ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని, భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరచిన ప్లాట్లను అప్పగించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 4న వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది.
ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో సచివాలయ నిర్మాణానికి, ఉద్యోగుల గృహాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. సచివాలయ నిర్మాణం కోసం రూ.,1,214 కోట్లు, ఉద్యోగుల గృహాల కోసం రూ.1,126 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రొవిజన్ తీసుకువచ్చింది. ‘అమరావతి’లో సచివాలయ నిర్మాణానికి కేంద్రం బడ్జెట్‌లో అక్షరాలా లక్ష రూపాయలు కేటాయించింది. రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ కేటాయింపులు చేసింది. అమరావతిలో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (జీపీఏవో – కేంద్ర ఉద్యోగుల నివాసాలు) కోసం భూమి కొనుగోలుకు కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించింది. దీని కోసం గత ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 4.48 కోట్లను వెచ్చించింది. రూ. 1126.55 కోట్ల వ్యయంతో నిర్మించాల్సిన జనరల్ పూల్ రెసిడెన్షియల్ క్వార్టర్ల (జీపీఆర్‌ఏ)కు సైతం రూ.లక్ష కేటాయించింది. దీనికి సంబంధించి భూ కొనుగోలుకు ఇప్పటి వరకు కేంద్రం రూ. 18.03 కోట్లు ఖర్చు చేసింది. అకౌంటెంట్ జనరల్ (ఏజీ) సిబ్బంది నివాస భవనాల నిర్మాణానికీ రూ.లక్షనే కేటాయించింది. విజయవాడ, విశాఖపట్నంలో హాలిడే హోమ్ నిర్మాణానికి, విశాఖలో 806 జీపీఆర్‌ఏ నివాసాల నిర్మాణానికి, అందుకు భూములు కొనుగోలుకు, విజయవాడలో సీజీవో కాంప్లెక్స్ నిర్మాణానికి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున కేంద్రం కేటాయించింది.