More

    బిగ్ బ్రేకింగ్: ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిషత్‌ ఎన్నికల్లో పాటించలేదని న్యాయస్థానం చెప్పుకొచ్చింది.

    పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎల‌క్ష‌న్ కోడ్‌ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే..! దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఏప్రిల్ 8 న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6 వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఎస్.ఈ.సీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్‌ జడ్జికి హైకోర్టు అప్పగించింది.

    పరిషత్‌ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని విచారణలో న్యాయస్థానం భావించింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేద‌ని హైకోర్టు భావించింది. మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ను ఫాలో అవ్వకుండా ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్న పిటీషనర్ల వాద‌న‌పై హైకోర్టు మొగ్గుచూపింది. ఆ ఎన్నికే చెల్లదని.. ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసింది. ఏపీ ఎలెక్షన్ కమీషన్ కు వ్యతిరేకంగా తీర్పు జరిగింది. ఈ తీర్పుపై ఏపీ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్ లో కానీ, సుప్రీం కోర్టులో కానీ స‌వాల్ చేసే యోచ‌న‌లో ఉంది.

    Trending Stories

    Related Stories