వరుస సెలవులు రావడంతో తిరుమలలో తీవ్ర రద్దీ నెలకొన్న సంగతి తెలిసిందే..! సిఫార్సులతో వచ్చే వ్యక్తులు కొద్దిరోజులు దర్శనానికి రావద్దని.. ముఖ్యంగా సామాన్య ప్రజల దర్శనానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని చెప్పింది టీటీడీ. అయితే అక్కడ ఏపీ మంత్రి అండ్ కో చేసిన చర్యల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ ఇవాళ తిరుమలలో హల్‌చల్ చేశారు. ఇప్పటికే టీటీడీ ముందు జాగ్రత్తగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. దివ్యాంగులు, పిల్లలు, వృద్ధుల దర్శనాలతో పాటు వీఐపీ దర్శనాలను, సిఫార్సు లేఖలపై దర్శనాలు సైతం రద్దు చేశారు. అయితే మంత్రి ఉషాచరణ్ 50 మంది అనుచరులతో దర్శనం చేసుకోవడం విమర్శలకు దారితీసింది. మరో 10 మందికి సుప్రభాత సేవా టికెట్లు ఇచ్చారని కూడా తెలుస్తోంది. దీన్ని ప్రశ్నించిన మీడియాపై ఆమె గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.