ఆనందయ్య మందుకు ఏపీ హై కోర్టు ఓకే..

ఆనందయ్య అందిస్తున్న మందుల విషయంలో అటు ఏపీ ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే..! సీసీఏఆర్ఎస్ (జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ) కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని, నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. సీసీఏఆర్ఎస్ నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందని చెప్పలేమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ మందు వాడుతున్నంత మాత్రాన ఇతర మందులు ఆపొద్దని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆనందయ్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగతా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది.
మరోవైపు ఏపీ హైకోర్టు కూడా ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ జరగ్గా.. మధ్యాహ్నం 1 గంట సమయానికి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 3 గంటల సమయానికి వాయిదా వేసింది. కోర్టులో విచారణ పునఃప్రారంభమైన అనంతరం, ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఆయుష్ శాఖ కమీషనర్ రాములు నాయక్ ఆనందయ్య మందుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు వాడడం వల్ల కరోనా తగ్గిందనడానికి నిర్దిష్ట ఆధారాలు లేవన్నారు. ఔషధం వల్ల దుష్ఫలితాలు కానీ, నష్టం జరిగిందన్న ఆధారాలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు ఆయుర్వేద ఔషధం కాదని.. ప్రభుత్వం దాన్ని ఆయుర్వేద ఔషధంగా గుర్తించడంలేదని అన్నారు. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని వెల్లడించారు. తద్వారా ఎక్కువమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామని.. గురువారం నాడు కోర్టు తుది నిర్ణయం వెలువరించనుందని, ఆ నిర్ణయం ఆధారంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఔషధం పంపిణీపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కంటి చుక్కల మందు వల్ల హాని జరగదన్న విషయం నిర్ధారణ కావాల్సి ఉందని.. దీనిపై పూర్తి ఆధారాలకు మూడు వారాల సమయం పట్టొచ్చని రాములు అభిప్రాయపడ్డారు.