ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా నగరి ఎమ్మెల్యే రోజాకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే..! ఆమె బాధ్యతలు చేపట్టాక పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులను కలుస్తూ ఉన్నారు. ఇతర పార్టీల నాయకులను కూడా కలిశారు. శనివారం విశాఖ వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితోనూ ఆమె భేటీ అయ్యారు. అధికారిక పర్యటన నిమిత్తం విశాఖ వచ్చిన కిషన్ రెడ్డికి విమానాశ్రయంలో రోజా స్వాగతం పలికారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, రోజా అల్లూరి విగ్రహానికి పూలదండలు వేసి, నివాళులు అర్పించారు.
అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయని రోజా చెప్పారు. ఆయన బతికింది 27 ఏళ్లే అయినా, 27 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా స్ఫూర్తి కలిగించారన్నారు.. ఆయన చనిపోయి 100 ఏళ్లు అయిందనుకుంటున్నా, నిజానికి ఆయనకు మరణం లేదని అన్నారు. అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను నెరవేరుస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. అల్లూరి స్ఫూర్తితో, ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకు హక్కులు కల్పించడంలో గానీ, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో గానీ, వారిని అభివృద్ధి పథంలోకి నడిపించాలని అల్లూరి కన్న కలలన్నీ నేడు సీఎం జగన్ నెరవేరుస్తున్నారని రోజా ఆకాశానికి ఎత్తేశారు. అల్లూరి సీతారామరాజు పేరిట మ్యూజియం కట్టడం కోసం 22 ఎకరాల స్థలం కేటాయించారని, మ్యూజియం నిర్మాణం కోసం అన్ని విధాలా సహకరిస్తున్న కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని రోజా అన్నారు.