భూకంపాలకు దీటుగా... వెయ్యేళ్లు నిలబడేలా..

Aug 24, Mon 2020 03:51 AM Bharateeyam


-- వడివడిగా భవ్య రామమందిర నిర్మాణం
-- అయోధ్యలో సాగుతున్న నిర్మాణ పనులు
-- ఇనుము లేకుండా ఆలయ నిర్మాణం

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. చారిత్రకంగా ఎప్పటికీ నిలిచేలా అత్యంత శ్రద్ధ తో వేగవంతంగా ప్రక్రియ కొనసాగుతోంది. అంతే కాదు భూకంపాలను తట్టుకునేలా, నిర్మాణంలో అసలు ఇనుము అనేది వాడకుండా అత్యధ్భుతంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి ఐఐటీ మద్రాస్ సెంట్రల్, బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కి చెందిన నిపుణులు సాంకేతిక సలహాలు ఇస్తున్నారు. కనీసం 1000 సంవత్సరాలు ఉండేలా అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని నిర్మించనున్న సదరు ప్రాంతం నుంచి సేకరించిన మట్టి శ్యాంపుల్స్‌ను ఐఐటీ మద్రాస్‌కు పంపినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 36-40 మాసాల్లో రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ట్రస్ట్ అధికారులు...ఆలయ నిర్మాణ పనులకు సంబందించి తాజా సమాచారాన్ని వెల్లడించారు. రామాలయ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పట్టణం, గ్రామం నుంచి రాగి తీగలు, చువ్వల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దీన్ని రామాలయ నిర్మాణంలో వినియోగిస్తామని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను రామాలయ నిర్మాణంలో భాగస్వాములు చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కంచుతో నిర్మిస్తే ఆలయానికి 1000 ఏళ్లు ఉంటుందని చంపత్ రాయ్ వివరించారు. రామాలయం కొన్ని శతాబ్ధాల పాటు సురక్షితంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ పునాదుల నిర్మాణంలో ఇనుమును వినియోగించబోమని స్పష్టంచేశారు. రామాలయ నిర్మాణాన్ని కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ చేపట్టనుండడం తెలిసిందే.

#ayodhya #mandir #construction