కొద్దిరోజుల కిందట మంత్రి రోజా భర్త సెల్వమణి మాట్లాడుతూ తమిళ అగ్రహీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లు జరుపుకోవడం పట్ల విమర్శలు వ్యక్తం చేశారు.
తమిళ అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని.. ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించాలని అన్నారు. తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది వ్యాఖ్యలు చేశారు. తమిళ భారీ చిత్రాల షూటింగులు ఎక్కువగా హైదరాబాద్, విశాఖలోనే జరిగాయి. ఇలా ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ లు చేసుకుంటూ ఉండడం వలన చెన్నై లోని కార్మికులకు పనులు ఉండడం లేదని ఆయన అన్నారు. మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రాన్ని కించపరిచేలా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరు? అని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
ఏపీలో ఓవైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా అంటుంటే ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగులు జరగకుండా టూరిజం ఎలా అభివృద్ధి అవుతుంది ? రోజా భర్త వ్యాఖ్యలు దేనికి సంకేతమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో.. అందుకే రోజాకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా సెల్వమని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఎన్ని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.. వాటిలో ఏ ఏ వసతులు ఉన్నాయో రోజా ఒక్కరోజైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. రోజా తన మేకప్ మీద పెట్టిన శ్రద్ధ కనీసం ఒక్క శాతం అయినా పర్యాటక శాఖ పై పెట్టాలని.. తన భర్త చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.