More

    యాంకర్ ప్రదీప్ కు ఏపీ పరిరక్షణ సమితి వార్నింగ్

    తెలుగు టెలివిజన్ లో యాంకర్లు, ఆర్టిస్టులు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ ఉన్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ రాజధానుల గురించి మాట్లాడడంపై వివాదం చెలరేగుతోంది. ఓ షోలో ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ ఓ టీవీ షోలో ఆయన వ్యాఖ్యలు చేశాడు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లో యాంకర్‌ ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు ఓ మీడియా ఛానల్ లో మాట్లాడారు. కోర్టులో ఉన్న అంశాలపై ప్రదీప్‌ మాట్లాడడం తప్పని.. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారం ఇంకా కోర్టుల్లో ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో ప్రదీప్ రాజధాని గురించి టీవీ షోలో మాట్లాడడంపై పలువురు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీ రాజ‌ధాని విశాఖ అని ప్ర‌దీప్ కామెంట్ చేయ‌డం వివాదానికి దారి తీసింది. ప్ర‌దీప్ రాజ‌ధాని కామెంట్‌పై ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. తన వ్యాఖ్యను ఉపసంహరించుకోవ‌డంతో పాటు క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.

    వివాదాలలో బుల్లితెర నటులు:

    ఇటీవలి కాలంలో బుల్లితెర నటులు పలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. జబర్దస్త్ నటుడు హైపర్ ఆదిపై ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణ భాషను కించపరిచారంటూ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ భాషని, బతుకమ్మని, గౌరమ్మని కించపరిచేలా మాట్లాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదితోపాటు ఆ స్కిట్‌ రైటర్‌పై, మల్లెమాల ప్రొడక్షన్‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. గతంలో కూడా హైపర్‌ ఆదిపై మానవ హక్కుల సంఘానికి(హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్‌ ప్రదర్శిస్తున్నారంటూ అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై హైపర్ ఆది క్షమాపణలు చెప్పారు.

    ఇంకొంత మంది నటులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కొందరిపై బయట దాడులు కూడా జరిగాయి. కులాలను, మతాలను, ప్రాంతాలను కించ పరిచే విధంగా గతంలో కూడా కొందరు బుల్లితెర నటులు ప్రవర్తించారు.

    Trending Stories

    Related Stories