ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ లను బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ, విధులను బహిష్కరించారు. దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని న్యాయవాదులు విమర్శించారు.
దేశంలోని పలు హైకోర్టుల జడ్జిలను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. ఏపీ హైకోర్టుకు చెందిన మరో జడ్జి జస్టిస్ రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలితను కర్ణాటకు హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సూచించింది. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలిజీయం తెలిపింది. మద్రాస్ హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ వేలుమణిని కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది.