనబడదు.!

గుజరీ మాతను కూడా ఖైదుచేసి హత్య చేసింది మొగల్ సైన్యం.! తోడర్ మల్ అనే ఒక వ్యాపారి... చిన్నారుల ఈ దారుణ హత్యను చూసి చలించిపోయాడు.! వారి ప్రాణాలు కాపాడలేకపోయినందుకు ఎంతగానో బాధపడ్డాడు.! దుఃఖంతో నవాబ్ వజీర్ ఖాన్ వద్దకు వెళ్లాడు. పిల్లల దహన సంస్కారాల కోసం అనుమతిని కోరాడు. దహన సంస్కారాల కోసం అవసరమైన భూమి కి ధర చెల్లించాలని కోరాడు నవాబు..! భూమి తాలుకు బంగారు నాణెలు చెల్లించి జోరావర్, ఫతేసింగుల దహన సంస్కారాలు పూర్తి చేశాడు తోడర్ మల్.!

మరణించే సమాయానికి పెద్దవాడైన జోరావర్ సింగ్ వయస్సు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే. ఫతేసింగ్ వయస్సు కేవలం అయిదు సంవత్సరాలే. ఆ సమయానికి గురు గోవింద్ సింగ్ దేవ్ ల కుటుంబంలో ఆయన ఒక్కరే మిగిలారు. గురు గోవిందుల కుటుంబం మొత్తం..., దేశం కోసం ప్రాణాలర్పించింది.! పెద్దకొడుకులు ఇద్దరూ కూడా ఆయన కళ్ళ ముందే చమ్ కౌర్ యుద్ధంలో వీరమరణం పొందారు. మాజీవాడేలోని ఒక చెట్టుకింద కూర్చొన్నప్పుడు తన చిన్నకుమారుల మరణవార్తను విన్నారు గురుదేవులు.

ధర్మరక్షణ కోసం బాలిదానం చేయడంలో..., చిన్నారులైన జోరావర్ సింగ్, ఫతే సింగ్ లు పోటీపడ్డారు. నవ్వుతూ నవ్వుతూ తమ చుట్టూ పేర్చిన గోడలో తమ ప్రాణాలు అర్పించారు.! ఈ గురుపత్రులు అమర చరిత్రను తెలుగు ప్రజలు అందరూ తెలుకోవాలి. వారిని నిత్యం స్మరించుకోవాలి.