More

    రమ్యను చంపిన వ్యక్తి పోలీసుల అదుపులో..!

    గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. నిందితుడిని శశికృష్ణ అనే యువకుడిగా భావిస్తున్నారు. అతడ్ని అరెస్ట్ చేసేంతవరకు సీసీ కెమెరా ఫుటేజి బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. అటు, హత్యకు ముందు శశికృష్ణ, రమ్యల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.

    నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని తెలిపారు. కేసు దర్యాప్తులో స్థానికులు కీలక సమాచారం ఇచ్చారని.. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని గౌతమ్ సవాంగ్ అన్నారు. గుంటూరు అర్బన్ పోలీసులు నిందితుడిని నరసారావుపేట మండలం పమిడిపాడు వద్ద అరెస్ట్ చేశారు. పోలీసులను చూసి బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వేగంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    రమ్య హత్యపై సీఎం జగన్ స్పందించారు. గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిందితుడికి దిశ చట్టం కింద కఠినశిక్ష పడాలని స్పష్టం చేశారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

    రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. రమ్య హత్య ఘటన గురించి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారని, ఆయన చలించిపోయారని హోంమంత్రి వెల్లడించారు. యువతిని హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తికి కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.

    Trending Stories

    Related Stories