NationalistHub - 370 అధికరణం రద్దు – అంతర్జాతీయ మీడియా అసత్య కథనాలు</br></br> ఎ.రాకేష్ రెడ్డి
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
370 అధికరణం రద్దు – అంతర్జాతీయ మీడియా అసత్య కథనాలు

ఎ.రాకేష్ రెడ్డి
img



Share via Whatsapp web

సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన కశ్మీర్ సమస్యపై కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జమ్మూ-కశ్మీర్ ను భారత రిపబ్లిక్ లో విలీనం చేసింది. దేశ అంతర్గత అంశంగానే పరిగణించడం వల్ల అనుకున్న లక్ష్యం సాఫీగానే నెరవేరింది. దేశమంతా సంబరాలు చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాను గమనిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అమెరికా మీడియా సంస్థలు 370 ఆర్టికల్ రద్దు విషయంలో విస్మరణ ధోరణితో, ప్రతికూల దృష్టితో వ్యాఖ్యానాలు చేశాయి. పండిత్ ల విషయంలో, కశ్మీర్ మహిళల విషయంలో ఏకపక్షంగా వార్తలు రాశాయి.

జమ్మూ కశ్మీర్ ముస్లీం మతం మెజారిటీ గా ఉన్న రాష్ట్రం. హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు మైనారిటీ మతస్తులుగా ఉన్నారు. కశ్మీర్ రీజియన్ లో ముస్లీం జనాభా అధికంగా ఉంటే, లడఖ్, జమ్మూలు అందుకు భిన్నం. చారిత్రకంగా హిందూ సంస్కృతి బలంగా ఉన్న ప్రాంతాలు జమ్మూ-లఢఖ్.

రుగ్వేద కాలం(1500 బిసీ)లో కశ్యప ముని కశ్మీర్ అన్న పేరును స్థిరపరిచారు. అశోకుడి పాలనలో కశ్మీర్ లో బౌద్ధం, శైవ సంప్రదాయాలు విలసిల్లాయని, హిందూ ధార్మిక సంప్రదాయం వెల్లివిరిసిందనీ, అనేక ఆలయాలు ఆ కాలంలో నిర్మించారని అలెగ్జాండర్ తన యాత్రా చరిత్రలో రాసుకున్నారు కూడా. లఢక్ రీజియన్ లో హిందూ రాజులు, బుద్ధిష్టు రాజ్యాలూ ప్రత్యేకించి లోహరా రాజవంశీకులు మహమ్మద్ ఘజనీ దండయాత్రలను తిప్పికొట్టారు. ఘజనీ దండయాత్రలో సోమనాథ ఆలయం విధ్వంసంతో పాటు ఉపఖండ చరిత్రలో ధ్వంసమైన ఆలయాలు ఘజనీ దండయాత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి.

జమ్మూ, లఢఖ్ ప్రాంతంలో ఇస్లామిక్ పాలన 14వ శతాబ్దంలో మొదలై మొఘల్, ఆఫ్ఘాన్ రాజుల దండయాత్రల దాకా కొనసాగింది. 19వ శతాబ్దంలో సిక్కు రాజైన రాజా రంజిత్ సింగ్ కశ్మీర్ ను తిరిగి స్వాధీన పరుచుకునే దాకా సాగింది. బ్రిటీష్ పాలన కాలంలో కశ్మీర్ సంస్థానంగా మారింది. ఆనాటికి డోగ్రా రాజుల పాలన కొనసాగుతోంది.

దేశ విభజన కాలంలో భారత్, పాక్ లు 1947లో సొంత అస్తిత్వం గల దేశాలుగా రూపొందాయి. ఇస్లామిక్ దేశంగా పాకిస్థాన్, లౌకిక రాజ్యంగా భారత్ ఆవిర్భవించాయి. సంస్థానంగా ఉన్న కశ్మీర్ మాత్రం రెండు దేశాల్లో చేరకుండా ఉండిపోయింది. దేశ విభజన తర్వాత సరిగ్గా రెండు మాసాలకు చొరబాటుదారులు కశ్మీర్ లోకి ప్రవేశించి మతపరమైన మైనారిటీలుగా ఉన్నవారిని అంతమొందించి, ఇస్లామిక్ రాజ్యమైన పాక్ లో విలీనం చేసే కుట్ర జరిగింది. పాక్ బలగాలు మీర్ పూర్ నగరాన్ని ఆక్రమించుకున్నారు. తద్వారా అనేక లాభాలు పొందారు. హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి రావల్పిండీలోని వేశ్యవాటికలకు విక్రయించారు. ఆక్రమణదారుల చెర నుంచి తప్పించుకున్న సుమారు 4వందల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆక్రమణదారుల చేతుల్లో ఓడిపోయిన మహారాజా హరిసింగ్ ఎట్టకేలకు సెక్యూలర్ భారత్ లో విలీనానికి అంగీకరించాడు. సరిగ్గా ఇదే సమయంలో భారత బలగాలు కశ్మీరు సంరక్షణ కోసం బయలుదేరాయి. ఐక్యరాజ్య సమితి 47వ తీర్మానం ఆధారంగా కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ లు అంగీకారానికి వచ్చాయి. జమ్మూ-కశ్మీర్ లో చొరబడిన పాక్ జాతీయులు మూడు దశల్లో వెనక్కి వెళ్లాలనే నిర్ణయం జరిగింది. పాక్ ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్ లో ఉండిపోయిన ‘‘ఆజాద్ కశ్మీర్’’( వీరంతా రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న 60వేల మంది పాక్ జాతీయులు. కశ్మీర్ లో షరియత్ పాలన కావాలనుకుంటున్నవారు). మొత్తంగా బలగాల ఉపసంహరణ సందిగ్ధంగా మిగిలిపోయింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం స్తబ్దుగా మారిపోయింది.

భారత రాజ్యాంగం 1950లో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 370(35ఏ) అధికరణాన్ని ఉభయ సభలు ఆమోదించాయి. దీంతో కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగంతో పాటు, సొంతంగా చట్టాలు రూపొందించే హక్కులు సంతరించుకుంది. 1980ల్లో సీఐఏ సహకారంతో ఆఫ్ఘానిస్తాన్ లో అంతర్గత కల్లోలాన్ని రెచ్చగొట్టేందుకు ఆయధాల సరఫరా, యుద్ధ శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది ఐఎస్ఐ. ఈ అనుభవాన్నే పాకిస్థాన్ భారత్ పై ఉపయోగించింది . పాక్ లో పనిచేసే ఇస్లామిక్ ఉగ్రమూకల్ని కశ్మీర్ కు పంపుతూ....మత మైనారిటీలను నిర్మూలించే పనికి పూనుకుంది. పాక్ ప్రధాన లక్ష్యం కశ్మీరీ పండిత్ లుగా నిర్దేశించుకుంది. జనాభాపరంగా కశ్మీర్ ను ఇస్లాం రాష్ట్రంగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. పాక్ చేస్తున్న కుయుక్తుల విషయంలో నాటి కశ్మీర్ ప్రభుత్వం, భారత హోoమంత్రి గానీ నోరు మెదపలేదు. అమెరికా కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు. స్వయంగా కశ్మీరీ ఐన ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆనాటి హోం మంత్రి కూడా. తొంభయ్యో దశకంలో సుమారుగా 5లక్షల మంది కశ్మీరీ పండిత్ లు తమ మూలాలు ఉన్న చారిత్రక ప్రాంతాలు వదిలి చెల్లాచెదురైపోయారు. కశ్మీరీ పండిత్ ల జనాభా 2016నాటికి కేవలం 3వేలుగా నమోదైంది. కశ్మీర్ లోయలో 35 మంది సిక్కులను గురుద్వారాలోనే ఊచకోత కోశారు ఉగ్రవాదులు. 62వేల మంది సిక్కు కుటుంబాలు పుట్టిన ప్రాంతాల్లోనే ఆంతరంగీక శరణార్థులుగా మిగిలిపోయారు. తీవ్రమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. 370 అధికరణంలో భాగంగా ఉన్న 35 ఏ షెడ్యూల్ వల్ల కశ్మీర్ ముస్లీం మహిళలు తీవ్రమైన హింసను అనుభవించారు. ఈ అధికరణం కారణంగానే దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలెవరూ కశ్మీర్ లో భూ కొనుగోళ్లు, ఉద్యోగ హక్కు నుంచి దూరం చేయబడ్డారు. ఇతర రాష్ట్రాల యువకులతో పెళ్లి చేసుకున్న మహిళలకు ఆస్తి హక్కు లేకుండా పోయింది.

మధ్య ప్రాచ్య దేశాల్లో, ఇస్లామిక్ రాజ్యాల్లో అమలయ్యే షరియా ప్రభావం కశ్మీర్ స్వయంప్రతిపత్తి ఉన్న చట్టాల్లో ఉండటం అమానవీయంగా పరిగణించారు. ఇతర దేశాల పౌరసత్వాలున్నవారిని వివాహం చేసుకోవడం నిషిద్ధమన్నది 35ఏ లో ఉండిపోయింది. 2004లో, 2015లో అమానవీయ చట్ట సవరణపై కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికత లేకపోవడంతో పాటు అణగారిన వర్గాల వారికి హక్కులు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్ లు దాఖలయ్యాయి. ఇంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న అంశాల విషయంలో వ్యాఖ్యానాలు చేస్తున్నపుడు....అంతర్జాతీయ మీడియా కొంత సంయమనంతో....వాస్తవాధారిత కథనాలు రాస్తే బాధ్యతగా ఉండేది. వాస్తవ దూరమైన, అచారిత్రక కథనాలు ప్రచురించకపోవడం చరిత్రను గౌరవించడమన్న స్పృహ ఉండాలి.

అంతర్జాతీయ మీడియా కథనాలు:

వాషింగ్టన్ పోస్ట్ లో రిపోర్ట్ అయిన కశ్మీర్ కథనంలో....జమ్మూ- కశ్మీర్ లో హిందూ, బౌద్ధ సంప్రదాయాల ఊసేలేదు. ఐక్యరాజ్య సమితి తీర్మానం గురించి ఒక్క వాక్యం రాయలేదు. గిల్గిట్- బాల్టిస్థాన్ విషయంలో పాక్ వైఖరి గురించి మాట మాత్రంగా ప్రస్తావన లేదు. భారత్ కశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేసేసిందని ఏకపక్ష కథనాలు రాసింది వాషింగ్టన్ పోస్ట్. పైగా ఈ కథనం రాసిన రచయిత పాక్ లో ఉన్న అమెరికా దౌత్యవేత్త. వీవోఎక్స్ మీడియాలో సైతం కశ్మీర్ ను ముస్లీం మెజారిటీ రాష్ట్రంగా పేర్కొన్నారు. వీరే ప్రసారం చేసిన వీడియోలో కేవలం కశ్మీర్ లోయలోని ప్రజల అభిప్రాయాలను ప్రసారం చేసి, లడఖ్, జమ్మూ ప్రజల అభిప్రాయాలకు చోటివ్వలేదు. ఇదే విధమైన కథనాలు అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్, ఫారెన్ పాలసీ పత్రికల్లో అచ్చయ్యాయి. చారిత్రక సందర్భం గురించి రాస్తున్నపుడు, వాస్తవాల పున:పరిశీలన చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.

-ఎ.రాకేష్ రెడ్డి

9000522400

(బీజేపీ అధికార ప్రతినిధి, ఆర్థిక విశ్లేషకులు. సెంటర్ ఫర్ లీడర్ షిప్ అండ్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్) ....