More

    కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రుల విమర్శలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేటీఆర్ పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తూ వస్తున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ ఇంధ‌న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయి.. అందుకే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌లు లేవన్నారు. ఏపీలో కూడా విద్యుత్ కోత‌లు లేవని చెప్పారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశామన్నారు. ఏపీలో అభివృద్ధి జరుగుతోందని.. పంచాయ‌తీరాజ్‌లోనే 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా రోడ్లు నిర్మించామన్నారు. తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు వస్తున్నాయని.. ఎవ‌రో ఒక‌ర్ని కించ‌ప‌రిస్తే ఓట్లు ప‌డ‌తాయ‌ని విమ‌ర్శించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

    కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా స్పందించారు. మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి అలా మాట్లాడటం దురదృష్టకరమని.. ఏపీకి 4 కాదు 40 బస్సులు వేసుకురావాలని మంత్రి అప్పలరాజు అన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం మా ఉద్దేశం కాదని, ఏపీలో తమ ప్రభుత్వ విధానం, అభివృద్ధి చూడాలని చెప్పారు. ఏపీలో నాడు- నేడు పథకంపై తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ప్రశంసించాయని.. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా మా ప్రభుత్వ విధానాలను అనుసరించారని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.

    ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ.. కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ గురించి కేటీఆర్ ప్ర‌త్య‌క్షంగా ఏమీ చూడ‌కుండానే ఆయ‌న స్నేహితుడు చెప్పిన మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మి ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసినా తాను ఎవ‌రికి చెప్పుకోవడం లేదు క‌దా అని అన్నారు. ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు ఫోన్ చేశాడేమో.. నేను నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే ఉన్నానన్నారు. క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉండాల్సి వ‌చ్చిందని.. ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదు క‌దా అని ప్రశ్నించారు. కేటీఆర్ బాధ్య‌త క‌లిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడ‌కూడ‌దని బొత్స హితవు పలికారు.

    శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ “తన మిత్రుడొకరు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలోని సొంతూరికి వెళ్లారని అక్కడికి వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి.. ఇక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి. అంతా అన్యాయంగా అధ్వానంగా ఉంది.. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లుందంటూ.. కొంతమందిని ఏపీకి పంపితే తెలంగాణలో ఎంత చక్కగా ఉందో అర్థమవుతుంది” అని వ్యాఖ్యలు చేశారు.

    Trending Stories

    Related Stories