NationalistHub - భారత్ గ్రాండ్ స్ట్రాటజీ - ‘‘హౌడీ మోదీ’’
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
భారత్ గ్రాండ్ స్ట్రాటజీ - ‘‘హౌడీ మోదీ’’ imgShare via Whatsapp web

RIGHT ANGLE:

‘హౌడీ మోదీ’ అంటూ అమెరికా నినదించింది. టెక్సాస్‌ మినీ భారత్‌ ను తలపించింది. హ్యూస్టన్‌ నగరం త్రివర్ణ శోభితమయింది. హౌడీ మోదీ ఈవెంట్ తో భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా నిలిచింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాల్గొన్న హౌడీ మోదీ ఈవెంట్ ఘనంగా జరిగింది. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్‌ ఇండియా ఫోరం నిర్వహించిన హౌడీమోదీ ఈవెంట్ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో కనీవినీ ఎరుగని రీతిలో కనువిందు చేసింది. స్టేడియం సాంతం మోదీ, మోదీ నినాదాలతో దద్దరిల్లింది. ట్రంప్‌ ప్రసంగిస్తున్నంత సేపు ‘యూఎస్‌ఏ.. యూఎస్‌ఏ’ అంటూ సభికులు చేసిన నినాదాలతో మారుమోగింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో సెప్టెంబర్ 22న హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్‌ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అంటూ గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్‌ ట్రంప్‌ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు.

మొదట మోదీ ప్రసంగించి, ట్రంప్‌ ను భారత్‌కు నిజమైన స్నేహితుడంటూ సభికులకు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్‌ ప్రసంగించారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. ‘వి.. ద పీపుల్‌’ అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని గుర్తు చేశారు ట్రంప్.

భారీ జనసందోహం, మోదీ.. మోదీ అంటూ గొంతులు బొంగురుపోయేలా జనాల అరుపులు, రంగురంగుల వెలుగులు, సంగీతం, డ్యాన్స్.. బాలీవుడ్ స్టార్స్ కూడా అసూయపడేంత అద్భుతంగా సాగింది హౌడీ మోదీ ఈవెంట్. నరేంద్ర మోదీకి తప్ప మరెవరికీ అమెరికా లాంటి దేశంలో ఇంతటి ఆదరణ కనిపించలేదు. అమెరికన్ ఇండియన్ సొసైటీపై మోదీకి ఉన్న పట్టు ఈ సభతో మరింత స్పష్టమైంది.

అంతర్జాతీయంగా, రాజకీయంగా తమ ఇమేజ్‌ను పెంచుకోవడం, ప్రత్యర్థి దేశాలకు వ్యూహాత్మకంగా సంకేతాలు పంపడం, ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులకు సంబంధించి ఉన్న అవరోధాలను తొలగించుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం లో ఏకమవ్వడం ప్రధాని మోదీ ప్రధాన లక్ష్యాలు.

హ్యూస్టన్‌లో ఇంధన సంస్థల ప్రతినిధులతో మోదీ జరిపిన మొదటి భేటీలోనే అమెరికన్ సంస్థ టెల్లారియన్ నుంచి ఏటా 50 లక్షల టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) దిగుమతి చేసుకునేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సమతౌల్యం లేదంటోన్న ట్రంప్‌కు ఇది ఉపశమనం కలిగించింది.

అబ్ కీ బార్.. ట్రంప్ సర్కార్ అంటూ మోదీ మద్దతు ప్రకటించడం.. ట్రంప్‌ను ఆనందంలో ముంచెత్తింది. అమెరికాకు అత్యంత విధేయత కలిగిన, నమ్మకమైన స్నేహితుడంటూ ట్రంప్ సైతం మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకూ ‘‘హౌడీ మోదీ’’ ఈవెంట్ వెనుక ఉన్న గ్రాండ్ స్ట్రాటజీ ఏంటి? ఈ చిక్కుముడి ప్రపంచ దేశాల వ్యూహకర్తలను చికాకు పెడుతోంది. ప్రపంచంలోని పెద్ద దేశాలంటూ గొప్పలు చెప్పుకునేవన్నీ రకరకాల చిక్కుల్లో ఉన్నాయి. చైనా, జపాన్, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు...ప్రధానంగా రెండో ప్రపంచయుద్ధం తర్వాత కీలక పాత్ర పోషించిన దేశాలన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థిక, సైనిక సంక్షోభాలకు పరిష్కారం వెతకలేక నానా అగచాట్లు పడుతున్నాయి.

ఏడాది క్రితమే ‘‘హౌడీ మోదీ’’ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు నిర్వాహకులు. అప్పటికి భారత్ లో ఎన్నికలు జరగలేదు. ప్రధాని మోదీ మరోసారి గెలుస్తారో లేదో తెలియదు. అయితే దేశ విధాన నిర్ణయాలు చేస వ్యూహకర్తలకు మాత్రం భారత్ లో మోదీ అధికారంలోకి వస్తారని తెలుసు. 2020లో ట్రంప్ మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపడతారనీ తెలుసు.

90ల తర్వాత భారత్ మరోసారి తన కాళ్లపై తానే నిలుచుంది. డెబ్భై ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటోంది. అమెరికా ముందు వినయంతో కాకుండా గర్వంగా నిలుచుంది భారత్. సరిగ్గా ఇదే సందర్భంలో అమెరికా సైతం భారత్ ఎదుగుదలను తీక్షణంగా చూస్తోంది. స్వతంత్రంగా నిలదొక్కుకుంటున్న భారత్ మాత్రమే వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా గట్టిగా నమ్ముతోంది.

అంత మాత్రమే కాదు రాబోయే రోజుల్లో భారత్ తీసుకోబోయే సంచలనాత్మకమైన నిర్ణయాల విషయంలో సైతం అమెరికా మద్దతు అవసరమని భారత్ కూడా భావిస్తోంది. ముఖ్యంగా పీఓకే స్వాధీనం, అఖండ్ భారత్ నిర్మాణం లాంటి సుదీర్ఘ లక్ష్యాల సాధన కోసం అమెరికాతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా పీఓకే స్వాధీనం విషయంలో ఐక్యరాజ్య సమితి నుండి ఆటంకం లేకుండా ఉండాలంటే అమెరికాతో సఖ్యత అవసరమన్నది భారత్ వ్యూహం. 2020లో ట్రంప్ అధికారంలోకి రావడం, 2023లో భారత్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఇరు దేశాల ప్రయోజనాల కోసమే అన్నది నిపుణుల అంచనా.

మొత్తంగా ‘‘హౌడీమోదీ’’ ఈవెంట్ కేవలం దౌత్యపరమైన వ్యూహం మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో భారత్ తీసుకోబోయే నిర్ణయాలకు అమెరికా మద్దతు కూడగట్టుకోవడం కూడా అన్నదే కీలకం. మరోవైపు అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో ట్రంప్ కు అమెరికన్ భారతీయుల ఓట్ల అవసరం కూడా అగ్రరాజ్యాన్ని డిపెండెంట్ గా మర్చిందని చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత్ సగర్వంగా నిలబడిన సందర్భం ఏదైనా ఉందంటే అది ‘‘ హౌడీ మోదీ’’ అని చెప్పక తప్పదు. ....