తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్

Mar 13, Fri 2020 08:36 PM In Focus

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. 2021లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో తన పార్టీ తప్పక పోటీ చేస్తుందని సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీగా చెప్పేశారు. తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాల నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని...అందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని..., వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదని స్పష్టం చేశారు.

మరోవైపు తమిళనాడులో తన బలం పెంచుకునేందుకు బీజేపీ కూడా వ్యూహం మార్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎల్ మురుగన్ ను తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఈ పదవిపై ఆరు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ గత ఏడాది సెప్టెంబర్ ఒకటిన తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తర్వాత తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం ఖాళీగానే ఉంది.

పార్టీ అధ్యక్ష పదవి కోసం తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేతలు చాలా మందే ప్రయత్నాలు చేశారు. మాజీ కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా తదితరులు పోటీ పడ్డారు. అయితే ప్రస్తుత తరుణంలో తమిళనాడులో ద్రవిడవాద ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా క్రమంగా కుటుంబ పార్టీలుగా రూపాంతరం చెందడంతో...చాలా సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం...రాజకీయ పదవులు దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు రాజకీయాలపై ద్రవిడవాద పార్టీల ఓటు బ్యాంకుపై వివిధ సర్వేల ద్వారా ఓ అవగాహనకు వచ్చిన బీజేపీ అధిష్టానం...సామాజిక వర్గం ప్రాతిపదికన తమిళనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎల్.మురుగన్ ను నియమించింది. ప్రస్తుతం మురుగన్ జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఎల్.మురుగన్ కు సంఘ్ పరివార్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. విద్యార్థి దశలో ఆయన తమిళనాడులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కార్యకర్తగా పనిచేశారు. చెన్నైలోని అంబేద్కర్ కళశాలలో న్యాయశాస్త్రం చదివారు. మద్రాస్ యూనివర్శిటీలో లా పీజీ పట్టాను పొందారు. అదే విశ్వవిద్యాలయంలో మానవహక్కులపై పీహెచ్ డీ చేస్తున్నారు. 2011లో ఒకసారి ఆయన సేలం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. న్యాయవాదిగా కూడా మురుగన్ కు మంచి పేరుంది. తమిళంతోపాటు ఆంగ్లం, తెలుగు భాషలోనూ పట్టుంది.

2021లో జరగబోయే ఎన్నికల్లో ఒక వైపు డీఎంకే కూటమి, మరోవైపు అధికార అన్నాడీఎంకే కూటమి...ఇంకా చిన్న పార్టీల కూటమి, కమలాసన్ పార్టీ , అలాగే రజనీకాంత్ పార్టీ బరిలో నిలుస్తున్నాయి. ఈ సంకుల సమరంలో బీజేపీ మురుగన్ ను రంగంలోకి దించడంతో ఆయన పనితీరుపై పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

తమిళనాడులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఇది రెండోసారి. గతంలో 2000 సంవత్సరంలో కూడా ఎస్పీ కిరుబంన్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది.అయితే అప్పట్లో తమిళనాడు బీజేపీ నేతలు అతనికి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత కాలంలో 2012లో ఆయన డీఎంకే పార్టీలో చేరి..., ఇటీవలే మళ్లీ తిరిగి బీజేపీలోకి వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష స్థానం కోసం పోటీపడిన పదిమంది వరకు నేతలు...ఇప్పుడు మరుగన్ కు సహకరిస్తారా? వీరందరిని ఏకతాటిపై తీసుకువచ్చి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడం మురుగన్ ముందున్న అతి పెద్ద సవాలని విశ్లేషకులు అంటున్నారు.