More

    ప్రధానికి ఆర్మీ మేజర్ సర్‎ప్రైజ్..! గిఫ్ట్ చూసి అవాక్కయిన మోదీ..!

    ప్రతి ఏడాది లాగే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి పర్వదినాన్ని సైనికులతో జరుపుకున్నారు. అయితే ఈ ఆత్మీయ కలయిక ఒక ఆర్మీ మేజర్ కు మాత్రం చిరకాలంగా గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ మాటకొస్తే ప్రధాని మోదీకి కూడా ఇదో అందమైన జ్ఙాపకం. ఆ తీపి జ్ఞాపకానికి కార్గిల్ వేదికైంది. ఈసారి దీపావళి జరుపుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ యుద్ద భూమికి వెళ్ళారు. అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు. అయతే, మోదీ కలిసిన సైనిక బృందంలో మేజర్ అమిత్ కుమార్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ తమ ఆర్మీ పోస్టుకు చేరుకోగానే అమిత్ ఒక ఫోటో జ్ఞాపికను అందజేశారు. తాను పిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీతో దిగిన ఫోటో ఉంది. 2001లో ప్రధాని మోదీ గుజరాత్ కు సీఎంగా ఉన్నారు. అప్పట్లో గుజరాత్ సీఎం హోదాలో ఒక సైనిక స్కూలుకు మోదీ అతిధిగా వెళ్లారు. అక్కడ ప్రధాని వద్ద ఒక మెమెంటో స్వీకరిస్తూ.. అప్పట్లో ఒక విద్యార్థి ఫోటో దిగారు. ఆ ఫోటోలోని విద్యార్తే ఇప్పుడు సైనిక దళంలో మేజర్ అయ్యాడు. దీంతో తన చిన్న నాటి ఫోటోను ఫ్రేమ్ చేయించి ప్రధానికి బహూకరిస్తూ ఫోటో దిగాడు. ఈ అరుదైన ఘటనకు దీపావళి వేదికైంది.

    ప్రతియేటా దీపావళి రోజున ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో సెలెబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. దీపావళి రోజున ఎన్ని పనులున్నా మానుకుని ప్రధాని సైనికులతోనే గడిపి వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు మోదీ. తమ జీవితలో విలువైన సమయాన్ని వదులుకుని కుటుంబాలకు దూరంగా గస్తీ కాసే సైనికులకు.. ప్రధాని కాస్త ఆప్యాయతను పంచుతారు. ఇందులో భాగంగానే ఈసారి కార్గిల్ లో ప్రధాని పర్యటించారు. ఈ పర్యటనలో మోదీ సైనికులతో కలిసి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. సైనికులే నా కుటుంబమని అందుకే తాను దీపావళి జరుపుకోవడానికి మీవద్దకు వచ్చానని అన్నారు. సైనిక బలగాలే భారత్ భద్రతకు మూలస్తంభం అని ప్రధాని వ్యాఖ్యానించారు. కార్గిల్ దేశానికి విజయాన్ని అందించిందని ఇంతటి ధైర్యభూమిపై నుంచి భారత ప్రజలందరితో పాటు ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. కార్గిల్ లో విజయం సాధించిన తర్వాత నుంచి పాకిస్తాన్ భారత్ తో యుద్దం చేసేందుకు ధైర్యం చేయలేదని పేర్కొన్నారు. కార్గిల్ లో సైనికులు చూపిన ధైర్యసాహసాలను తాను కూడా స్వయంగా చూశానని ఆనాటి ఫోటోలను సైనికులతో పంచుకున్నారు.

    ఇక 2014లొ నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ ప్రతియేటా సైనికులతో దీపావళి జరుపుకుంటున్నారు. 2021లో నౌషేరా సెక్టార్లో 2020లో జైసల్మేర్ సెక్టార్ లలో సందర్శించారు. ఈ విధంగా ప్రతి దీపావళికి సైనికులతో గడపడమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా శతృదేశాలకు ధీటైన సందేశం సైతం ఇస్తున్నారు మోదీ. 2019లో భారత్ చైనాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు ఎల్ఓసీ దగ్గర ఉన్న రాజౌరీ సెక్టార్ లో పర్యటించి చైనాకు దీటైన సమాధానం ఇచ్చారు. ఇక తాజాగా చారిత్రాత్మక కార్గిల్ యుద్దభూమిని సందర్శించి పాకిస్తాన్ కు చురకలంటించారు. ఈ పర్యటనలో భాగంగా మేజర్ అమిత్ కుమార్ కు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.

    Trending Stories

    Related Stories