యాక్టివేట్ అయిన పీఎఫ్ఐ స్లీపర్ సెల్స్?

0
118

కేరళలోని కొల్లాం జిల్లాలో భారత ఆర్మీకి చెందిన ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వీపుపై ‘PFI’ అని రాశారు. పెయింట్‌ తో అతడి వీపు మీద ‘PFI’ అని రాశారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PFI.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ. ఈ సంస్థ చేసిన నేరాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తూ ఉంది. భారతదేశంలో ఎన్నో ఉగ్రదాడులలో పీఎఫ్ఐకు హస్తముందని ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం రాత్రి కడక్కల్‌లోని తన ఇంటి పక్కనే ఉన్న అడవిలో ఆరుగురు వ్యక్తుల బృందం తనపై దాడి చేసిందని ఆర్మీ జవాన్ షైన్ కుమార్ తన ఫిర్యాదులో తెలిపారు. అతని చేతులను కట్టివేసి, ఆకుపచ్చ పెయింట్‌తో అతని వీపుపై PFI అని రాశారు. షైన్ కుమార్ ఫిర్యాదు మేరకు కడక్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పీఎఫ్ఐ స్లీపర్ సెల్స్:

సెప్టెంబర్ 25న కేరళ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన 11 కేంద్రాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు నిర్వహించింది. మలప్పురం, ఎర్నాకులం, త్రిసూర్, వాయనాడ్ జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.

250 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసుల భద్రతతో కొచ్చి ఈడీ కార్యాలయ అధికారుల నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
పీఎఫ్‌ఐ నాయకుడు జమాల్‌ మహమ్మద్‌, లతీఫ్‌ పోకకిల్లం ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. మలప్పురంలోని ఎస్‌డీపీఐ నేత నూరుల్‌ అమీన్‌ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. నూరుల్ అమీన్ మూర్క్కనాడ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అరబిక్ టీచర్ గా ఉన్నాడు. మలప్పురం మంచిరి ఈస్ట్ కు చెందిన అబ్దుల్ జలీల్, కారపరంబుకు చెందిన హంజా ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. కేరళలోని పీఎఫ్‌ఐ స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యారని గుర్తించిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఉగ్రవాద కార్యకలాపాల కోసం వీరికి హవాలా డబ్బు అందిందని సమాచారం. గతంలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న నిందితులు ఈడీకి కీలక సమాచారం అందించారు. అందులో భాగంగానే ఈ సోదాలు చేపట్టారు.