జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఓకే చెప్పిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హై కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిలిచిపోయిన కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం తోసిపుచ్చింది. ఏప్రిల్ 1న ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చారు. పోలింగ్ డేట్‌కి నాలుగు వారాలకు ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణలో ఎస్ఈసీ అప్పీల్‌పై నిర్ణయాన్ని వెల్లడించేంతవరకు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ మే 21న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
ఆ విషయంలో ఏపీ ప్రభుత్వానికి షాక్:
ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని ఏపీ హైకోర్టు ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని న్యాయవాది పారా కిశోర్ సవాల్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కనగరాజ్ ను నియమించారని తన ఫిర్యాదులో కిశోర్ చెప్పారు. ఈ నేపథ్యంలో కనగరాజ్ నియామక జీవోను 6 వారాల పాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిఫారసు మేరకు కనగరాజ్ ను గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారని ఈ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసిందని పారా కిశోర్ చెప్పారు. ఆ తర్వాత ఆయనను పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించారని తెలిపారు. కనగరాజ్ తో ముఖ్యమంత్రికి ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణమని చెప్పారు.