ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రస్తుతం మంత్రి భౌతిక కాయం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలోనే ఉంది. అన్ని ప్రక్రియలు పూర్తైన అనంతరం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు. ఈ రోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, నేతల సందర్శనార్థం ఉంచుతారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గౌతమ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. హైదరాబాద్ కు చేరుకుని, అపోలో ఆస్పత్రిలోనే నివాళులు అర్పించనున్నారు. గౌతమ్ రెడ్డి కుమారుడు చదువు నిమిత్తం అమెరికాలో ఉంటున్నాడు. అతను వచ్చాకే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉండటంతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు జిల్లా బ్రాహ్మణ పల్లికి తరలించి, అభిమానుల సందర్శనార్థం రేపంతా అక్కడే ఉంచనున్నారు. ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆయన మరణంపై హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వైద్యులు ప్రకటన చేశారు. ఇంటి వద్ద నుండి గౌతమ్‌రెడ్డిని ఉదయం 7.45 గంటలకు అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారని ప్రకటనలో తెలిపారు. స్పందించని స్థితిలో ఆయనను హాస్పిటల్ కు తీసుకొచ్చారని, ఆసుపత్రికి వచ్చే సమయానికే శ్వాస ఆడటం లేదని చెప్పారు. ఐసీయూలో వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. ఉదయం 9.16 గంటలకు ఆయన కన్నుమూశారని వెల్లడించారు.