More

    తిరుమలలో ఏపీ మంత్రుల తీరుపై విమర్శలు

    తిరుమలలో సాధారణ భక్తులకే పెద్ద పీఠ వేస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నా.. ఇటీవలి కాలంలో ఏపీ మంత్రులు, వారి బృందం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ సిఫారసులను కూడా రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కనపెట్టి మంత్రి రోజా ఉదయం 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం చేయించారు. గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. రోజా తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మరో మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా ఇదే విధంగా వ్యవహరించి విమర్శలపాలు అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్‌ అనుచరులతో కలిసి దర్శనం చేసుకోవడం విమర్శలకు దారితీసింది. దీన్ని ప్రశ్నించిన మీడియాపై ఆమె గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు.

    తిరుమల కొండకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. కొందరు మంత్రులు భారీ సంఖ్యలో అనుచరగణంతో వచ్చి బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నారు. దీంతో, సాధారణ భక్తులకు ఇబ్బంది మరింత పెరుగుతోంది. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచియున్నారు. వీరికి 8 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. నిన్న స్వామివారిని 83,880 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,710 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5. 86 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

    spot_img

    Trending Stories

    Related Stories