బీజేపీ సీనియ‌ర్ నేత‌ జితేంద‌ర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం

0
877

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో న‌లుగురు వ్య‌క్తులు కిడ్నాప్‌కు గుర‌య్యారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీలోని జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్‌పై జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని నెంః105 ఇంటిలో జితేంద‌ర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆ ఇంటి ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశించి జితేంద‌ర్ రెడ్డి కారు డ్రైవ‌ర్ స‌హా న‌లుగురు వ్య‌క్తులను బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటన నుంచి తేరుకున్న జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది పోలీసుల‌ను కోరార‌ట‌.

ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు సౌత్‌ అవెన్యూలోని 105 నివాసంలో జితేందర్‌రెడ్డి ఉంటారు. గత 3 రోజులుగా ఆయన నివాసంలో కొందరు గెస్ట్‌లు ఉంటున్నారు. జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ తో పాటు ముగ్గురు గెస్ట్‌లను బలవంతంగా తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో నమోదైంది. ఈమేరకు ఢిల్లీ సౌత్‌ అవెన్యూ పీఎస్‌లో జితేందర్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేశారు. కట్టుదిట్టమైన భద్రత వుండే ఈ మార్గంలో ఓ మాజీ ఎంపీ ఇంట్లో కిడ్నాప్ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఘటన జరిగిన సమయంలో జితేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. అతని పీఏ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, “నాకు ఎవరిపైనా అనుమానం లేదు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయనివ్వండి” అని అన్నారు. కిడ్నాప్ బాధితుల్లో ఢిల్లీ తాపాలో జితేందర్ రెడ్డి డ్రైవర్, మహబూబ్‌నగర్‌కు చెందిన మున్నూరు రవి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీలో, కిడ్నాపర్లు రెండు కార్లలో ఆ ఇంటి ప్రాంగణంలోకి చొరబడి, బాధితులను కిడ్నాప్ చేసి వేగంగా పారిపోయారు. తాపా కొంతకాలంగా జితేందర్‌రెడ్డి వద్ద పనిచేస్తుండగా, రవి 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అనుచరుడిగా ఉన్నారు. జితేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరారు.