More

  ‘బాబు రోదన వ్యూహం’..! జగన్ రక్షణ దుర్గం..!!

  ‘కుప్పం’  భారీ ‘కప్పం’ కట్టింది. బాబు కంట కన్నీరు పెట్టించింది. మారాం చేసి సాధించుకునే పసిపిల్లల మనస్తత్వం బాబు ఏడ్పు రూపంలో ప్రెస్ మీట్లో కనిపించింది. కాలికింది నేల కదలబారినప్పుడు కలిగే పరివేదన చంద్రబాబు రోదనలో తొంగిచూసింది.

  నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం, అనేక ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులూ చూసిన గతం, వ్యూహప్రతివ్యూహాల్లో ఆరితేరిన కాకలుతీరిన నేత, మాధ్యమాలను తన మంత్రజాలంతో వశపరచుకోగల దిట్టగా పేరున్న నాయకుడూ….పాత్రికేయులముందు కన్నీరు పెట్టుకోవడమేంటని చాలా మంది ఆశ్చర్యపోయారు. మరికొంతమంది ఆనందించారు. ఈ ఏడ్పుగొట్టు రాజకీయం వెనుక ఏముందా అని ఇంకొందరు సందేహించారు. ‘పాపం బాబుగారు ఇలా అయిపోయారేంటని’ కొద్దిమంది అమాయకంగా బాధ పడి ఉంటారు కూడా.

  భారతదేశ చరిత్రలో, మరీ ముఖ్యంగా ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో తొలిసారి ‘గొడ్డలి’ అనే వ్యవసాయ పనిముట్టు ఆయుధంగా మారి అసెంబ్లీలోకి ప్రవేశించి అనేక ప్రతిధ్వనులను సృష్టించింది. ’బాబాయ్, గొడ్డలి, అమ్మకు మోసం, చెల్లికి అన్యాయం’ లాంటి మాటలు ‘హైకూ’ ప్రక్రియను తలపించాయి. సదరు హైకూను  పూరించుకోవడం ప్రజలపని.

  చంద్రబాబు ‘రోదన వ్యూహం’ ఆ వెనువెంటనే చంద్రబాబు కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా పెట్టిన ప్రెస్ మీట్ వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి. ఒకటికి వందసార్లు ‘మేము అనలేదు మొర్రో’ అని సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కరువునేలగా ప్రసిద్ధిగాంచిన రాయలసీమలో ఊహకందని వరదలు ఒకవైపు, బాబు రోదన పారాయణం మరొకవైపు ఏకకాలంలో వైసీపీని ఇరకాటంలో పడేశాయి.

  తెలుగుసీమ రాజకీయాల్లో ‘ఏడ్పుగొట్టు’ రాజకీయాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఎవరు మొదలుపెట్టారు? నిజంగానే ‘రోదన రాజకీయం’ ఫలిస్తుందా? ఎన్నికల్లో ఓటుగా తర్జుమా అవుతుందా? బాబు నిజంగానే దుఖించారా? వ్యూహాత్మకంగానే వైసీపీని డిఫెన్స్ లో పడేసేందుకు ఎంచుకున్న నాటకీయమైన ఏడుపా? అసెంబ్లీలో రికార్డు కాని మాటలు చంద్రబాబుకు మాత్రమే ఎలా వినిపించాయి? నిజంగానే వైసీపీ శాసన సభ్యులు బాబు సతీమణిని దూషించారా? కుప్పం తెచ్చి పెట్టిన దుఖమా? భార్యను దూషించినందుకు కలిగిన అవేదనా?

  ఆచరణలో అమలు చేసే విలువలకూ, ఆదర్శంగా పెట్టుకున్న విలువలకూ ఉన్న అంతరం చిత్రమైంది. ప్రజాస్వామ్య సంబంధమైన విలువల విషయంలో ఈ అంతరం మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనం సగర్వంగా చెప్పుకునే ప్రజాస్వామ్యం, గొప్పగా గౌరవించే రాజ్యాంగం, ఈ రెంటికీ ప్రాతినిథ్య ప్రతీకలుగా చెప్పుకునే చట్టసభల్లో ఉండే ప్రజాప్రతినిధులు తమ మూలాల్నే.. తరచూ హేళన చేస్తారు. ‘గౌరవ’ సభ కౌరవ సభగా రూపాంతరం చెందుతుంది. శాసనం ద్వారా ఎన్నికైన వారి నోట వెలువడే ‘‘కూరిన పేలుడు పదార్థాల’’ వంటి మాటలతో విలువల రాహిత్యం సాక్షాత్కరిస్తుంది.

  నవ్యాంధ్ర వర్తమాన రాజకీయాల్లో ‘విలువల రాహిత్యం’ తారాస్థాయికి చేరింది. తాము అనుభవిస్తున్న పదవులు రాజ్యాంగం ద్వారా సంక్రమించినవనీ, తమ చేతిలోని అధికారం ప్రజలు తమ హక్కుగా వినియోగించుకున్న ఓటు ద్వారా వచ్చిందనే స్పృహ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేషం కూడా కనిపించడం లేదు. తెలంగాణ రాజకీయాలు అందుకు మినహాయింపేమీ కాదు, కుడిఎడమల వ్యత్యాసం ఉంది అంతే!

  తెలంగాణలో స్వయాన ముఖ్యమంత్రే తన నిఘంటువును మార్చుకుని ప్రామాణికం చేసుకున్నారు కాబట్టి రెండో శ్రేణి నేతలకు బూతులు మాట్లాడే బాధ తప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అనుచరులు ప్రతిపక్షంపై అయినదానికీ, కాని దానికీ పరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు.

  బలాదూర్ గా తిట్టి ఆధిపత్యాన్ని స్థిరీకరించుకోవాలనుకునేవారు ఒకవైపు, ఏడ్చి సానుభూతి పొందాలనుకునేవారు మరొక వైపు. వెరసి చట్టసభలకు అవమాన భారం. ప్రజల ఎన్నిక పట్ల హేయభావం. మొత్తంగా రాజకీయాల్లో ‘విషభాషణ’ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ‘విషభాషణా సంప్రదాయానికి’ ఆమోదం కూడా లభిస్తోంది. ఇది ప్రమాదకరమైన ధోరణి.

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డి మొదలు, 1983లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వరకూ రాజకీయాల్లోకి నాటకీయత ప్రవేశించలేదు. రెండున్నర దశాబ్దాల పైచిలుకు తెలుగు ప్రాంత రాజకీయ చరిత్రలో ‘రాజకీయం’ మాత్రమే ప్రధాన అంశంగా ఉంటూ వచ్చింది.

  అప్పట్లో పార్టీ ఏదైనా హుందాతనం ఉండింది. పరస్పరం సంధించుకునే విమర్శల్లో కాసింత చరిత్ర, మరింత రాజనీతి తొంగిచూసేవి. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ‘తెలుగుదేశం పార్టీ’ ఆవిర్భవించిన తర్వాత రాజకీయాల్లోకి నాటకీయత ప్రవేశించింది. గవర్నర్ రామ్ లాల్ రాజ్యాంగ వ్యతిరేక వైఖరి చరిత్రలో నిలిచిపోయింది. ‘ద్రోహం’ వెన్నంటే ఉంటుందని నాదెండ్ల ఎపిసోడ్ నిరూపించింది.

  చంద్రబాబు కంట తడి తర్వాత అనేక పాత విషయాలు సోషల్‌ మీడియా వేదికగా ముందుకొస్తున్నాయి. చంద్రబాబుకు తన కూతురునిచ్చి వివాహం చేసి, ఆయన రాజకీయ జీవితానికి రాచబాట వేసిన నందమూరి తారక రామారావు కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

  1995 ఆగస్టు 27వ తేదీన సరిగ్గా ఇలాంటి ఓ మీడియా సమావేశంలోనే ఆయన కన్నీరు కార్చారు. ‘‘నేను నా జీవితంలో ఏనాడూ కంటతడి పెట్ట లేదు. ఎన్ని కష్టాలు – నష్టాలు ఎదురైనా, ఆపదలు వచ్చినా బేలగా ఏడవలేదు. కానీ ఈ రోజు 74 ఏళ్ల వయసులో నా అనుకున్న వాళ్లు, నా వాళ్ళు మోసానికి దిగితే, వెన్నుపోటు పొడిస్తే తట్టుకోలేకపోతున్నానంటూ’’ విలపించారు ఎన్టీఆర్.

  సరిగ్గా ఇరవై ఆరేళ్ల క్రితం పిల్లనిచ్చిన మామ కంటతడి పెడితే, నేడు అల్లుడు వెక్కివెక్కి ఏడ్చాడు. ఎన్టీఆర్ స్వయంగా తన రోదనకు కారణాన్ని నాడు ఆడియో రూపంలో ప్రజలకు తెలియజెప్పారు. ‘ఇదిగో వీడే హంతకుడు. ప్రజలారా మీ అన్నను చెబుతున్నాను వినండి’ అంటూ ‘జామాతా దశమగ్రహం’లో తేటతెల్లం చేశారు.

  చంద్రబాబునాయుడు గురించి బయటివాళ్లు కొత్తగా నిజాలు కనుక్కుని ఆరోపణలు చేయనక్కరలేదు. ఎన్టీఆర్ ను పదవీచ్చుతుడిని చేయడంలో ఆయనతో పాటు ఉన్న దగ్గుబాటి వేంకటేశ్వర రావు రాసిన ‘ఒక చరిత్ర కొన్ని నిజాలు’ పుస్తకంలో ఆనాటి ఘటనల వెనుక జరిగిన అసలు ఉద్దేశాలు తెలుస్తాయి. వంచనకు వారసత్వ ముద్ర వేసిన గతం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

  ఒక స్త్రీని బూచీగా చూపి చంద్రబాబునాయుడు నాడు ఎన్టీఆర్ ను పదవి నుంచి దించారు. ఆశ్చర్యకరంగా అదే చంద్రబాబు ‘స్త్రీ’ల పట్ల గౌరవం గురించీ, రాజకీయ సంస్కృతి గురించీ, మానవ సంస్కారం గురించీ మాట్లాడం ఆశ్చర్యకరం. 2014 ఎన్నికల తర్వాత కేంద్రం విషయంలో, ముఖ్యంగా ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు వ్యక్తిగత దూషణ, పరుష పదజాలం అప్రజాస్వామికంగా తోస్తోంది. ‘ఆలిని ఏలనివాడు పాలన ఏం చేస్తాడు’? అంటూ మోదీని వ్యక్తిగతంగా నిందించిన చంద్రబాబుకు తన కుటుంబం విషయంలో వీసమెత్తు మాటరాగానే రోషం పొడుచుకువచ్చింది.

  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బావను వెనకేసుకొస్తూ ఏకంగా ప్రధానిపైనే “చెప్పడానికి వీల్లేని పరుష పదజాలాన్ని” వాడిన  బాలకృష్ణ నేడు కుటుంబ గౌరవం గురించి వ్యాఖ్యానిస్తుంటే లోకంలో ఇంకెవరిదీ కుటుంబం కాదా.. అన్న సందేహం కలుగక మానదు.  

  రెండు దశాబ్దాల తర్వాత చంద్రబాబు ఏడవటానికి కారణం.. స్వయంకృతాపరాధం. కారణమేదైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరుసగా చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశాన్ని తిరస్కరిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఏడాదిపాటు ధర్నా చేసిన కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా సాధారణ ఎన్నికల్లో వైసీపీనే గెలిపించారు. సంవత్సరం పాటు వానలో, చలిలో ఆందోళన చేసినవారు ఓటు విషయంలో ఎందుకలాంటి వైఖరి తీసుకున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేదు.

  స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఉపఎన్నికలు ప్రతిచోటా అధికార పార్టీ జెండా ఎగరేసింది. అధికారం ఉంది కాబట్టి గెలిచారు అనడం అంత సులభంగా ఆమోదం పొందే వాదన కాదు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ప్రజలు ఓడించారు.

  దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎంత ప్రయాసపడినా, డబ్బు వెదజల్లినా, మద్యం ఏరులైపారినా ఓటును తనవైపు తిప్పుకోలేకపోయింది. అంతగా బలం లేని బీజేపీ గెలిచి సవాలు విసిరింది. కేవలం అధికారం, డబ్బు మాత్రమే కాదు, ఎక్కడ పార్టీలపట్ల ప్రజలకున్న విశ్వాస, అవిశ్వాసాలు కూడా ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కారణాలేవైనా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రదేశంలో పట్టునిలుపుకోలేకపోయింది.

  అట్లాగని గెలిచిన వైసీపీని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని ఆదరించారని చెప్పడానికి వీలులేదు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులపట్ల విశ్వాసం లేనప్పుడు అప్పటికే తిష్ఠవేసిన పక్షంవైపు మొగ్గడం పరిపాటి. వైసీపీ గెలిచిన నాటి నుంచీ నేల విడిచి సాము చేస్తోంది. సంక్షేమ పథకాల జోరు, ప్రభుత్వ హడావిడి తీరు కొంతకాలం జనరంజకంగా ఉంటుంది. కానీ, నిజం నిలకడగా తెలుస్తుంది.

  వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోని శ్రేణులు ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న ధోరణి అంత ఆమోదయోగ్యమైంది కాదు. ఆరోగ్యకరమైందీ కాదు. ఉన్నతమైన రాజకీయ విలువల స్థానంలో అధమమైన బూతుపురాణం చేరడానికి కారణం.. సమీప గతంలో ఆయా పార్టీల్లో చేరిన శ్రేణుల ఆర్థిక నేపథ్యం. వ్యాపారం, అందునా విలువలకు ఆస్కారం లేని వ్యాపారాల్లో ఉన్నవారు వ్యక్తిగత రక్షణకోసం రాజకీయాల్లో చేరడం మూలంగా ‘వ్యక్తిగత దూషణల పర్వం, విషభాషణ, బూతుపురాణం’ కూడా సహజంగానే జతకలిశాయి.

  వైసీపీలో కొంతమంది కేవలం చంద్రబాబును తిట్టేందుకు మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టేవారున్నారు. లోకేష్ ను ఎగతాళి చేసేందుకు పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసేవారున్నారు. తెలంగాణతో పోలిస్తే నవ్యాంధ్ర ఆర్థిక స్థితి అంత సవ్యంగా లేదు. పరస్పర రాజకీయ వైరాల మధ్య రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం వెనకపట్టు పడుతుంది. క్లిష్టమైన ఆర్థిక స్థితి ఎదర్కొంటున్న రాష్ట్రంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే అభివృద్ధి విషయంలో ఐక్యతను కాపాడుకునే సంయమనం కలిగి ఉండాలి.

  ఎన్నికల్లో వరుస ఓటములను చూస్తున్న తెలుగుదేశం పార్టీ విషయంలో వైసీపీ సైతం పరిణత స్వభావాన్ని కనపరచాలి మినహా ఎగతాళి చేయడం ఆరోగ్యకర వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తుంది. రెండు రెండే అన్న విధంగా సాగితే అంతిమంగా రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలుస్తుంది.

  ఇప్పటికే ‘‘ఏపీ రాజకీయాలంటే.. బూతుపురాణం’ అనే పేరు వచ్చేసింది. ప్రతిపక్షంపై ఒంటికాలిపై లేవడం వైసీపీకి సైతం ఏమంత శ్రేయస్కరం కాదు. అలాంటి దురుసు ప్రవర్తన రాజకీయ ప్రయోజనాలను తెచ్చిపెట్టదు. పైగా వైసీపీ దూకుడును చంద్రబాబు చాలా సులభంగా సొమ్ముచేసుకుంటాడు. తన సతీమణిని దూషించారంటూ ‘రోదన’ లంకించుకున్న బాబుకు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబం స్పందించడం ఎంతకాదన్నా ఏదో ఓ మోస్తరు ప్రభావాన్ని వేస్తుంది. ఇది టీడీపీకి అనుకూలంగా మారే అవకాశమూ ఉంది.

  వైరి పక్షాన్ని రెచ్చగొట్టి, వారు హద్దు దాటిన తర్వాత సదరు పరిణామాలను అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. అదే జరిగితే గత ఎన్నికల్లో చంద్రబాబుకు జరిగిన పరాభవమే వైసీపీకి జరిగి తీరుతుంది. బాబు దుఖం తాలూకు అసలు ఉద్దేశాలు రాజకీయ రంగంలో ఆరితేరినవారికి సులభంగానే అర్థమవుతాయి. సాధారణ ప్రజల స్పందన భిన్నంగా ఉండే అవకాశాన్ని కాదనలేం.

  అయితే ఎల్లవేళలా సానుభూతి మాత్రమే గెలుపును సులభతరం చేస్తుందనుకుంటే పొరపాటే. ఆ మాటకు వస్తే 2003లో ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ అమర్చిన క్లెమోర్ మైన్ల పేలుడులో గాయపడిన చంద్రబాబు.. తన రక్తపు మరకల ఫొటోలను ఊరూరా అంటించి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే వై.ఎస్ ధాటికి నిలవలేకపోయారు. చచ్చీచెడీ 50 స్థానాలు సాధించారు. మొత్తంగా సానుభూతి రాజకీయం చెల్లదు. ఆధిపత్య రాజకీయమూ అంతకన్నా చెల్లదు. ఒడుపుగా ప్రజాక్షేత్రాన్ని తనవైపు తిప్పుకోగలిగితే విజయం సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. నవ్యాంధ్ర రాజకీయ వాతావరణం గరిష్ఠ అనారోగ్య వాతావరణంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ స్థితి నుంచి బయటపడాలంటే పరిణతినీ, పెద్దరికాన్నీ ప్రదర్శించాలి.

  Trending Stories

  Related Stories