NationalistHub - ఛలో ఆత్మకూర్ పిలువు వెనుక అసలు కథ !
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
ఛలో ఆత్మకూర్ పిలువు వెనుక అసలు కథ ! imgShare via Whatsapp web

RIGHT ANGLE

An Every Political Activity, Has It’s Own Drama…అనేది రాజనీతి సిద్ధాంత కర్తల ఊవాచ.

ఎన్నికలు ముగిసిన వందరోజుల తర్వాత రెండుపార్టీల మధ్యన ఒక ఆసక్తిదాయకమైన పోరాటం మొదలైంది. ఇందులో ఎవరికి వారు తమదే పైచేయి అని ప్రకటించుకుంటూ ఉన్నారు. చలో ఆత్మకూర్ సూపర్ హిట్ అని తెలుగుదేశం అనుకూల వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబును ఇంటి నుంచి బయటకే రానీయలేదు.. అలాంటిది ఆ కార్యక్రమం ఎలా హిట్ అవుతందని వైసీపీ వాదిస్తోంది.

భౌగోళికంగా పలనాడు సారవంతమైన భూములున్న ప్రాంతం కాకపోయినా....రాజకీయాలకు మాగాణమే. 80ల ప్రాంతంలో మొదలైన ఫ్యాక్షన్ గొడవలకు...రాజకీయ పార్టీల అవకాశవాదం తోడైన తర్వాత పలనాడు నిరంతరం వార్తల్లో ఉంటూనే ఉంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఛలో ఆత్మకూరు కు పిలుపునివ్వడంతో అందరి చూపు ఆ గ్రామం వైపు మళ్లింది. అసలింతకీ ఆత్మకూర్ లో ఏం జరిగింది.. చంద్రబాబు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? ఛలో పల్నాడు నిర్వహించాలని నిర్ణయానికి రావడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? చూద్దాం.

పలనాడు రాజకీయ వేడికి అసలు కోణాల్ని బయటపెట్టకుండా...రాజకీయ కక్ష అని ఒకరు, చంద్రబాబు వల్లే ఇలాంటి పరిస్థితులంటూ మరొకరు విమర్శించుకుంటున్నారు.

ఈ రాజకీయ వివాదంలో మూడు కారణాలు స్పష్టంగా చెప్పొచ్చు.

మొదటిది సరస్వతి సిమెంట్స్ భూముల వివాదం:

రెండు: పల్నాడు ఫ్యాక్షన్ వివాదాలు:

మూడు: ఈ రెండు వివాదాల్లో కీలకంగా మారిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఈయన్ను మైనింగ్ శీను అని కూడా అంటారు. 1994, 2009, 2014 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు ప్రాంతంలో ఉన్న మైనింగ్ ను దేనినీ వదలేదల్లేదనే విమర్శలున్నాయి. కేశానుపల్లి, కొండమోడు, పిడుగురాళ్ల,నడికుడి, దాచేపల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కు ఆయన పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన సీబీసీఐడీ సయితం నిర్ధారించింది. ప్రాధమిక ఆధారాలు కూడా లభ్యం కావడంతో ఏపీ ప్రభుత్వం యరపతినేని అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది.

అసలు వివాదం మొదలైంది ఇక్కడే:

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలనాడులో ‘‘సరస్వతి సిమెంట్స్’’ కంపెనీకోసం 903 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. అక్రమాస్తుల కేసులో సరస్వతి సిమెంట్స్ కు చెందిన ఈ 903 ఎకరాల భూమిని ఈడీ 2017 సెప్టెంబర్ లో జప్తు చేసింది. అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకొంది. వీటి విలువ సుమారు రూ.318 కోట్లు.

యరపతినేని అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలని యోచిస్తున్న సమయంలోనే, సరస్వతి కంపెనీకి భూములు అమ్మిన రైతులు హఠాత్తుగా పంటలు వేసుకుంటామంటూ ప్రత్యక్షమయ్యారు.

సూపర్ డ్రామా ఇక్కడే మొదలైంది....

మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్స్‌కు భూములు అమ్మిన రైతుల్లో కొందరు పత్తిపంటను వేయగా, దానిని తొలగించేందుకు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు ఈనెల 8వ తేదీన ప్రయత్నించారు. దీనిని నిలువరించేందుకు రైతులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగారు. భూములు అమ్మినవారిలో చెన్నాయపాలెం గ్రామానికి చెందిన బండ్ల గురులక్ష్మి కూడా ఉన్నారు. ఆమె మూడు ఎకరాలు అమ్మారు. ఈ క్రమంలో 8వ తేదీన సిమెంట్ కంపెనీ ప్రతినిధులు తన భూమిలోని పంటను తొలగిస్తున్నారని తెలుసుకుని గురులక్ష్మి కిరోసిన్ డబ్బాతో పొలానికి చేరుకొని సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగింది.

ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రోద్బలంతో ఆమె కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు దిగిందని ఆరోపణలున్నాయి. దీనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఈ సంఘటన తర్వాత టీడీపీ నేతలు సరస్వతీ సిమెంట్స్ ప్రతినిధులపై, వారికి మద్దతుగా వచ్చిన వారిపై మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. మరికొన్ని ఫిర్యాదులు రైతులపై నమోదయ్యాయి. పొలాలు అమ్మి, డబ్బులు తీసుకున్న పదేళ్ల తర్వాత తిరిగి పంటలు వేసుకుంటాననడం సమంజసం కాదన్నది సిమెంట్ కంపెనీ వాదన.

ఈ మొత్తం వ్యవహారంలో అటు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, వారి మద్దతుదారులు మరోవైపు రైతులు, టీడీపీవారిపై కేసులు నమోదయ్యాయి.

ఇక పల్నాడు ఫ్యాక్షన్ వివాదాల గురించి చూద్దాం. గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరులో ఆది నుంచీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఉన్నాయి. ఫ్యాక్షన్‌ గ్రామంగా పోలీసు రికార్డులకెక్కిన గ్రామమిది. గ్రామంలోని ఎస్సీలు టీడీపీ, వైసీపీ వర్గాలుగా విడిపోయారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే టీడీపీ , వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆ సంఘటనతో 70 టీడీపీ కుటుంబాలు వేరే గ్రామాలకు వెళ్లిపోయాయి. ఈ కుటుంబాలన్నీ దుర్గి, వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని బంధువుల ఇళ్ళల్లో తలదాచుకుంటున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లాలోని వినుకొండ, నరసారావు పేట ప్రాంతాల్లో గతంలో తహశీల్దార్లు వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని లంచాలు తీసుకుని ధారాదత్తం చేశారు. నూజెండ్ల తలార్లపల్లెలో వంద ఎకరాల ప్రభుత్వం భూమి అన్యాక్రాంతమైంది. దీంతో వైసీపీ ప్రభుత్వం సంబంధిత అధికారులను విధులనుంచి తొలిగించింది.

ఓవైపు యరపతినేని అక్రమ మైనింగ్ కేసు, మరోవైపు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల వివాదం నేపథ్యంలో టీడీపీ ఇరకాటంలో పడింది. దీన్నుంచి గట్టెక్కేందుకు పలనాడు ఫ్యాక్షన్ కేసులు, సరస్వతి సిమెంట్స్ భూముల కేసుతో సస్పెండ్ అయిన తహశీల్దార్ల వివాదాన్ని కలిపి కుట్టి దళితులపై ప్రభుత్వ దాడిగా చిత్రీకరించడంలో భాగంగానే ‘‘ఛలో ఆత్మకూర్’’ పిలుపు తెరపైకి వచ్చింది.

....