NationalistHub - బ్రాహ్మణ సాంబార్ పౌడర్ వద్దట... హలాల్ ఫుడ్ మాత్రం ముద్దట!!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
బ్రాహ్మణ సాంబార్ పౌడర్ వద్దట... హలాల్ ఫుడ్ మాత్రం ముద్దట!! imgShare via Whatsapp web

ఆన్నానికి మతం ఉంటుందా? – ఇది కొన్నాళ్ల క్రితం మన ఉదారవాద మిత్రులు వేసిన ప్రశ్న! బహుశః మీకు గుర్తుండే ఉంటుంది. వ్రత దీక్షలో ఉన్న ఒకాయన జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయడం, ముస్లిం చేతుల మీదుగా ఫుడ్ ను డెలివరీ చేయొద్దని కోరడం, దానిపై జొమాటో అన్నానికి మతం లేదని బీరాలు పలకడం, ఆ తరువాత ఉదారవాదులందరూ హఠాత్తుగా ఉన్నట్టుండి ఉదరవాదులుగా మారిపోవడం గుర్తుండే ఉంటుంది. నాకు ముస్లిం డెలివరీ బాయ్ అందించే ఆహారం వద్దన్న మనిషిని బోనెక్కించి, విచారణ లేకుండానే ఉరి శిక్ష వేయించినంత పనిచేశారు. ధర్మ పన్నాలు... సారీ అధర్మ పన్నాల్లు వల్లించి వల్లించి ఊదరగొట్టేశారు.

అన్నానికి మతం ఉండదు సరే. మరి అన్నానికి కులం ఉంటుందా? మతం ఉండనప్పుడు కులం కూడా ఉండకూడదు. కానీ వీర కమ్యూనిస్టు లిబరల్ (ఇదొక శాకాహార మాంసాహారం, అహింసాపూరిత రక్తపాతం లాంటి పదం. కమ్యూనిస్టులు లిబరల్స్ ఎప్పటికీ కాజాలరు. కానీ మనదేశంలోని అనేకానేక విడ్డూరాల్లో ఇదొకటి. ఇక్కడ కమ్యూనిస్టులే లిబరల్స్ మరి), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్ కి కర్నాటక, తమిళ నాడుల్లో అమ్ముడయ్యే “బ్రాహ్మిన్ సాంబార్ పౌడర్” ఘాటు నషాళానికి అంటింది. కులతత్వాన్ని ప్రోత్సహించే ఈ సాంబార్ బ్రాండ్ ను నిషేధించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అన్నానికి మతం లేనప్పుడు కులం కూడా ఉండదు కదా! కానీ “తమ కంపు, తమకింపు” పాలసీని బాగా ఒంటబట్టించుకున్న ఈ వితండవాదుల ప్రకారం తాము చేస్తే సంసారం. ఇంకొకరు చేస్తే వ్యభిచారం.

ఢిల్లీ లోని ఎయిర్ కండిషన్ హోటళ్లలో కాసింత తాలిబానీ తాళింపు వేసిన సైద్ధాంతిక చైనీస్ నూడుల్స్ తింటూ, మిషనరీ మామిడి పచ్చడి నంజుకుంటూ “అంతర్జాతీయవాదం మాట్లాడే ఇలాంటి నందినీ సుందర్లు తమ హిందూ ద్వేషానికి బ్రాహ్మణ ద్వేషపు రంగు వేయడంలో సిద్ధహస్తులు. ఇలాంటి వారికి హరేకృష్ణ ఉద్యమం వారు శాకాహారాన్ని ఉచితంగా అక్షయ పాత్ర పథకం ద్వారా పేద విద్యార్థులకు పెట్టి ఆకలి తీరుస్తూంటే అందులో మతం కనిపిస్తుంది. కానీ హలాల్ సర్టిఫికేషన్ తో కూడిన ఆహారాల్ని అమ్మకం చేస్తున్నప్పుడు మాత్రం మతం కనిపించదు. హలాల్ అంటే ఇస్లామిక్ పద్ధతిలో జంతువులను చంపి, వంట చేయడం అన్న మాట. ఇది ముఖ్యంగా మాంసాహారానికి వర్తిస్తుంది.

నిజానికి అక్షయ పాత్ర సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో ప్రశంసించారు. వారి సేవలకు గుర్తింపుగా గాంధీ శాంతి బహుమతి కూడా లభించింది. కానీ అక్షయపాత్ర సేవలంటే మన ఉదారవాదులకు భగభగ మండుతుంది. అక్షయ పాత్రను ఎలాగోలా మధ్యాహ్న భోజనపథకం నుంచి పక్కకు తప్పించడమే జీవన ధ్యేయంగా వీరంతా పనిచేస్తున్నారు.

ఇంకో విషయాన్ని కూడా గమనించండి! హలాల్ ఆహారం కేవలం ముస్లిం మాత్రమే వండడానికి అర్హుడు. అంటే హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ ఇండస్ట్రీలో ముస్లిమేతరులకు చెఫ్ ఉద్యోగం చచ్చినా రాదు గాక రాదు. ఇది మత వివక్ష కాదా? పైగా హలాల్ ను నమ్మని హిందువులకు కూడా బలవంతంగా హలాల్ ఆహారం తినిపించడం భోజన భుక్కుల మతపరమైన హక్కులకు భంగం కాదా? అందుకే ఈ బలవంతపు హలాల్ ఫుడ్ కి వ్యతిరేకంగా ఝట్కా సర్టిఫికేషన్ అథారిటీ అనే సంస్థ కూడా పుట్టుకొచ్చింది.

ఏది ఏమైనా వంటలకు కులం అంటగట్టడం మన మడికట్టుకున్న కమ్యూనిస్టులకే చెల్లింది. ఏ అస్పృశ్యత, కుల వివక్షలను వ్యతిరేకిస్తున్నట్టు వారు ఇన్నాళ్లూ నటిస్తున్నారో ఆ ముసుగు బయటపడింది. ఈ వామపక్ష బూటకపు ముసుగును తొలగించిన బ్రాహ్మిన్ సాంబార్ పౌడర్ తో సాంబార్ చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని, కాసింత నెయ్యి వేసుకుని, అప్పడం, ధప్పళాలతో సహా హాయిగా తినేయండి.-రాకా సుధాకర్ (సీనియర్ జర్నలిస్ట్) ....