యూపీ ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ కు భారీ షాక్.. ఆమె బీజేపీలోకి

0
774

కొద్దిరోజుల కిందట పలువురు బీజీపీ నాయకులు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు ములాయం కోడ‌లు అప‌ర్ణ బీజేపీలో చేరడంతో బీజేపీలో నయా జోష్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు సమాజ్ వాదీ పార్టీకి భారీ దెబ్బ అని చెబుతున్నారు. అఖిలేష్ యాదవ్ సోదరుడిని వివాహం చేసుకున్న అపర్ణా యాదవ్ ఈ రోజు బీజేపీలో చేరారు. అపర్ణా యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య. ఆమెను పార్టీలోకి సాదరంగా స్వాగతించిన బీజేపీ నేతలు ఆమెను “ములాయం సింగ్ బహు (కోడలు)” అని సంబోధించారు. బీజేపీ కండువా కప్పుకున్న అపర్ణా యాదవ్ మాట్లాడుతూ.. ‘‘తాను ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటానని. ఇప్పుడు దేశానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. బీజేపీ పథకాలకు చాలా ఆకర్షితురాలినని.. పార్టీలో నా వంతు కృషి చేస్తాను” అని ఆమె ప్రకటించారు.

ఆమె పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ మౌర్య అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు తాము బీజేపీలోకి స్వాగతిస్తూ ఉన్నామని.. అఖిలేష్ యాదవ్ తన కుటుంబంతో పాటు రాజకీయాల్లో కూడా విజయవంతం కాలేరని చెప్పాలనుకుంటున్నానని అన్నారు. చాలా రోజుల చర్చల తర్వాత అపర్ణా యాదవ్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. యూపీలో ఇటీవల పలువురు నాయకులు పార్టీలు మారారు. బీజేపీకి చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రులతో సహా మరికొందరు నాయకులు ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలోకి వెళ్లారు.

అపర్ణా యాదవ్ 2017 UP ఎన్నికలలో లక్నో కంటోన్మెంట్ నుండి సమాజ్ వాదీ అభ్యర్థిగా పోటీ చేశారు, అయితే రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రీటా బహుగుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరారు. అపర్ణా యాదవ్ లక్నోలో మహిళల సమస్యల కోసం, ఆవులకు ఆశ్రయం కోసం పనిచేసే bAware అనే సంస్థను నడుపుతున్నారు. ఆమె గతంలో ప్రధాని మోదీని పొగిడి వార్తల్లో నిలిచారు.