Telugu States

టీడీపీ ఛలో నర్సీపట్నంకు పిలుపు.. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిరసిస్తూ టీడీపీ నేడు ‘ఛలో నర్సీపట్నం’ కార్యాచరణకు పిలుపునిచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, గతంలో ఇలాగే పల్లా శ్రీనివాస్, సబ్బం హరి తదితర బీసీ నేతల ఆస్తులపై దాడులు చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం జగన్ కు అలవాటైందని విమర్శించారు. బీసీల పట్ల జగన్ చూపిస్తున్న కపట ప్రేమను నిలదీస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం నిరసనకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. నేతలను పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి టీడీపీ నాయకులు ఎవరూ వెళ్లకుండా బుచ్చయ్య పేట ఎస్‌ఐ, సిబ్బంది అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నారు. బుచ్చయ్యపేటలో పలువురు టిడిపి నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ఇకపై ప్రభుత్వ వైఫల్యాన్ని మరింత గట్టిగా ప్రశ్నిస్తామన్నారు. టీడీపీకి బ్యాక్ బోన్‌గా ఉన్న బీసీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని.. అయ్యన్న ఇంటిని అర్ధరాత్రి కూల్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడతారా..? అని నిలదీశారు.

Related Articles

Back to top button