ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది?

Nov 04, Mon 2019 05:06 AM In Focus

బంగాళాఖాతంలోని విశాఖ తీరాన్ని ఆనుకుని రాజకీయ ఇసుక తుపాను రేగుతోంది. విశాఖ సాగర తీరం వెంబడి సాధారణంగా అల్పపీడనాలు, తుపాను లు ఏర్పడటం సహజమే. కానీ ఈసారి మాత్రం విశాఖ తీరంలో ఇసుక తుపాను అలజడి సృష్టిస్తోంది. సహజంగా ప్రకృతి విపత్తుల కారణంగా తుపాను ఏర్పడుతుంటాయి.. కానీ ఈ ఇసుక తుపాను మాత్రం రాజకీయ పార్టీలు రగిలిస్తున్నాయి. ఇసక కొరత నెలకొన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దానిపైనే ఫోకస్ పెట్టాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యను చెప్పుకున్నారు. దీంతో పార్టీలో కొందరు ముఖ్యలతో చేర్చించిన తర్వాత ఇసుకపై ఏకంగా ఉద్యమం చేయాలని పవన్ నిర్ణయించారు. అంతేకాదు విశాఖలోనే లాంగ్ మార్చ్ నిర్వహించారు. దీంతో రాజీయ పార్టీల్లో అలజడి మొదలైంది.

భవన నిర్మాణానికి అనుబంధంగా ఉండే 40 రంగాలవారికి పని దొరకడమే గగనమవుతోంది. ప్రభుత్వం గతంలో ఉన్న ఇసుక తవ్వకాలను జూన్‌ నుంచి ఆపేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా టన్ను రూ. 375కే ఇసుక ఇస్తామని చెప్పినా.. భారీ వర్షాలు, వరదల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో ఇసుకకు డిమాండుతో పాటే ధర భారీగా పెరిగి నిర్మాణాలన్నీ నాలుగైదు నెలలుగా స్తంభించిపోయాయి. దీని ప్రభావం పలు రంగాల కార్మికుల బతుకులపై పడింది.

మట్టిపని చేసే కూలీలు, తాపీమేస్త్రీలు, కూలీలు, రాడ్‌బెండింగ్‌ మేస్త్రీలు, సెంట్రింగ్‌ మేస్త్రీలు, సామగ్రి మోసే కూలీలు, సీలింగ్‌ పనిచేసేవారు, విద్యుత్‌ పాయింట్లు పెట్టేవారు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, ఫ్లంబర్లు, టైల్స్‌ పని చేసేవారిపై ప్రభావం పడింది.

భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారి సంఖ్య ఎంత?

రాష్ట్రంలో వివిధరంగాల్లో పనిచేసే కార్మికులు లక్షల్లో ఉన్నారు. కార్మికశాఖలో 59 విభాగాల కార్మికులను నమోదు చేసుకుంటారు. ఇలా నమోదైనవారు 19.46 లక్షల మంది. పేర్లు నమోదుచేసుకోని భవన నిర్మాణ కార్మికులు మరో 30 లక్షల మంది ఉంటారు. వారితో కలిపి మొత్తం కార్మికులు సుమారుగా 50 లక్షల మంది ఉంటారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికశాఖ అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే.. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2.50 లక్షల మంది కార్మికులున్నారు. గుంటూరులో 2.32 లక్షలు, కృష్ణాలో 2.17 లక్షలు, విశాఖలో 1.86 లక్షలు, పశ్చిమగోదావరిలో 1.69 లక్షలు, చిత్తూరులో 1.57 లక్షల మంది కార్మికులుంటారు. వీరంతా ఇబ్బందుల్లోనే ఉన్నారు.