ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన మందులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు ఇచ్చే హోంకిట్లలో మార్పులు చేయాలని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్క్ పెట్టుకోని వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని చెప్పారు. కోవిడ్ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా చూడాలని జగన్ చెప్పారు. 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేయాలని సూచించారు. థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి, ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించి అనుమతించకూడదని ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని.. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని అధికారులను సూచించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ అమలు చేయాలని అన్నారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలని అన్నారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 24,280 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 984 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 244 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,82,843 మంది కరోనా బారినపడగా, 14,505 మంది మరణించారు. 20,62,732 మంది ఆరోగ్యవంతులు కాగా… 5,606 మంది చికిత్స పొందుతున్నారు.