NationalistHub - రహస్యాలు ఛేదించే ‘‘RAW’’
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
రహస్యాలు ఛేదించే ‘‘RAW’’ imgShare via Whatsapp web

RIGHT ANGLE: దేశ రాజధాని ఢిల్లీలో ఉంటుంది ఆ కార్యాలయం. విదేశీ రహస్యాలు ఛేదిస్తూ...శతృదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. లోధీ రోడ్డులోని ఆ కార్యాలయంలో అంతర్జాతీయ ఉగ్రవాదులు మొదలు, ఆర్థిక నేరస్థుల దాకా...వామపక్ష తీవ్రవాదుల ఉనికి మొదలు, విదేశీ ఏజెంట్ల కదలికల వరకూ సర్వం....క్షణం క్షణం రికార్డు అవుతూ ఉంటాయి.

అదే భారత అంతర్జాతీయ నిఘా సంస్థ ‘‘రా’’ కేంద్ర కార్యాలయం. రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ గా పిలిచే ఈ సంస్థ కార్యాలయంలో అడుగుపెడితే...గోప్యతకు నిర్వచనం తెలుస్తుంది. రహస్యానికి అర్థం అవగతమవుతుంది.

అయితే ఆ బిల్డింగ్ లోకి అడుగుపెట్టడం అంత సులువు కాదు. అందులో పనిచేసే ఉద్యోగి మాత్రమే ఆ భవనంలోకి ప్రవేశించే వీలుంటుంది. ‘‘రా’’ అధికారిక భవనంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ గదిలో ఏ అధికారి ఉంటాడో ఎవరికీ తెలియదు. పనిచేసే సిబ్బందికి సైతం అవసరమైన మేరకే వివరాలు తెలుస్తాయి తప్ప అందరికీ అన్నీ వివరాలు తెలియనివ్వరు.

జాయింట్ సెక్రటరీ కంటే పై అధికారుల గదుల ముందు మాత్రం ఒక డోర్ మ్యాట్, రెండు పూల కుండీలు ఉంటాయి. అంటే అదో సింబల్ అన్నమాట.

రా అధికారులైనా, ఉద్యోగులైనా తమ రోజు వారీ సంభాషణల్లో RAW అనే పదాన్ని అస్సలు వాడరు. ఒక వేళ వాడాల్సి వచ్చినా R&W అని మాత్రమే వాడతారని సమాచారం. ఇందుకు ఓ కారణం ఉందట. RAW అంటే అసంపూర్ణం అనే అర్థం వస్తుంది. అది నెగెటివ్ భావాన్ని సూచిస్తుంది కాబట్టి వాడరట.

1968లో ఏర్పడిన RAW భారత వ్యూహాత్మక భూభాగాలను రక్షించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వం విస్మరించిన Geographic Territoriesని రక్షించేందుకు కీలక ఎత్తుగడలను రచించింది.

అందులో భాగంగానే సిక్కీం విలీనంపై దృష్టి సారించింది.

అసలు సిక్కీం చరిత్ర, ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం....

హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రం సిక్కిం. 1642లో స్వతంత్ర రాజ్యంగా ఏర్పడి ఛోగ్యాల్‌ రాజుల ఏలుబడిలో ఉండేది. రాజరికపాలనలో 12 మంది రాజులు సిక్కింను పాలించారు. పాల్డెన్‌ తోండుప్‌ నంగ్యాల్‌ చివరి రాజు. 17వ శతాబ్దంలో భౌద్ధమతాన్ని తెచ్చిన టిబెట్‌ ఆరామాలతో వీళ్లకు అత్యంత సన్నిహితత్వం ఉంది. 18వ శతాబ్దంలో బ్రిటీష్‌ పాలకులు టిబెట్‌తో వర్తక వ్యాపారం కొనసాగించేందుకు సిక్కిం మీదుగా రహదారిని నిర్మించాలనుకున్నారు. అలా 1947 స్వాతంత్య్రం వచ్చే వరకు బ్రిటీష్‌ వారి పాలనలోనే కొనసాగుతూ వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా, రష్యా, అమెరికాల వ్యూహాత్మక ఎత్తుగడల మధ్య నలిగిన సిక్కీం భారత నిఘా సంస్థ ‘‘రా’’ పకడ్బందీ ప్రణాళికతో 1975లో భారత్ లో అంతర్భాగమైంది.

సిక్కీం విలీనం ఎలా సాధ్యమైంది...?

సిక్కీంకు ఆగ్నేయంలో భూటాన్, పశ్చిమాన నేపాల్, తూర్పున టిబెట్, దక్షిణాన బంగ్లాదేశ్…. మధ్యలో చికెన్ నెక్ లా కనిపించే ప్రాంతమే సిక్కిం. ఇది భారత్ కు అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. చైనా, భారత్ ల మధ్య స్ట్రాటజిక్ టెర్రీటరీ. ఈశాన్య రాష్ట్రాలకు గుమ్మం. సిక్కిం ఇండియాలో విలీనం కావటం వెనుక హాలీవుడ్ డ్రామాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ డ్రామాలో ముగ్గురు మహిళల పాత్ర ఉంది. ప్రధాని ఇందిరా, సిక్కీం రాజు భార్య హోప్ కుక్, సిక్కీం మొదటి సీఎంగా పనిచేసిన కాజీ లెండప్ దోర్జీ భార్య, బెల్జియం వనిత ఎలీసా మారియాలు సిక్కీం మెర్జర్ డ్రామాలో ప్రధాన పాత్రలు. ఈ మొత్తం డ్రామాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించింది RAW అధికారుల వ్యూహం.

చైనా దురాక్రమణ భయం కారణంగా1950లో సిక్కిం రాజు తాషీ నామ్ గ్యాల్ protectorate of India అని భారత్ తో ఒప్పందం చేసుకున్నారు. అంటే సుమారుగా కశ్మీర్ లాంటి వ్యవహారమే ఇది. ఈ ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశి వ్యవహారాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ భారత్ పరిధిలోకి వస్తాయి. మిగతా వ్యవహారాలు సిక్కీం అసెంబ్లీ పరిధిలో ఉండే విధంగా ఒప్పందం కుదిరింది.

1950లో ప్రిన్స్ లీ స్టేట్స్ విలీన సమయంలో సిక్కీం ఎందుకు భారత్ లో విలీనం కాలేదు అన్న సందేహం వెనక చైనా, రష్యాల వ్యూహాత్మక కారణాలున్నాయి. నెహ్రూ సంతృప్తీకరణ విధానం ఉంది. 1950ల నాటికి చైనా, రష్యాల మధ్య మైత్రి అత్యంత గాఢంగా ఉంది. 1949లో చైనా విప్లవం తర్వాత మావో-స్టాలిన్ లు భారత్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చైనా, రష్యాలకు కీలకంగా ఉన్న భారత్ సరిహద్దు ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు పాటించారు. తమకు అనుకూలంగా భారత్ లోని కమ్యూనిస్టులను సన్నద్ధం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నెహ్రూ ప్రభుత్వం రష్యాతో సన్నిహితంగా మెలిగింది. ఇందులో భాగంగానే చైనాకు కీలక వ్యూహాత్మక ప్రాంతమైన సిక్కీంను భారత్ లో విలీనం కాకుండా ఆపింది రష్యా.

1953లో స్టాలిన్ మరణం, చైనా కమ్యూనిస్టు పార్టీలో మార్పుల కారణంగా ఆ రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. దీంతో సహజంగానే అమెరికా భారత్ విషయంలో వైఖరి మార్చుకోవడం మొదలుపెట్టింది. 1961 చైనా-భారత్ యుద్ధం తర్వాత వ్యూహాత్మక భూభాగాల విషయంలో ఇరు దేశాలు ప్రత్యేక దృష్టి సారించాయి. సిక్కీం విలీనం మాత్రం సాధ్యం కాలేదు. అందుకు కారణం 1950లో సిక్కీం-భారత్ ల మధ్య జరిగిన protectorate of India ఒప్పందం. రష్యా, భారత్ మైత్రిని గమనించిన అమెరికా సీఐఏని పురమాయించింది. సీఐఏ హోప్ కుక్ అనే అమెరికా వనితను రంగంలోకి దింపింది. సిక్కిం రాజు చొగ్యాల్ ఆమెను 1963లో పెళ్లి చేసుకున్నారు. హోప్ కుక్ ద్వారా సిక్కీం అంతర్గత రహస్యాలు ఎప్పటికప్పుడు సేకరించడం ప్రారంభించింది అమెరికా.

అయితే అప్పటికింకా RAW పురుడు పోసుకోలేదు.

ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1968లో RAW ఏర్పడింది. ‘‘రా’’ ఏర్పాటు తర్వాత రెండు కీలక లక్ష్యాలను ఛేదించింది. అందులో మొదటిది 1971 బంగ్లా విభజన, రెండోది సిక్కీం విలీనం.

అప్పట్లో ఇందిరాగాంధీ భారత ఉపఖండంలో తిరుగులేని నేత అన్న ప్రచారం జరిగింది. అయితే సిక్కీం విలీనంలో ఇందిరాగాంధీ పాత్ర కన్నా RAW, సైన్య, ఐబీల పాత్ర ప్రధానమైందంటారు అంతర్జాతీయ నిపుణులు. నాటి RAW చీఫ్ రామేశ్వర్‌నాథ్ కావ్ పకడ్బందీ ప్రణాళిక రచించి రా అధికారి జీ.బీ.ఎస్.సిద్దూను రంగంలోకి దింపారు.

1973లో జీ.బీ.ఎస్.సిద్దూ గ్యాంగ్ టక్ లో కాలుమోపి రాజకీయంగా భారత్ అనుకూల ప్రజా ఉద్యమాన్ని రగల్చడంలో విజయం సాధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సిక్కీం రాజ దంపతుల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ఇది విడాకులుకు దారి తీసింది. తర్వాత రోజుల్లో హోప్ కుక్ సీఐఏ ఏజెంట్ అని రా గుర్తించింది. భారత్ లో సిక్కీం విలీన ప్రక్రియ మొదలవ్వగానే తన ఇద్దరు పిల్లలతో హోప్ కుక్ గ్యాంగ్ టక్ వీడి న్యూయార్క్ కు వెళ్లిపోయింది. సిక్కీం విలీనంలో RAW ఎలాంటి పాత్ర పోషించిందో జీ.బీ.ఎస్ సిద్దూ తన ‘‘సిక్కీం-డాన్ ఆఫ్ డెమోక్రసీ’’ పుస్తకంలో సవివరంగా రాశారు.

మరోవైపు సిక్కీం విలీనంలో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కాజీ లెండప్ దోర్జీ భార్య, బెల్జియం వనిత ఎలీసా మారియా పాత్రను తక్కువ అంచనావేయలేం. ఇదే అంశాన్ని ఆ సమయంలో భూటాన్ దౌత్యవేత్తగా పనిచేసిన బి.ఎస్.దాస్ రాసిన ‘‘ది సాగా ఆఫ్ సిక్కీం’’ పుస్తకంలో స్పష్టంగా చూడొచ్చు. సిక్కిం రాజు చొగ్యల్ అమెరికా వనిత హోప్ కుక్ ల మధ్య విభేదాలు సృష్టించేందుకు RAW ఎలీసా మారియా సాయం తీసుకున్నదన్న వాదనలూ ఉన్నాయి. మొత్తంగా RAW అవకాశమున్న అన్ని ప్రయత్నాలూ చేసింది. వ్యూహాత్మక భూభాగాన్ని భారత్ లో విలీనం చేసింది.

1975, మే 16న అంటే ఎమర్జెన్సీకి సరిగ్గా నెల రోజుల ముందు సిక్కీం భారత్ లో విలీనమైంది. రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు విషయాన్ని ముందే అంచనా వేసింది RAW. నాటి అలహాబాద్ హైకోర్టు జడ్జీని ఈ కేసు విషయంలో రహస్యంగా RAW అధికారులు సంప్రదించినట్టూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సిక్కీం విలీనాన్ని త్వరగా ముగించేలా పథక రచన చేసి, అనుకున్న సమయానికి తన లక్ష్యాన్ని ఛేదించింది ‘‘రా’’.

ఇదీ సిక్కీం విలీనం వెనుక ఉన్న రియల్ స్టోరీ....

స్వార్థ రాజకీయాలు...అంతర్జాతీయ కుట్రల మధ్యలో దేశ సమగ్రతను కాపాడటంలో చిక్కుల్ని, ఒడిదుడుకుల్ని అధిగమిస్తూ.....పనిచేస్తున్న ‘‘రా’’ అధికారులకు ‘‘నేషనలిస్ట్ హబ్’’ సెల్యూట్..... ....