NationalistHub - ఆర్టీసీ ఉద్యోగుల సెల్ఫ్ డిస్మిస్ సాధ్యమా?
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
ఆర్టీసీ ఉద్యోగుల సెల్ఫ్ డిస్మిస్ సాధ్యమా? img



Share via Whatsapp web

అక్టోబర్ 5న మొదలైన టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు డ్యూటీలో చేరని ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్టూ ప్రకటించారు. అయినా వెరవని ఆర్టీసీ జేఏసీ....సమ్మె చేసి తీరతామని ప్రకటించింది. మరింత పట్టుదలతో సమ్మెను తీవ్రం చేసింది. ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ హైకోర్టు సైతం జోక్యం చేసుకుని ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని సూచించింది. అక్టోబర్ 19వతేదీన 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని సమయాన్ని నిర్దేశిస్తూ ప్రభుత్వానికి తీవ్ర స్వరంతో సూచనలు చేసింది. ఆర్టీసీ ఎండీ నియామకం విషయంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినపుడు, పాఠశాలల సెలవులు ఎందుకు పొడగించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఇంత జరిగినా ప్రభుత్వం మాత్రం....హైకోర్టు సూచనలు పట్టించుకోకుండా...చర్చలకు ససేమిరా అన్న నేపథ్యంలో అక్టోబర్ 19న తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగిందని పత్రికలు కథనాలు ప్రచురించాయి...

ఈ నేపథ్యంలో నిజంగానే ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తారా? తొలగింపు సాధ్యాసాధ్యాలేంటి? అన్న సందేహాలు వస్తున్నాయి.

ఉద్యోగుల తొలగింపు ఎందుకు అసాధ్యమో చెపుతూ....గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ కు పెద్దగా స్పందన రాలేదు. సమ్మె మరింత తీవ్రమైంది. మరోవైపు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టూ ఆర్టీసీ రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని కరాఖండిగా తేల్చి చెప్పాయి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు. దీంతో ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. తామెవరినీ తొలగించలేదనీ....విధుల్లోకి రాని వారు స్వచ్ఛందంగా తొలిగిపోయినట్టే కాబట్టి రాత పూర్వక ఉత్తర్వులు అక్కరలేదని ప్రకటించింది.

రాత పూర్వక ఉత్తర్వులు లేకుండా ఉద్యోగుల తొలగింపు సాధ్యం కాదు. ఇది సర్వీస్ రూల్స్ తెలిసిన వారికెవరికైనా అర్థమయ్యే విషయం. ఉద్యోగుల తొలగింపునైనా, సస్పెన్షన్నైనా...సర్వీస్ బుక్ లో విధిగా నమోదుచేయాల్సిందే. ఇదేదీ లేకుండా తొలగింపు సాధ్యం కాదు. రాత పూర్వకమైన తాఖీదు, ఉత్తర్వు లేకుండా ప్రభుత్వ చర్యలు చెల్లవు.

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె అనుభవాన్ని చూద్దాం....

తమిళనాట జయలలిత అధికారంలో ఉండగా 2003, జూలై 1న లక్షా డెబ్భై వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు సమ్మెకు దిగారు. వీరికి మద్దతుగా వివిధ శాఖలకు చెందిన సుమారు 13లక్షల మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. పాలన మొత్తం స్తంభించిపోయింది. దీంతో నాటి సీఎం జయలలిత సమ్మెను తీవ్రంగా పరిగణించింది. ఆనాటి సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు తెలపడం, ఉద్యోగ సంఘాలు జయలలితపై తీవ్ర విమర్శలకు దిగడంతో ఘాటుగా స్పందించింది జయలలిత. జూలై 4న టెస్మా -తమిళనాడు ఎమర్జెన్సీ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించింది. ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

చివరికి జూలై 21న సుప్రీం కోర్టులో జస్టిస్ ఎం.బి.షా, జస్టిస్ ఏ.ఆర్. లక్ష్మణన్ ల ద్విసభ్య ధర్మాసనం హింసాత్మక సంఘటనల్లో పాల్గొనని ఉద్యోగుల నుంచి తాము ఇక సమ్మెకు దిగబోమంటూ సమ్మతి పత్రం అంటే అండర్ టేకింగ్ లెటర్ తీసుకుని విధుల్లో చేర్చుకోవాలని తీర్పు ఇచ్చింది. దీంతో జయలలిత ప్రభుత్వం తీసుకున్న తీవ్రమైన ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. కార్మికులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యలు పరిష్కరించాలే తప్ప టెస్మా లాంటి చట్టాలు ప్రయోగిస్తామనడం సమంజసం కాదంది జస్టిస్ ఎం.బి.షా, జస్టిస్ ఏ.ఆర్. లక్ష్మణన్ ద్విసభ్య ధర్మాసనం. కార్మికుల సమ్మె వారి అనివార్యమైన ఆక్రందనగా గుర్తించాలని తీర్పుచెప్పింది.

నిజానికి తమిళనాడులో సమ్మె చేసినవారు ప్రభుత్వ ఉద్యోగులు. అంటే పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి రారు. అంటే వారికి సమ్మె తరహా హక్కుల పరిధి చాలా తక్కువ.

తెలంగాణ ఆర్టీసీ లేదా ఇతర రాష్ట్రాల్లో అయినా, ఏపీ మినహాయిస్తే....రోడ్డు రవాణా సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నా పారిశ్రామిక వివాదాల చట్టం-1947 పరిధిలోకి వస్తుంది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె హక్కు అన్నది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎం.అహ్మది 1994లో ఓ తీర్పు సందర్భంగా...‘‘RIGHT TO STRIKE IS INALIENABLE RIGHT OF A WORKER’’ అంటే సమ్మెహక్కును కార్మికుడి నుంచి వేరు చేయలేమని స్పష్టం చేశారు.

తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలోనే వర్తించని చట్టాలు....పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి వచ్చే సంస్థలోని ఉద్యోగులను ఉన్న ఫళంగా తొలగించడం సాధ్యం కాదని సుప్రీం తీర్పు చెప్పింది. కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అనివార్యంగా ఆశ్రయించే హక్కు అని వ్యాఖ్యానించింది. అక్కడితో ఆగలేదు...సమ్మె చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాత్రమే కాదు అది కార్మికుల ప్రాథమిక హక్కు అని కూడా తీర్పులో స్పష్టం చేసింది.

మరో ఉదాహరణ చూద్దాం. తమిళనాడులో 1978లో ఎం.జీ.రామచంద్రన్ సీఎంగా ఉండగా ట్రాన్స్ పోర్ట్ కార్మికులు సమ్మెకు దిగారు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించినట్టే....అప్పటి ఎంజీఆర్ ప్రభుత్వం కూడా వ్యవహరించింది. సమ్మెకు దిగిన కార్మికులతో చర్చలు చేయకుండా ప్రైవేటు డ్రైవర్లతో రవాణా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది ప్రభుత్వం. లైసెన్స్ ఉన్నవారెవరైనా వచ్చి ఆర్టీసీలో చేరాలని స్వయంగా ముఖ్యమంత్రే పిలుపు ఇచ్చారు. అయితే ఉద్యోగులను మాత్రం తమిళనాడు ప్రభుత్వం తొలగించలేదు.

ఒక వేళ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తే ఇదే అంశాన్ని రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించవచ్చు. అయితే, అలాంటి లిఖిత పూర్వక జవాబులు ఇచ్చే ప్రయత్నం చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. అంటే....రాత పూర్వకమైన ఆధారాలు సమర్పిస్తే ...అందుకు సంబంధించి చట్టపరమైన ప్రమాణాలు పేర్కొనాల్సి వస్తుంది. ఇది సాధ్యం కాదు కాబట్టే లిఖిత పూర్వకమైన ఆధారాలు సమర్పించలేదు. మరోవైపు ముఖ్యమంత్రి ఎక్కడా అధికారికంగా కార్మికుల తొలగింపు విషయాన్ని నేరుగా ప్రకటించలేదు.

పారిశ్రామిక వివాదాల చట్టం-1947 నిర్ద్వందంగా కార్మికుల సమ్మెహక్కును సమర్థిస్తుంది. దేశంలో సమ్మె చేసిన ఉద్యోగులను కేవలం సమ్మె కారణంగా ఉద్యోగాల నుంచి తొలగించిన దాఖలా లేదు.

అంటే ఒకే ఒక్క కలంపోటుతో 48వేల మంది ఉద్యోగాలను తొలగించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు, పారిశ్రామిక వివాదాల చట్టం కూడా ఇదే అంశాన్ని రూఢీ చేస్తున్నాయి.

మొత్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలకు ఢోకా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ....