కరోనా మహమ్మారి ప్రభావం దేశ వ్యాప్తంగా ఎన్నో పరీక్షలపై పడిన సంగతి తెలిసిందే..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే కరోనా కేసులు అధికంగా ఉండడం వలన వెనకడుగు వేస్తూ ఉంది. తాజాగా ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. అందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయగా ఆ పరీక్షల తేదీలను కరోనా తగ్గుముఖం పట్టాక ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పుడు పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఇన్ని రోజులూ ప్రభుత్వం చెబుతూ వచ్చినప్పటికీ కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో వాయిదా వేసింది. పదో తరగతి పరీక్షలపై జులైలో మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది.
పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్, ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా కరోనా సమయంలో పరీక్షలు వద్దంటూ డిమాండ్ చేస్తూ ఉంది. టీడీపీ నేత నారా లోకేష్ అమిత్ షాకు పరీక్షల రద్దుపై లేఖ కూడా రాశారు. పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో అమిత్ షా ను కోరారు లోకేష్. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు. పలు రాష్ట్రాల్లో సీబీఎస్ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని.. ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షల పట్ల అయోమయంలో ఉన్నారని నారా లోకేష్ చెప్పారు. కరోనా ఉధృతిలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టడం తగదని.. పరీక్షలు వద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేడుకుంటున్నా కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. పరీక్షలను రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదం అని ప్రభుత్వం తమ తీరును సమర్థించుకుంటూ ఉంది.