డ్రాగన్ మృత్యు కౌగిలిలో చైనా ముస్లింలు

Aug 03, Mon 2020 03:52 AM Right Angle

భూగోళం భయంతో బిక్కుబిక్కుమంటోంది. ఆర్థిక విపత్తు ఒకవైపు, వైరస్ మరోవైపు ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తున్నాయి. ఇంతటి ఘోరకలికి కారణమైన రక్త పిపాసి చైనా మాత్రం తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాకిస్థాన్ ను చంకనెత్తుకుని నీతి సూత్రాలు వల్లిస్తోంది. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వాపోతోంది. చైనాలో లక్షలాది మంది ముస్లీంలను కాన్సన్ ట్రేషన్ లో క్యాంపుల్లో బంధిస్తున్న దారుణం పాకిస్థాన్ కు తలకెక్కదు. భారత్-చైనా సరిహద్దు వివాదం సమయంలో....కశ్మీర్ లోయలో వేర్పాటువాద మూకలు చైనా వచ్చేస్తోందని పండగ చేసుకున్నాయి. లోయ మొత్తం చైనాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి. కశ్మీర్ ముస్లీం నేతలకు చైనా ముస్లీంల గోడు పట్టదు. ఆసియాలో భారీ కల్లోలానికి కుట్ర పన్నుతున్న చైనా స్వదేశంలో మనుషులను ఎట్లా మాయం చేస్తుందో, హింసకు గురి చేస్తుందో.....ఇటీవల బయటపడిన 4 వందల పేజీల చైనా కమ్యూనిస్ట పార్టీ రహస్య పత్రాలు, అనేక ప్రపంచ స్థాయి సంస్థల పరిశోధనలూ బట్టబయలు చేశాయి. పసి పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరం చేసి, పది వేల ఓల్టులున్న విద్యుత్ కంచెలు అమర్చిన నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది. సుమారు 20 లక్షల మంది వీగర్ ముస్లీంలను నిర్బంధించడంతో పాటు 5 లక్షల పసి పిల్లల్ని డిటెన్షన్ క్యాంపులకు తరలించింది. ఇంతకూ చైనా వీగర్, టర్కీ ముస్లీంలను ఎందురు నిర్బంధిస్తోంది? వారి సాంస్కృతిక జీవితాన్ని సమూలంగా ఎందుకు మార్చాలనుకుంటోంది? చైనా కుట్రల విషయంలో బ్రిటన్ ఏమంటోంది? చైనా రీసెర్చ్‌ స్కాలర్‌ అడ్రియాన్‌ జెంజ్‌ చేసిన ఈ పరిశోధనలో బైటపడ్డ నిజాలేంటి? సీపీసీ రహస్య పత్రాల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.... చైనాలో లక్షలాది మంది వీగర్ ముస్లింలను నిర్బంధించడంపై బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమ చైనాలోని షిన్‌జాంగ్‌ ప్రాంతంలో భారీ నిర్బంధ కేంద్రాలను నిర్మించి అందులో వీగర్ ముస్లింలను బంధిస్తున్నారని చైనా కమ్యూనిస్టు పత్రాల్లో బహిర్గతమైంది. సీపీసీ పత్రాల్లో....విద్యార్థుల నిర్బంధంపై అనేక సూచనలు చేసింది. తల్లి, దండ్రులను, నిర్బంధ కేంద్రాల్లోని విద్యార్థులను కలిసేందుకు అనుమతించరాదని తాఖీదులు జారీ చేసింది. షిన్‌జాంగ్‌లోని ముస్లింలకు పొడవాటి గడ్డాలు కనిపించవు. అలా గడ్డం పెంచుకోవడం ఇప్పుడు అక్కడ నిషిద్ధం. అక్కడి మసీదులు ప్రార్థనలు లేకుండా మూగబోయాయి. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ నోరు మెదిపే సాహసం చేయరు. ప్రజలపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉండటమే దానికి కారణం. ఇస్లాంకు చెందిన ఒక్క సూక్తిని చదివినా చైనాలో నిర్బంధ శిబిరాలకు తరలిస్తారు. కమ్యూనిస్టు పార్టీ పాటలు పాడాలంటూ చిత్ర హింసలు పెట్టే బ్యాచీలుంటాయి నిర్బంధ కేంద్రాల్లో. కొంతమంది వీగర్ ముస్లీంలు... 2015లో చైనా శిబిరాల నుంచి తప్పించుకుని టర్కీకి వెళ్లారు. ఆ తరువాత ఈ నిర్బంధ శిబిరాల నుంచి మరెవ్వరూ విడుదలైనట్టు సమాచారం లేదు. కాన్సన్ ట్రేషన్ క్యాంపుల్లో ప్రతిరోజూ ఉండే పరిస్థితులు, మత విశ్వాసాల్ని మార్చేందుకు చేసే ప్రయత్నాలు, వీటి వల్ల వస్తోన్న ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ చర్యలు చైనా కమ్యూనిస్ట్ పార్టీపై అసహ్యాన్నీ, ఆగ్రహాన్నీ కలిగిస్తాయి. షిన్‌జాంగ్‌‌లో దాదాపు పది వేల మందిని బంధించారని భావిస్తున్న ఒక క్యాంప్‌ ను చైనా రీసెర్చ్‌ స్కాలర్‌ అడ్రియాన్‌ జెంజ్‌ సందర్శించే ప్రయత్నం చేశారు . కానీ ప్రతి చోటా అవరోధాలూ, అడ్డంకులే. క్యాంప్‌కు చేరుకోవడానికి అన్ని దారులు మూసేశారు. ఆ క్యాంపు చుట్టూ నిఘా టవర్లు ఉన్నాయి. ప్రపంచంలో వీగర్ ముస్లిం జాతిని పూర్తిగా నిర్మూలించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఒక సంస్కృతి, ఒక మతం, ఒక సముదాయం మొత్తంగానే ఈ సంక్షోభంలో చిక్కుకుపోయారు. వీగర్‌ తెగ ముస్లిం జనాభాను గణనీయంగా తగ్గించేందుకు చైన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోని ఆ మతానికి చెందిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని, లేదంటే సంతాన నిరోధక పరికరాలు వాడాలని చైనా ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు ఈ పరిశోధన బైటపెట్టింది. చదువు,విజ్జానాన్ని పెంపొందించాలనే పేరుతో దాదాపు 10లక్షలమంది వీగర్‌ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందన్న ఆరోపణలున్నాయి. అయితే, చైనా మొదట్లో ఈ క్యాంపుల అంశాన్ని ఖండించినా, తీవ్రవాదాన్ని, షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో వేర్పాటువాదాన్ని నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యలుగా తర్వాత వీటిని సమర్ధించుకుంది. జెంజ్‌ అనే స్కాలర్‌ చేసిన ఈ రీసెర్చ్‌ రిపోర్ట్ ప్రకారం అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువమంది పిల్లలను కనాలనుకునే వారిని అబార్షన్లకు ఒత్తిడి చేస్తున్నారని, ఒప్పుకొకపోతే డిటెన్షన్‌ క్యాంపులకు తరలిస్తామని బెదిరిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. వీగర్‌ ముస్లిం మహిళలను అత్యంత అమానవీయ పద్దతిలో కుటుంబ నియంత్రణకు ఒత్తిడి చేస్తున్నారు అని నివేదికలో పేర్కొన్నారు. ఇద్దరికన్నా తక్కువ సంతానం ఉన్న మహిళలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ పరికరాలను- ఇంట్రా-యుటిరిస్ డివైస్‌-ఐయూడీ అమర్చుతున్నారని, మరికొందరికి కుటుంబ నియంత్ర ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని నివేదిక పేర్కొంటోంది. 2016 నుంచి షిన్‌జియాంగ్‌ ప్రాంతపు ప్రజల సంతానోత్పత్తి నిర్ణయాలలో ప్రభుత్వం బలవంతంగా కల్పించుకుంటోంది. క్రూరమైన విధానాల ద్వారా వారి జనాభా ఉత్పత్తిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది అని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. జెంజ్‌ నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి, జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గింది. 2015 నుంచి 2018 మధ్యకాలంలో జనాభా పెరుగుదల 84శాతానికి పడిపోయిందని, 2019లో అది ఇంకా తక్కువ ఉండొచ్చని రిపోర్టు వెల్లడించింది. ఈ స్థాయిలో జనాభా వృద్ధి పడిపోవడం అనూహ్యం. అక్కడ కఠినమైన విధానాలు అమలవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీగర్‌ తెగ ముస్లిం జనాభాను కంట్రోల్ చేసేందుకు ఇది ఒక విధానమంటూ జెంజ్‌ వ్యాఖ్యానించారు. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో చైనా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపుల్లో నిర్బంధం నుంచి బయటపడిన మహిళలు క్యాంపుల్లో తమకు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల తమ రుతుక్రమం ఆగిపోయిందని కొందరు చెప్పగా, సంతాన నిరోధక టీకాల వల్ల తమకు అధిక రక్తస్రావం అయ్యిందని మరికొందరు మహిళలు పేర్కొన్నారు. చైనాలో దశాబ్దాలపాటు వన్‌ చైల్డ్ పాలసీ అమలులో ఉన్నప్పటికీ, పట్టణప్రాంతాలలోని మైనారిటీలు ఇద్దరిని, గ్రామీణ ప్రాంతాలలోని మైనారిటీలు ముగ్గురిని కనేందుకు అవకాశం ఉండేది. అయితే 2017లో జిన్‌పింగ్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మైనారిటీలకే ఉన్న ఈ హక్కును చైనా ప్రజలందరికి వర్తింపజేసింది. మైనారిటీల మాదిరిగానే చైనీయులకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారిగా సంతాన నిబంధనలు వర్తిస్తాయి. అసోసియేటెడ్‌ ప్రెస్ రిపోర్ట్‌ ప్రకారం చైనా ప్రజలకు మాత్రం అబార్షన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఐయూడీ పరికరాల అమరికపై ఒత్తిళ్లులేవు. వీగర్‌ తెగ ముస్లింలపై ఈ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. షింజియాంగ్‌లో పెద్దవారి గుర్తింపు మార్చడంతోపాటు, పిల్లలను వారి మూలాల నుంచే వేరు చేయడానికి పథకం ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టూ బయటపడింది. షింజియాంగ్‌లో ఉండే విదేశీ జర్నలిస్టులపై 24 గంటల నిఘా ఉంటుంది. అక్కడ వారిని నీడలా వెంటాడుతారు. దాంతో షింజియాంగ్ ప్రాంతంలో ఉన్న వారితో మాట్లాడ్డం చాలా కష్టం. చైనా స్కూళ్లుగా పేర్కొంటున్న నిర్బంధ కేంద్రాల్లో సర్వేలెన్స్ సిస్టమ్స్, అలారంలు ఉన్నాయి. ప్రహరీ గోడలకు 10 వేల ఓల్టుల కరెంటు తీగలు ఏర్పాటు చేశారు. కొన్ని స్కూళ్లలో భద్రత కోసం పెట్టే మొత్తం ఖర్చు, మిగతా ఖర్చుల కంటే ఎక్కువ. ఈ విధానం 2017లో జారీ అయ్యింది. అప్పటి నుంచి స్థానికులను నిర్బంధంలోకి తీసుకోవడం విపరీతంగా పెరిగింది. తల్లి, దండ్రుల నుంచి పిల్లలను వేరు చేస్తున్న షింజియాంగ్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కొత్త తరాన్ని వారి మూలాలు, మత విశ్వాసాలు, సొంత భాషకు పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. చైనా కమ్యూనిస్టు రహస్య పత్రాల్లో మరిన్ని దారుణమైన వాస్తవాలు వెలుగుచూశాయి. నిర్బంధ శిబిరాల్లో ఉన్న విద్యార్థులు తమ తల్లి, దండ్రుల గురించి ఆందోళన చెందకూడదనీ, వారంతా ఇక కనిపించరనీ, మిస్సింగ్ అయ్యారంటూ పేర్కొంది. రోజూ రెండు డాలర్లను మాత్రమే భోజనానికి కేటాయించాలని కూడా తెలిపింది. ఒక వేళ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారికి తమ పిల్లల్ని చూసేందుకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అంతేకాదు, డిటెన్షన్ సెంటర్లలో ఉండేవారిని స్వేచ్ఛ సులభంగా లభించదని తేల్చి చెప్పింది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మూలవాసులైన వీగర్ ముస్లింలను వేధిస్తున్నారన్న ఆరోపణలతో ఆ దేశానికి చెందిన 28 సంస్థలను 2019లో అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. ఎంటిటీ లిస్ట్ గా పేర్కొనే నిషేధిత జాబితాలో పెట్టడంతో ఆ 28 సంస్థలు ఇకపై వాషింగ్టన్ అనుమతులు లేకుండా అమెరికా నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయలేవు. బ్లాక్‌లిస్టులో పెట్టిన సంస్థల్లో కొన్ని ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా మరికొన్ని సర్వేలెన్స్ పరికరాల వ్యాపారం చేసే ప్రయివేట్ టెక్ సంస్థలు. ఐక్యరాజ్యసమితిలో 2019, సెప్టెంబర్ లో జరిగిన ప్రపంచ దేశాల ప్రతినిధుల సభ సాక్షిగా పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్‌ ఇచ్చింది. కశ్మీర్‌లో ముస్లింలకు మానవ హక్కులు కరువయ్యా యంటూ పదేపదే ప్రస్తావించే పాకిస్తాన్‌.. చైనా వ్యాప్తంగా ముస్లింలపై కొనసాగుతున్న నిర్బంధంపై ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీసింది. ప్రజాస్వామ్య విలువల గురించీ, నిజాయితీ, నిబద్ధత గురించి, ప్రజల హక్కుల గురించి ప్రపంచ దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు కోట్ల సంఖ్యలో పుస్తకాలు ప్రచురించాయి. కానీ, ఒక్క అక్షరానికి సైతం కట్టుబడి లేవు ఆ పార్టీలు. భారతదేశంలోని కమ్యూనిస్టులు ఇతర వామపక్ష తీవ్రవాద సంస్థలు అందుకు మినహాయింపేమీకాదు. కమ్యూనిస్టుల ఎర్రజెండా...ప్రజల త్యాగాల చిహ్నం కాదు, ఆ పార్టీలు చేసిన హత్యలకు సాక్ష్యమని నిస్సంకోచంగా చెప్పాలి.