సినిమా థియేటర్‌కు తాళం వేసే అధికారం తహసీల్దారుకు ఎక్కడిదంటూ ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ థియేటర్‌ను తెరవాలని ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్‌ను కొద్దిరోజుల కిందట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ మూసివేయించి తాళం వేశారు. దీంతో థియేటర్ మేనేజింగ్ పార్టనర్ ఎస్.శంకరరావు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వ్యవహరించారని చెప్పారు. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్ అధికారమిచ్చిన వ్యక్తికి మాత్రమే జప్తు చేయాల్సి ఉంటుందని, కానీ ఆ అధికారాన్ని తహసీల్దార్‌కు జాయింట్ కలెక్టర్ ఇవ్వలేదని పేర్కొంది. థియేటర్‌ను తిరిగి తెరవాలని న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశించారు.
టీడీపీ రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారవేత్తల సామాజిక నేపథ్యం ఆధారంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓ పద్ధతి ప్రకారం రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. ఓ ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ కల్యాణ్ నటించిన కొత్త చిత్రం విడుదల కావాల్సి ఉండగా, సరిగ్గా అదే సమయంలో టికెట్ల ధరల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని కనకమేడల సభలో ప్రస్తావించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయిందని, ఈ కారణంగా అనేక సినిమాలు విడుదల కాలేదని అన్నారు.