NationalistHub - ఇరాన్ విమర్శల వెనుక...ఎవరున్నారు?
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
ఇరాన్ విమర్శల వెనుక...ఎవరున్నారు? imgShare via Whatsapp web

భారత్... ఇరాన్ కు నమ్మకమైన మిత్ర దేశం...! అలాగే అమెరికా కూడా భారత్ ను తమ మిత్రదేశంగా భావిస్తోంది. ఇప్పుడు అమెరికాకు...ఇరాన్ కు మధ్య అసలు పడటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతోనే తమ అగ్రశ్రేణి సైన్యాధిపతి మేజర్ జనరల్ సులేమానిని CIA కడతేర్చిందని ఇరాన్ ఇప్పటికే అమెరికాపై యుద్ధం కూడా ప్రకటించింది. ఇరాక్ లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు కూడా చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా భారత్ తమకు అండగా నిలబడుతుందని ఇరాన్ భావించింది.

అయితే దౌత్యపరమైన కూటనీతిలో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అటు అమెరికాను, ఇటు ఇరాన్ ను నొప్పించకుండా స్పందించేందుకు భారత్ ప్రయత్నం చేసింది. సులేమాని హత్యపై భారత్ అంతగా స్పందించలేదు. మన దేశ అవసరాల దృష్ట్యా మౌనం వహించింది. దీంతో భారత్ తీరుపై ఇరాన్ కాసింత అసంతృప్తికి లోనైంది. ఇక అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా మలేషియా, టర్కీ , పాకిస్తాన్ దేశాలకు తోడుగా నిలబడి భారత్ పై విమర్శలు గుప్పిస్తోంది.

ఇరాన్ లోని చాబహార్ పోర్టును భారత్ అభివృద్ధి చేస్తోంది. దీని కోసం కోట్లాది రూపాయలను ఇప్పటకే వెచ్చించింది. అలాగే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాలకు భూ మార్గం ద్వారా వాణిజ్య బంధం నెలకొల్పుకునేందుకు ఈ పోర్టు భారత్ కు ఎంతో అవసరం. అలాగే ఇరాన్ , అప్గాన్ నగరాలను చాబహార్ పోర్టుతో అనుసంధానం చేసే రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం కోసం 2016లో భారత ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీ, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీలు ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు.

అయితే సులేమాని దారుణ హత్య.... భారత్, ఇరాన్ సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. ఇక గత నెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన భారత పర్యటన తర్వాత ... ఇరాన్ తీరులో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. క్రమంగా భారత్ కు దూరంగా జరుగుతోన్నట్లు ఆ దేశ మంత్రులు, దేశాధినేతలు చేస్తున్న ట్వీట్టర్ కామెంట్లే చెబుతున్నాయి.!

ఇటు మోదీ ప్రభుత్వం... దేశంలో సీఏఏ చట్టం తీసుకువచ్చిన తర్వాత..., దాన్ని యాంటి ఇస్లామిక్ చట్టంగా బీబీసీతోపాటు మన దేశంలోని కొన్ని సోకాల్డ్ లెఫ్ట్ చానళ్లు విస్తృతంగా ప్రచారం చేశాయి.! వరల్డ్ వైడ్ గా తమకున్న నెట్ వర్క్ ద్వారా ముఖ్యంగా యూరోప్ తోపాటు, మధ్యప్రాచ్యంలో అభూతకల్పనలు ప్రచారం చేశాయి. దీనికి మన దేశంలోని కొంతమంది సూడో లెఫ్ట్ లిబరల్ మేధావులు కూడా తమవైన కల్పిత వ్యాసాల ద్వారా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.! సీఏఏ వ్యతిరేక ఆందోళనలను.., అతి పెద్ద ఆందోళనలుగా ప్రచారం చేయడమేకాకుండా..., విదేశాల్లో భారత్ దేశ ప్రతిష్టను సైతం దెబ్బతీసే విధంగా వీరి వ్యాసాల పరంపర కొనసాగిందనే వారు ఉన్నారు. అంతేకాదు విదేశీ నిధులతో నడిచే ఎన్జీవో సంఘాలను నడిపే హర్ష్ మందర్ వంటి వారు కూడా ఈ కుట్రల్లో ప్రముఖ పాత్ర పోషించారని కొన్ని జాతీయవాద సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి.

ఈ సోకాల్డ్ మేధావులు, సూడో జర్నలిస్టులు రాసిన రాతలను, ప్రచురించిన వార్తలనే ఆధారంగా చేసుకుని..., పాకిస్తాన్ , టర్కీ, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు భారత్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాదు జెనివాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ముందు భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ కూడా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ , టర్కీ దేశాల సరసన చేరింది. భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా..., ఢిల్లీలో జరిగిన హింసలో.., 47 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇకనైనా ఇలాంటి తెలివి తక్కువ చర్యలు ఆపి , పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ దేశ విదేశాంగ మంత్రి ట్విట్టర్ లో భారత్ పై విమర్శలు గుప్పించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతర్గత విషయాల్లో, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కులు ఎవరికీ లేదంటూ కాసింత ఘాటుగానే ఆయన కౌంటర్ ఇవ్వవలసి వచ్చింది.

ఈ ట్వీట్లు మరవక ముందే...ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కూడా ఢిల్లీ అల్లర్లపై స్పందించి... మారిన తన వైఖరిని స్పష్టం చేశాడు. భారత్ లో ముస్లింల ఊచకోత జరుగుతోందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయని. హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను భారత ప్రభుత్వం అడ్డుకోవాలని..., ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను ఆపాలని. ఇస్లాం ప్రపంచం నుంచి వేరుగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ఆపేందుకు భారత్‌ నిర్ణయం తీసుకోవాలంటూ ఖమేనీ ట్వీట్‌ చేశారు. ఇందుకు ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి భౌతికకాయం ముందు పిల్లాడు ఏడుస్తున్న ఫొటోను జతచేసి... ఇంగ్లీష్‌, ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌ భాషల్లో ట్విటర్‌లో భారత్ పై తన అసహనాన్ని వెల్లగక్కాడు.

అటు మరోక ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియా కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ అల్లర్లపై తమను స్పందించాల్సిందిగా తమ దేశంలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సున్నితమైన అంశాలపై బాధ్యతా రహితంగా మాట్లాడవద్దని అంతర్జాతీయ నాయకులు, సంస్థలను కోరింది.

ఏది ఏమైనా దౌత్యపరమైన కూటనీతిలో ఎవరి అవసరాలు వారివే..! యుద్ధ సమయాల్లో బలవంతుడితో స్నేహం కలిసి వస్తుందన్నది ఆచార్య చాణక్యుడి సూత్రం.! పీవోకేను ఎలాగైన సరే తిరిగి స్వాధీనం చేసేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహారిస్తూ అమెరికాకు దగ్గరవుతుందని అంటున్నారు.

ఏ దేశ మేధావులైనా..., జర్నలిస్టులైనా..., న్యూస్ చానళ్ల ఐనా..., ఎన్జీవో సంఘాలైనా తమ దేశ హితానికే ప్రాధాన్యం ఇస్తాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏమిటంటే...,! మన దేశంలో దీనికి అంతా రివర్స్ గా సాగుతోంది.! సీఏఏను బూచిగా చూపి..., అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, దేశంలో అస్థిరత్వాన్ని రాజేసేందుకు విదేశీ శక్తులు చేస్తున్న కుట్రల్లో...ఈ సూడో మేధావులు, జర్నలిస్టులు, ఎన్జీవో సంఘాల నాయకులు, కొన్ని రాజకీయ పార్టీల అధినేతలు భాగస్వాములుగా మారి..., వారికి తమ వంతు సాయం చేస్తున్నారా? సీఏఏ, ఎన్పీఆర్ , ఎన్నార్సీలపై కావాలనే అభూతకల్పనలను ప్రచారం చేస్తూ దేశంలో అలజడిని సృష్టిస్తున్నారా? భారతీయులందరూ ఆలోచించాల్సిన తరుణమిది. ....