Telugu States

కొత్త బిల్లుతో వస్తానన్న ఏపీ సీఎం.. విపక్షాలు ఏమంటున్నాయంటే

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీలో సోమవారం సంచలన ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఏపీకి మూడు రాజధానుల అంశంలో తమ వైఖరిలో మార్పు లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశంపై చర్చ ప్రారంభమైంది. సీఎం జగన్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించారని తెలిపారు. హైదరాబాద్ వంటి సూపర్ మోడల్ సిటీ వద్దే వద్దని, అలాంటి చారిత్రక తప్పిదానికి పాల్పడరాదన్న అభిప్రాయాలను బలపరుస్తూ 2019లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాతీర్పును బలంగా నమ్మి వికేంద్రీకరణ దిశగా అడుగులు ముందుకు వేశామని చెప్పారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలన్న తాపత్రయం వల్లే కార్యనిర్వాహక రాజధాని విశాఖలో, శాసన రాజధాని అమరావతిలో, కర్నూలులో హైకోర్టు ఇలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. రాయలసీమలో రాజధాని ఉండాలన్నది అక్కడి ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష అని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రక్రియ ప్రారంభించి ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని.. రకరకాల అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, అందుకే తాము బిల్లు ఉపసంహరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని స్పష్టం చేశారు.

అమరావతి అభివృద్ధికి గతం ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం కేవలం మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు కావాలని అన్నారు. ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలకు ఎంత కావాల్సి ఉంటుందని ప్రశ్నించారు. కానీ వాస్తవ పరిస్థితిలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక వసతులకే డబ్బు లేకపోతే రాజధాని ఊహాచిత్రం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఈ విధంగా ఆలోచిస్తే మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరం విశాఖ అని, అక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు. ఆ వసతులకు అదనపు హంగులు జోడిస్తే ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. విస్తృత, విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అయితే మూడు రాజధానులపై తమ నిర్ణయం మారదని, ఈ బిల్లును మరింత మెరుగుపరిచి, సమగ్రమైన బిల్లుగా ముందుకు తెస్తామని సీఎం జగన్ వెల్లడించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని.. రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ నేత నారా లోకేశ్ వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుగ్లక్ 3.0, మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశేనని లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని.. ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి… మూడు రాజధానులు చేయమని ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని చెప్పడం హైలైట్ అని అన్నారు. మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అని ట్వీట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమరావతికి సంబంధించి 54 కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం నుంచి తాత్కాలికంగా తప్పించుకునేందుకు బిల్లుల రద్దుకు ఉపక్రమించారని విమర్శించారు. కోర్టు తీర్పుతో ఈ అనిశ్చితికి తెరపడుతుందని భావిస్తే, సీఎం జగన్ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరదీసిందని పవన్ కల్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై మరింత స్పష్టతతో కొత్త బిల్లు తెస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని.. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒకే రాజధాని చాలని ఏకతాటిపై నిలిస్తే, ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందని విమర్శించారు. వైసీపీ సర్కారు తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా దూరదృష్టితో ఆలోచించాలని, ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధాని ఆవిర్భావానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అందుకు సంబంధించి పవన్ ప్రకటనను జనసేన విడుదల చేసింది.

Related Articles

Back to top button