అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే పలు హోదాల్లో భారత సంతతికి చెందిన వారు పదవుల్లో ఉన్నారు. తాజాగా భారత, అమెరికా సంతతికి చెందిన డాక్టర్ ఆర్తి ప్రభాకర్‌ను వైట్‌హౌజ్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు.
సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణపై బైడెన్ సర్కార్ దృష్టి పెట్టింది. ఒకవేళ సేనేట్‌లో ఆమోదం దక్కితే, అప్పుడు బైడెన్‌కు చీఫ్ సైన్స్ అడ్వైజర్‌గా డాక్టర్ ఆర్తి విధులు నిర్వర్తిస్తారు. డాక్టర్ ఆర్తికి ఆమోఘమైన జ్ఞానం ఉందని, ఇంజినీర్‌గా ఆమెను గొప్పగా గుర్తిస్తారని, ఫిజిసిస్ట్‌గా కూడా ఆమెకు ఎనలేని గుర్తింపు ఉన్నట్లు బైడెన్ తెలిపారు. కఠినమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతీయ అమెరికన్లకు పెద్ద పీట వేయనున్నట్లు బైడెన్ తన ప్రకటనలో తెలిపారు.
అమెరికాలో ఆవిష్కరణల బృందం చాలా శక్తివంతంగా ఉందని భావిస్తున్నాని, డాక్టర్ ఆర్తి ప్రభాకర్‌ను సేనేట్ ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓఎస్టీపీ చీఫ్‌గా డాక్టర్ అలోండ్ర నెల్సన్, తాత్కాలిక సైన్స్ సలహాదారుగా డాక్టర్ ఫ్రాన్సిస్ కొల్లిన్స్ కొనసాగనున్నట్లు బైడెన్ తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ(ఎన్ఐఎస్టీ) చీఫ్‌గా డాక్టర్ ప్రభాకర్ నియామకాన్ని సేనేట్ ఏకగ్రీవంగా ద్రువీకరించింది. డీఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా కూడా ఆమె చేశారు.
అమెరికా ప్రభుత్వానికి చెందిన రెండు రీసర్చ్ ఏజెన్సీల్లో డాక్టర్ ఆర్తి ప్రభాకర్ కీలక పదవుల్లో చేశారు. స్టార్టప్స్, కంపెనీలు, వర్సిటీలు, ల్యాబ్‌లు, ఎన్జీవోలతో ఆమె పనిచేశారు. ఇంజినీరింగ్‌తో పాటు అప్లైడ్ ఫిజిక్స్‌లో ఆమెకు విస్తృత అనుభవం ఉంది. ఆర్తి మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. తొలుత చికాగోలో ఆ తర్వాత పదేళ్ల వయసులో టెక్సాస్‌లో సెటిలయ్యారు. టెక్సాస్ టెక్ వర్సిటీలో ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసింది. కాలిఫోర్నియా వర్సిటీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ అందుకున్న తొలి మహిళ ఆమె. ఇదే వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేసింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఫెల్లోగా చేసిందామె.