ఇప్పుడు లఢక్ నెక్స్ట్ కశ్మీర్: ఇదే డ్రాగన్ టార్గెట్

Aug 03, Mon 2020 03:57 AM Right Angle

భారత్-చైనా సరిహద్దు వివాదం జూన్ 15 నుంచి కొనసాగుతూనే ఉంది. ఒక వైపు దౌత్య చర్చలు, మరోవైపు ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయి చర్చలు కొనసాగుతుంటే మరోవైపు బలగాల మోహరింపు ఉధృతంగా సాగుతోంది. భారత్-చైనా సరిహద్దు నుంచి దక్షిణ చైనా సముద్రం వరకూ డ్రాగన్ ను దిగ్బంధం చేసేందుకు భారత్ కు దన్నుగా ఉన్న ప్రపంచ దేశాలు భారీ వ్యూహానికి పదును పెడుతున్నాయి. యుద్ధం వస్తుందా? రాదా? అనే ప్రశ్న అత్యంత సులువైంది. దానికి వచ్చే జవాబు అతి కష్టమైందీ, తీవ్రమైంది కూడా. చైనా కేవలం లఢక్ లోకి సరిహద్దును మాత్రమే దురాక్రమించి ఊరుకోదు. చైనా, పాక్ ఎకానమిక్ కారిడార్ పూర్తైన తర్వాత పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని దిగమింగి భారత్ పై భారీ యుద్ధానికి దిగే ప్రమాదముందని ‘‘యూరో ఏషియన్ టైమ్స్’’ ఆసక్తికరమైన కథనాన్ని వెలువరించింది. After Ladakh, Andamans Could Be Next Big Flashpoint Between India & China లఢక్, కశ్మీర్ ఆక్రమించుకున్నతర్వాత ఉద్రిక్త యుద్ధరంగాన్ని అండమాన్ కు షిఫ్ట్ చేస్తుందంటూ పేర్కొంది. అక్కడితో ఆగలేదు.... CPEC Project A ‘Trillion-Dollar Blunder’, Pakistan Calls It ‘Outstanding Initiative’ అంటూ థ్రిల్లింగ్ ఫ్యాక్ట్ ను ప్రపంచముందుంచింది. ఇంతకూ సీపీఈసీ పూర్తవుతే పాక్ ఎందుకు చైనా స్వాధీనంలోకి వెళుతుంది? లఢక్ తర్వాత నిజంగానే చైనా టార్గెట్ కశ్మీరా? అండమాన్ యుద్ధ ఉద్రిక్తతకు డ్రాగన్ గీస్తున్న ప్లాన్ ఏంటి? ఈ మూడు ఆసక్తికరమైన, అవసరమైన అంశాలను మూడు ఎపిసోడ్ లుగా విభజిస్తే.....మొదటి ఎపిసోడ్ లో లఢక్ తర్వాత నిజంగానే చైనా టార్గెట్ కశ్మీరా? పరిమితమవుదాం. రెండో ఎపిసోడ్ లో అండమాన్ యుద్ధ ఉద్రిక్తతకు డ్రాగన్ గీస్తున్న ప్లాన్ ఏంటి? మూడో ఎపిసోడ్ లో ‘‘సీపీఈసీ పూర్తవుతే పాక్ ఎందుకు చైనా స్వాధీనంలోకి వెళుతుంది?’’ అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా.... ‘‘లఢక్ తర్వాత నిజంగానే చైనా టార్గెట్ కశ్మీరా?’’ అనే అంశాన్ని చూద్దాం.... భారతదేశమంతటా ఇండో-చైనా యుద్ధ పరిణామం ఆగంతుకంగా వచ్చిపడిన ఆసక్తిగా పరిణమించింది. ముఖ్యంగా కశ్మీరీలు లఢక్ సరిహద్దు దురాక్రమణను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. అటు జమ్మూలోనూ, కశ్మీర్ లోయలోను సరిహద్దు ప్రతిష్ఠంభనను చాలా అహ్లాదంగా చూస్తున్నారు. వివాదం యుద్ధానికి దారితీయాలనీ కోరుకుంటున్నారట. అయితే ఇందులో జమ్మూవాసుల ఉద్దేశాలు, లోయలోని కశ్మిరీ ముస్లీంల ఉద్దేశాలు వేర్వేరు గమనించాలి. జమ్మూ వాసులకు యుద్ధంలో భారత్ గెలిస్తే భవిష్యత్ ప్రమాదాలకు అంతిమగీతం పాడినట్టవుతుంది. చర్చలు ఫలిస్తే కనీసం ఉద్రిక్తతలు లేకుండా పోతాయన్నది జమ్మూవాసుల ఆశ. కశ్మిరీల ముస్లీంలకు యుద్ధంలో భారత్ కు దెబ్బ తగలాలనే ఉబలాటం ఉందంటారు పరిశీలకులు. సోషల్ మీడియాలో చైనాను భారత్ నియంత్రించలేకపోయిందంటూ ఎగతాళి చేసే చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు. మొత్తం భారతదేశం చైనాను ఏ స్థాయిలో వ్యతిరేకిస్తుందో కేవలం ఒక్క కశ్మీర్ భారత్ ను ఆ స్థాయిలో వ్యతిరేకిస్తోంది. జిన్ పింగ్ కు కశ్మీరీ సంప్రదాయ గుడ్డలు తొడిగి ...కశ్మీరీ స్పెషల్ మీల్ ‘‘వాజ్వాన్’’ పెట్టించి మరీ సరిహద్దు ఉద్రిక్త ప్రాంతమైన లఢక్ కు పంపుతున్న ఇమేజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లఢక్ ను చైనా ఆక్రమించడం ఖాయమని కశ్మీరీలు రోజువారీ పిచ్చాపాటీల్లో ఖరారుగానే మాట్లాడుతున్నారట. జూన్ 21న శ్రీనగర్ తోపాటు, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో బాహటంగానే ‘‘చీన్ ఆయా...చీన్ ఆయా’’- చైనా వచ్చేస్తోంది...చైనా వచ్చేస్తోంది అంటూ నినాదాలు చేశారు. కేంద్రం 370 అధికరణాన్ని రద్దు చేసి...జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక అర్థంలేని ఆగ్రహంలో ప్రాణాలు పోగొట్టుకుంటోంది కశ్మిరీ ముస్లీం యువత. భవిష్యత్ దృష్టి లేని ఆగ్రహమే చైనాపై ప్రేమను పెంచుతోంది. చైనీయుల అధీనంలోకి వెళితే కశ్మీర్ లోయవాసుల పరిస్థితి ఎలా ఉంటుందో వారు ఊహిస్తే బావుండేది. మనుషుల్ని చదును చేసి చెట్లను పెంచేరకం చైనా అని వారికి తెలియపోవచ్చు. ఏమైనా తాత్కాలిక ఉపశమనాల ముందు దీర్ఘకాలిక ప్రయోజనాలు కొన్ని సార్లు అశక్తంగా కనిపిస్తాయి. ఇవన్నీ సాధారణీకరించిన వాస్తవాలు కాకపోవచ్చు, ఆసక్తి కలిగించే వార్తలు. కించిత్ బాధ కలిగించే పరిణామాలు. 370 అధికరణం రద్దు తర్వాత కశ్మీర్ లో ఉగ్రవాదం చెలరేగిపోవడానికి, భారీ ఎత్తున భారత బలగాలపై దాడులకు పాల్పడటం వెనుక చైనా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సైన్యం సేకరించి గతంలోనే కేంద్రానికి పంపింది. 2019 ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత సైన్యానికీ, ఉగ్రవాదులకు జరిగిన అనేక కాల్పుల సంఘటనల్లో, తనిఖీల్లో చైనా తయారీ ఆయుధాలైన QBZ-191 అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, CS/LR17- సపోర్ట్ వెపన్, అసాల్ట్ రైఫిల్, CS/LR14 బ్యాటిల్ రైఫిల్, QBZ-95 బల్పప్ రైఫిళ్లు, ఏకే-47, ఏకే-56 రైఫిళ్లు, చైనా తయారీ గ్రెనెడ్లూ.....వివిధ సందర్భాల్లో భారత సైన్యం వశమయ్యాయి. చైనా తయారీ ఆయుధాల కారణంగానే భారత సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారని 2017, సెప్టెంబర్ 26న యూఎస్ సెక్రటరీ జనరల్ జేమ్స్ మత్తీస్ తో జరిగిన ఆఫ్ఘన్-పాక్-ఇరాన్ దేశాలు ఉగ్రవాదంపై చర్చించిన సమయంలో కేంద్రం చైనా ఆయుధాల అంశాన్ని ఎజెండాగా చేర్చింది. భారత ప్రభుత్వం కశ్మీర్ లో డొమిసైల్ చట్టం తీసుకువచ్చి 25వేల మందికి కశ్మిరేతరులకు స్థానికత పత్రాలు ఇవ్వడం చైనాకు మరింత రుచించలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్ ను కట్టడి చేయడం అసాధ్యమని భావించి లఢక్ వివాదాన్ని ముందుకు తెచ్చింది. grab first and negotiate...అనే విధానాన్ని అవలంబిస్తూ దురాక్రమణకు యత్నించింది. ముందుకు దూసుకువస్తున్న చైనాను కశ్మీరీలు తమ రక్షకుడిగా ఎందుకు భావిస్తున్నారో చూద్దాం... భారత్-చైనా యుద్ధం వస్తే కశ్మీరీల సమస్య పరిష్కారమవుతుందనే అమాయకమైన భ్రమ కశ్మీరీల్లో ఉంది. భారత్-చైనా యుద్ధానికి కశ్మీర్ అంశానికి ఏం సంబంధమో కనీస ఇంగితంతో ఆలోచించినా తెలుస్తుంది. పాకిస్థాన్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, సైనికంగా శక్తివంతమైన దేశం కాదు కాబట్టి, చైనా ఆక్రమించుకుంటే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటూ మరో విషపూరితమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడో సీనియర్ జర్నలిస్ట్. దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు మైఖెల్ కుగెల్ మన్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ ఇన్ వాషింగ్టన్ ఎక్స్ పర్ట్ ఉడ్రో విల్సన్ లు సైతం కశ్మీర్ లో పెరుగుతున్న చైనా అభిమానం ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. చైనా పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ పూర్తయితే పాకిస్థాన్ పూర్తిగా అప్పులపాలై చైనాకు తన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతుంది. దీంతో క్రమంగా ఒకవైపు లఢాక్ నుంచి మరోవైపు పీఓకే నుంచి కశ్మీర్ లోకి చొరబడాలని చైనా భారీ పన్నాగానికి తెరలేపిందంటారు కుగెల్ మెన్, ఉడ్రో విల్సన్. ఈ మొత్తం భారీ కుట్రలో భాగంగాగానే కరోనా రక్కసిని ప్రపంచంపైకి వదిలిందా అన్న వాదనలూ ఉన్నాయి. సీపీఈసీ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 80 బిలియన్ డాలర్లు అయితే ఇందులో పాక్ తన జాతీయ అప్పుగా చెల్లించాల్సింది 90శాతం అన్నమాట. పాక్ వేల కోట్ల అప్పు చెల్లించే స్థాయిలో లేదనేది అందిరికీ తెలిసిందే. ఎఫ్ఏటీఎఫ్ లో ఈ మధ్యే జరిగిన అవమానం తర్వాత అంతర్జాతీయ బ్యాంకులు పాకిస్థాన్ కు అప్పులు ఇవ్వడం దాదాపుగా మానేశాయి. మరో కీలక అంశం ఏంటంటే.....సీపీఈసీ ప్రాజెక్ట్ నిబంధనల్లో చైనా ముందుగానే అప్పుతీసుకుంటున్న దేశాలను హెచ్చరించింది... ఒక వేళ గడువు లోగా రుణాలు తీర్చకుంటే ప్రాజెక్టులు ఏ అవసరం వాడుకోవాలన్న నిర్ణయం పూర్తిగా తమదే అని తేల్చి చెప్పింది. అంటే రుణాభారంతో అల్లాడుతున్న దేశాలు ఎట్లాగూ చెల్లించవు కాబట్టి తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులను రాబోయే రోజుల్లో యుద్ధ అవసరాలకు వినియోగించుకోవచ్చన్నది చైనా కుతంత్రం.