NationalistHub - హిందూ సింహం ‘‘తానాజీ’’...!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
హిందూ సింహం ‘‘తానాజీ’’...! imgShare via Whatsapp web

ఉత్తరాన హిమాలయం, దక్షిణాన కన్యాకుమారి, తూర్పు పడమరల ఎత్తైన కొండలు. మూడు వైపులా సముద్రాలు, నడుమన వింధ్య పర్వతాలు...! జగన్మాతయై వెలుగొందిన దేశం భారత దేశం....! వేదాలకు పుట్టినిల్లు, రుషులను, ద్రష్టలను కన్నతల్లి...! రాజులను, సామ్రాట్టులను ప్రసవించిన వీరభూమి...! ధర్మానికి కాణాచి..! ఇహపరాలకు సేతువు..! మహాత్ములు, భక్తులు, జ్ఞానులు, తాపసులు, వీతరాగ సన్యాసులు, వెలుగొందిన దేశం. సాక్షాత్తు పరమేశ్వరుడే తానై అవతరించడానికి ఎంపిక చేసుకొన్న పావన భూమి మన భారత దేశం.! విదేశీయులు, విధర్మీయులు, మ్లేచ్చుల పరిపాలనలో దేశంలో...,హిందూ ధర్మంపై దాడులు కొనసాగుతున్న వేళ....మహారాష్ట్ర ప్రాంతంలో ఓ హిందూ సింహాం గర్జించింది. సమరనాదంతో హైందవ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికింది. ఆ హిందూ సింహమే... రాజా ఛత్రపతి శివాజీ...! ఆయన వద్ద పనిచేసిన గొప్ప సేనానుల్లో ఒకరు హిందూ వీరసింహం -తానాజీ మల్సురే.

-రాజా ఛత్రపతి శివాజీని...ఆధునిక భారత ఆశాజ్యోతిగా వర్ణించారు...పరమ పూజనీయ శ్రీ గురూజీ గోళ్వల్కర్...! భూమి దున్నుకుని వ్యవసాయం చేసే సామాన్య కర్షకులను ఆయన తన దరికి చేర్చుకున్నారు. వారిని హిందూ జాతీయ వీరులుగా తీర్చిదిద్దారు. అలాంటి వీరుల్లో తానాజీ మల్సురే ఒకరు..!

ఛత్రపతి శివాజీ తన వీరత్వంతో, యుక్తితో, హిందువులందరూ పరువు మర్యాదలతో బ్రతికి బట్టకట్టేట్టు చేశారు. నిజానికి ఈ దేశానికి అసలు ప్రభువులు హిందువులే. వరుసగా 800 ఏళ్ళు విదేశ, విధర్మ,వికృత సంస్కృతుల దాడులకు గురి అయి స్వతంత్రం కోల్పోయి బానిస బ్రతుకు బ్రతుకుతూ అదే జీవన పరమావధి అని భావిస్తున్న రోజులు. దేశంలో దేవాలయాలు ధ్వంసమైనాయి. గ్రామాల్లో వృత్తులు లేవు. హిందువులందరూ స్పందనలేని జడులై చచ్చుబారి బానిస చాకిరీలకు తమను అంకితం చేసుకునే దుస్థితికి వచ్చారు. ఒక వైపు ఉత్తారన మొగలుల అపార శక్తి, దక్షిణాన నిజాంషాహీ, ఆదిల్షాహీ, కుతుబ్ షాహీల బలగాలు...! అంతులేని ధనం, ఆయుధ సంపత్తి, కాకలు తీరిన యోధులు. ఈ విపత్కర సమయంలోనే మహారాష్ట్ర ప్రాంతంలో ఇంకా మీసాలు కూడా రాని ఓ హిందూ సింహం గర్జించింది. హిందూ జాతిలో నిద్రాణమైన సంఘటిత శక్తిని తట్టిలేపింది. ఆ హిందూ సింహమే వీర శివాజీ...!

ఛత్రపతి శివాజీ తన రాజ్యాన్ని హిందూ స్వరాజ్యంగా ప్రకటించాడు. అప్పటికే ఔరంగజేబుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తన స్వాధీనంలోని కోటలను మొగలులకు అప్పగించాడు. అయితే ఔరంగజేబు నమ్మకద్రోహం చేసి...ఆగ్రా కోటలో బంధించాడు. ఆగ్రా కోట నుంచి తప్పించుకున్న తర్వాత శివాజీ మొగలులకు ధారదత్తం చేసిన కోటలన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టాడు. కేవలం ఆరు నెలలో మొగలాయిల స్వాధీనంలో ఉన్న కొండాణ, పురందర్, రోహిడ, లోహగడ, మాహులీ కోటలను ఆయన తిరిగి జయించాడు.

ఈ యుద్దాల్లో కొండానా దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నకథ ప్రపంచ వీరగాధలలో స్వర్ణాక్షరాలతో లిఖించ తగ్గది. కొండాణ దుర్గాన్ని జయించడానికి ఛత్రపతి శివాజీ...తన సేన నాయకుల్లో ఒకరైన తానాజీ మల్సురేనే ఎంపిక చేశారు. తానాజీ.....శివాజీ లక్ష్యమైన హిందూ స్వరాజ్యోద్యమ సూత్రధారులలో ఒకరు. మొదటి నుంచి కూడా ఆయన ఛత్రపతికి నమ్మకమైన సహచరుడు. తన కుమారుడి వివాహం నిశ్చమైంది. ఈ తరుణంలో శివాజీ మహారాజు తనకు కొండానా దుర్గాన్ని జయించే బాధ్యతను అప్పగించడంతో ఆయన వివాహాన్ని వాయిదా వేసి...విజయయాత్రకు బయలు దేరాడు.

….. TANAJI-2

ఆగ్రా నుంచి వచ్చిన తర్వాత శివాజీ...విజయయాత్రలో మొదటిది కొండాణ దుర్గం. ఈ కోట జీజామాతకు ప్రాణసమానం. ఒక రోజు ఆమె..., రాయగఢ్ కోట నుంచి దూరానా వున్న కొండాణ దుర్గం, దాని మీద కనిపించే ఆకుపచ్చ జెండాను చూశారు. వెంటనే శివాజీని పిలిపించారు. కొండాణ కోటను స్వాధీనం చేసుకుని...హిందువుల భగవధ్వజాన్ని ఎగురవేయాలని ఆజ్ఞాపించారు.

శివాజీ మహరాజు... గతంలో పురందర్ సంధి ననుసరించి కొండాణ కోటను మొగలాయిలకు అప్పగించారు. అయితే ఆగ్రాకు వచ్చిన శివాజీని ఔరంగజేబు బంధించడంతో ఈ సంధి ఒప్పందానికి ఇక విలువ లేకుండా పోయింది. అదే సమయంలో ఔరంగజేబు....దేశంలోని దేవాలయాలను విధ్వంసం చేయాలనే ఉత్తర్వులు జారీ చేసినట్లుగా జీజామాత చెవినపడింది. అంతేకాదు హిందువులకు పరమ పవిత్రమైన కాశీ విశ్వనాథుని ఆయలాన్ని నేలమట్టం చేసి...దాని స్థానంలోనే మసీదును సైతం నిర్మించారనే వార్త విన్న...జీజామాతలో ప్రతీకారేచ్చ రగిలిపోయారు. వెంటనే శివాజీని పిలిచి తనకు కొండాణ కోటను స్వాధీనపర్చాలని కోరింది. కాశీవిశ్వనాధాలయం ధ్వంసం చేసిన మొగలుల ఆధీనంలో ఆ కోట ఎంతమాత్రం ఉండటానికి వీలులేదని ఆమె తెగేసి చెప్పారు.

వెంటనే శివాజీ మహారాజు మావళే వీరుడు తానాజీ మల్సురేకు కబురు పెట్టారు. అప్పటికే తానాజీ కుమారుడి వివాహం నిశ్చయమైంది. ఆయన పెళ్లి పనుల్లో మునిగివున్నారు. ఛత్రపతి నుంచి పిలుపు రావడంతో...తానాజీ పెళ్లి పనులను సైతం ప్రక్కన పెట్టి..తన తమ్ముడు సూర్యాజీ, మామ శేలార్ తోపాటు మావళీ యోధులతో హుటాహుటిన శివాజీకి వద్దకు వచ్చారు.

తానాజీ...గతంలో అఫ్జల్ ఖాన్ వధ సందర్భంగా... గొప్ప పరాక్రమం ప్రదర్శించిన యోధుడు. శివాజీ రాజే మీదకు దాడికి వస్తున్న అఫ్జల్ ఖాన్ ప్రధాన అంగరక్షుడి చేతిని క్షణాల వ్యవధిలోనే ఖండించిన ధీరుడు. కొండానా దుర్గాన్ని తక్కువ రోజుల్లో సాధించి పెట్టాలని తెలిపారు శివాజీ. ఈ యుద్ధానికి సంబంధించి వ్యూహంపై ఛత్రపతి...తానాజీతో చర్చించారు.

రాయగఢ్ నుంచి కొండాణ కోట 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దుర్భేద్యమైనది. అంతేకాదు ఈ కిలేదారు కూడా ఆజయుడే. ఇతడు రాజపుత్ర సర్ధార్ ఉదయభాను రాఠోడ్. అత్యంత కార్యదక్షుడు. అంతేకాదు ఔరంగజేబుకు నిష్ఠగల సేవకుడు. కోట బురుజు మీద నిప్పులు కక్కే ఫిరంగులు ఇరవై నాలుగు గంటలూ సిద్ధంగా ఉంటాయి. ఇతని అధీనంలో 5 వేల మంది రాజపుత్ర యోధులు, అంతకుమించిన సంఖ్యలో పఠాను సైనికులు ఉన్నారు.

వ్యూహం ప్రకారం 1670 ఫిబ్రవరి 4న... తానాజీ కొండాణ దుర్గంపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన వెంట తమ్ముడు సూర్యాజీ, 5 వందల మంది మెరికల వంటి మావళేలు ఉన్నారు. సింహగఢ్ కు రెండు వైపులనే ద్వారాలు ఉంటాయి. వాటి పొడువునా ఉదయభాన్ సైనికుల కట్టుదిట్టమైన పహరా ఉంటుంది. మిగిలిన వైపుల సహజ సిద్ధమైన పర్వాతాల గోడలు. వీటి మీదగా మానుష్యులు ఎక్కిరావడం అసంభవం. అందుకే ఈ వైపున పహారా ఏర్పాట్లు లేవు.

…………….. TANAJI-03

(). తానాజీ మల్సురే...ఛత్రపతికి ఆప్తసఖుడు...! చిన్నప్పటి నుంచి కూడా శివాజీ వెంట ఎన్నో యుద్ధాల్లో పాలుపంచుకున్నాడు. సింహ సమానుడు. కొండాణ దుర్గాన్నిజయించేందుకు ఆయన యశ్వంత్ ను నమ్ముకున్నారు. ఇంతకీ ఈ యశ్వంత్ ఎవరు?

సాహస విక్రమశాలి అయిన తానాజీ కొండాణ కోటను సాధించేందుకు తనదైన శైలిలో ఒక వ్యూహారాన్ని రచించారు. ఆయన వద్ద యశ్వంత్ అనే ఓ పెద్ద ఉడుము ఉండేది. ఉడుముకు తేనె అంటే ఇష్టం. తానాజీ దాని నోటికి కాస్త తేనే పూసి నిటారుగా ఉన్న కొండపైకి తాడుకట్టి వదిలాడు. తాడు పొడువునా ఉడుము కొండపైకి పాకి అక్కడ పట్టుపట్టింది. ఉడుము పట్టు మహాగట్టిది. ఆ తాడు పుచ్చుకొని ఇద్దరు కొండనిలుపు ఎక్కిపైకి చేరుకున్నారు. ముందుగా పైకెక్కిన ఆ ఇద్దరూ తమతో తెచక్చిన పెద్ద త్రాటిని పైన బలంగా కొట్టి కిందకు జారవిడిచారు. మిగిలిన మావళే యోధులందరూ ఒకరొకరే పైకి ఎక్కారు. అయిదు వందల మంది మావళేలు చప్పుడు కాకుండా అడుగులు వేస్తూ నిశాచరుల్లాగా విచ్చుకత్తులతో కోటలోకి దిగారు.

మరాఠాలు కోటలోకి చొరబడ్డ విషయం గస్తీవాళ్లు చూశారు. మరాఠాలు మెరుపు వేగంతో గస్తీవాళ్లను నరికివేశారు. హరహరమహాదేవ అంటూ రణగర్జనతో కోటలో విరుచుకుపడ్డారు.కొట మొత్తం దద్దరిల్లిపోయింది. ఉదయభాన్ సైనికులు దిగ్భ్రాంతులయ్యారు. తానాజీ సైన్యంపై ఒక్కసారిగా 15 వందల మంది సైనికులు వచ్చిపడ్డారు. ఎక్కడ చూసినా కాగడాలు పుచ్చుకొని పరుగులు తీస్తున్నారు. కడ్గాల ఖంగుఖంగు ధ్వనులు, ఒకరినొకరు గుద్దుకొంటున్నారు. దెబ్బలు తగిలిన వారు ఆర్తానాలు చేస్తున్నారు. గాఢనిద్రలో ఉన్న ఉదయభాన్ కి ఈ కోలహలంతో హఠాత్తుగా మెలకువచ్చింది. విషయం తెలియగానే అతడు అగ్నిపర్వతంలా భగ్గుమని ఖడ్గం తిప్పుతూ పోరు జరుగుతున్న చోటుకి వచ్చాడు.

మరోవైపు తానాజీ, సూర్యాజీ తమ చుట్టూ ఉన్న రాజపుత్ర సైనికులను నరికి పోగులు పెడుతున్నారు. శత్రువులు దిగ్భ్రాంతి నుంచి తేరుకోకమునుపే..వారిని అంతం చేయాలని తానాజీ మహోగ్రంగా శత్రుసంహరం చేస్తున్నారు. ఇలా చాలా సేపటి నుంచి పోరాడుతూ అలసి ఉన్న తానాజీ... అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయభాన్ ను ఢికొన్నాడు. ఉదయభాన్ ఏనుగులాంటి దేహబలం గలవాడు. తానాజీ ముఖంలో ఒకరికొకరు తీసిపోని ఈ వీరులిద్ధరూ కత్తులు కలిపారు.ఖడ్గాలు ఖంగుమంటున్నాయి. ఉదయ్ భాన్ రాక్షస బలంతో వేసిన కత్తి దెబ్బకి తానాజీ డాలు పగిలిపోయింది. వెంటనే తానాజీ తన తలపాగా గుడ్డను తీసి...డాలు పట్టుకునే చేతికి చుట్టుకున్నాడు. అప్పటికే తానాజీకి అర్థమైంది ఇక తన అంత్యకాలం సమీపించిందని అర్థమైంది. శివాజీ రాజాకు ఇచ్చిన మాట... కోసం తన ప్రాణాలను లెక్క చేయ్యకుండా ఉదయభానుపైకి లంఘించి...శరీరంలో మిగిలి ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ఆఖరి కత్తివేటు వేశాడు. అది ఉదయభాన్ కు వజ్రాఘాతమే అయ్యింది. అదే సమయంలో అతడి ఖడ్గం వేటు కూడా తానాజీపై పడింది. మహా పర్వత శిఖరాల వలె..ఓటమి నెరగని మేటి వీరుడు తానాజీ కూలిపోయాడు. ఇది చూసినే తానా తమ్ముడు సూర్యాజీ... మెరుపు వేగంతో ముందుకు దూకి ఉదయ్ భాన్ పై విరుచుకుపడి చంపివేశాడు.

మరాఠా సైనికుల్లో ప్రతి ఒక్కడు తానాజీ వలే విజృంభించాడు. వీరి వీరావేశం ముందు శత్రు సైన్యం నిలవలేక కంపించిపోయింది. చూస్తూ చూస్తూండగానే దుర్గంలోని వెయ్యిమందికి పైగా నేలకూలారు. కొండగోడ ఎక్కి తానాజీతో కోటలో దిగిన అయిదు వందల మందిలో చనిపోయిన వారు 50 మంది మాత్రమే. కొండాణ దుర్గం స్వాదీనమైంది. రాయగాఢ్ లో శివాజీకి రాత్రి నిద్రలేదు. ఆయన చూపు అంతా 15 కిలోమీటర్ల దూరంలోని కొండాణపైనే. చూస్తుండగానే సింహగఢ్ పై ఒక చిన్న జ్వాల ఎగిసింది. అది క్రమంగా పెద్దదైంది. కోట స్వాధీనమైనట్లుగా శివాజీ మహారాజుకు మరాఠా యోధులు పంపిన సందేశమిది.

పదివేల మంది సైన్యంతో కూడా సాధించడం వీలుకాని కొండాణ దుర్గాన్ని కేవలం తానాజీ కేవలం 50 మంది వీర సైనికుల బలిదానంతో సాధించాడు. ఈ యుద్ధంలో తన మిత్రుడు సుబేదార్ తానాజీ వీర మరణం పొందడంతో శివాజీ ఎంతగానో దుఖించాడు. గఢ్ వచ్చింది కానీ నా సింహం వెళ్లిపోయిందని రోధించాడు. ఇప్పటికీ మహారాష్ట్రంలో ఇంటింటా "గఢ్ అలా పణ్ సింహ్ గేలా" అనే భావోద్వేగభరితమైన నానుడి నిలిచి ఉంది.

తానాజీ మల్సురే...ఛత్రపతి శివాజీతో ప్రతిఘడియా ఆయన అరచేతిని పట్టుకొని హిందూ స్వరాజ్యస్థాపనకు సహకరించిన ఆప్తుడు. తానా మరణం ఆయనకు వజ్రపాతమే అయ్యింది. కోట దక్కినా నా సింహం పోయిందని శివాజీ విలపించాడు. కొడానా దుర్గం పేరును మార్చి...తానాజీ వీరోచిత పోరాటానికి సాక్షిగా సింహగఢ్ అని నామకరణం చేశారు. ఈ కోటలో నేడు మనం తానాజీ స్మారకాన్ని ఇప్పటికీ చూడవచ్చు. నేటికి తానాజీ విజయగాథ... మహారాష్ట్ర జానపద గీతాలలో ఉద్రేకభరితంగా వినిపిస్తుంటుంది.

....